Monday, December 22, 2025
E-PAPER
Homeఖమ్మండిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు భారీ షాక్ 

డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు భారీ షాక్ 

- Advertisement -

కాంగ్రెస్ నుంచి పది కుటుంబాలు సీపీఐ(ఎం) లో చేరిక 
నవతెలంగాణ – బోనకల్ 

ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలో ఆళ్లపాడు గ్రామంలో కాంగ్రెస్ కు ఊహించని భారీ షా క్ సోమవారం తగిలింది. నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం ఒక వైపున ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. మరొకవైపు ఆళ్లపాడులో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నుంచి పది కుటుంబాలు సోమవారం సీపీఐ(ఎం) నాయకుల సమక్షంలో సీపీఐ(ఎం)లో చేరారు. కాంగ్రెస్ నుంచి నూతనంగా సీపీఐ(ఎం)లో చేరిన వారికి సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు చింతల చెరువు కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్ సీపీఐ(ఎం) కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సీపీఐ(ఎం)లో చేరిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కందుల సత్యం, దొంతిబోయిన తిరపతి, మరీదు ధనుమూర్తి, మరీధు చిన్న సైదులు, మరీదు పరశురామ్ లు ఉన్నారు. ఈ సందర్భంగా చింతలచెరువు కోటేశ్వరరావు దొండపాటి నాగేశ్వరరావు సురేష్ ఆ గ్రామ మాజీ సర్పంచ్ లు పారా లక్ష్మీనారాయణ, మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని అహంకారంతో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లను తమకు ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తామని బెదిరించారన్నారు. అయినా ఓటర్లు విజ్ఞత ప్రదర్శించి సీపీఐ(ఎం), బిఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టారన్నారు. సీపీఐ(ఎం) మద్దతుతో బి.ఆర్.ఎస్ అభ్యర్థి తెల్లబోయిన నాగేశ్వరరావు సర్పంచిగా విజయం సాధించారన్నారు. అదేవిధంగా ఉపసర్పంచ్ గా సీపీఐ(ఎం)కి చెందిన బండి సైదమ్మ ఎన్నికయింది అన్నారు. దీంతో ఆళ్లపాడు గ్రామంలో కాంగ్రెస్ నాయకులకు ఓటర్ల తగిన గుణపాఠం చెప్పారన్నారు.

కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న అహంకార పూరిత విధానాలతో ప్రజలు విసుగు చెందారన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి పది కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశారని, కానీ కేవలం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. మిగిలిన పథకాల సంగతి ఏమిటని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

అధికారం శాశ్వతం కాదని, ప్రజలు, ప్రజా పోరాటాలు మాత్రమే శాశ్వతం అన్నారు. ఎన్నికలలో సీట్లు రావచ్చు, రాకపోవచ్చు.. అదే ప్రజా సమస్యల పరిష్కారానికి గీటు రాయి కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సీపీఐ(ఎం) చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై ఆళ్లపాడులో కాంగ్రెస్ నుంచి 10 కుటుంబాలు చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా సీపీఐ(ఎం)లో చేరిన వారు మాట్లాడుతూ.. గ్రామంలో తాము అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషికి ఆకర్షితులై తాము సీపీఐ(ఎం)లో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి బండి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పార ఉమ, ఉప సర్పంచ్ బండి సైదమ్మ, నాయకులు బండి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -