‘మానవత్వానికి బాసటగా నిలువనంతకాలం/ మనిషి మతానికి బానిసగా మారిపోతాడు’ అని అంటాడు స్వామీ వివేకానంద. అంటే మత ఛాందసత్వానికి లోనుకావడమే. ఇప్పుడు చాలామంది నేతల్లో జరుగుతున్నది అదే. లేకపోతే ప్రస్తుతం వున్న దేశపరిస్థితి ఏమిటి? మధ్యప్రదేశ్ బి.జె.పి. నేత విజరుషా చేసే వ్యాఖ్యలేమిటి?
అటు భారత సైన్యాన్ని, ఇటు యావత్ భారత్ ప్రజలను ఒక్క తాటిపై నిలబడేలా త్రికరణశుద్ధిగా కృషి చేస్తున్న సైనికాధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై ఈ అనుచిత వ్యాఖ్యలు గుప్పించడం ఏం తెలియజేస్తుంది? ఖురేషిని అందరూ ఓ గొప్ప దేశభక్తురాలిగా గుర్తిస్తూ, కీర్తిస్తూ, గౌరవిస్తుంటే, ఆయన మాత్రం మతం కళ్లతో చూస్తూ మతాన్ని పేర్కొంటూ పాక్ ఉగ్రవాదుల సోదరిగా వర్ణించడం ఎంతమాత్రం ఉచితం కాదు. ఒక విధంగా హేయమైనది కూడా.
అందుకే ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నాలుగు గంటల్లోగా ఆ బిజెపి నేతపై ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయాలని ఆదేశించింది.
ఏప్రిల్ 22న పెహల్గాం (కాశ్మీర్)లో 26 మంది పర్యాటకులను పాక్ ఉగ్రవాద ముష్కరులు నిర్దాక్షణ్యంగా కాల్చి చంపి పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తదుపరి కేవలం 15 రోజుల్లోగానే భారత సైన్యం సర్వశక్తులను మోహరించి పాకిస్తాన్‌పై గుణపాఠ దాడులను నిర్వహించింది. కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే కేంద్రీకరించి దాడులు చేసి ధ్వంసం చేయడానికి సైన్యం చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఈ దాడులతో పాకిస్తాన్‌కు మనదేశాన్ని ఎదుర్కోగల సత్తాలేదని రుజువైంది. భారతసైన్యం చూపిన సాహసం, తెగువ, దీక్ష, పట్టుదల అన్నీ దేశభక్తుల హృదయాల్లో ఒకరకమైన ఉద్వేగాన్ని, ఉత్తేజాన్ని కలిగించాయి. దేశ ప్రజానీకం అంతా రవంత శషబిషలకు పోకుండా భేషరతుగా సైన్యానికి అండగా నిలిచింది.
అయితే పాకిస్తాన్ ఒకపక్క కాల్పుల విరమణ అంటూనే మరో పక్క మాట తప్పి మోసపూరిత కాల్పులకు తెగబడింది. మన సైన్యం ధీటుగా తిప్పికొట్టి బుద్ధిచెప్పింది. అందుకే మన సైన్యం పట్ల దేశప్రజల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలు పెల్లుబికాయి.
‘ఉగ్రవాదాన్నే కాదు, ఉగ్రవాద శక్తుల వెనుక వున్నవారి పనికూడా పడ్తాం’ అని ప్రధాని మోడి పదేపదే చెప్తున్న మాటల వెనుక వున్నది దేశం పట్ల అకళంక అంకితభావం గల భారతసైన్యం వున్నదనే వాస్తవం ప్రతి ఒక్కరికి తెలుసు.
కానీ, యుద్ధం ఎప్పుడూ వాంఛనీయం కాదు. యుద్ధాలు సామాన్య ప్రజల వలన, సైన్యం వలన రావు. పాలకులు గైకొనే నిర్ణయాల నుండే వస్తాయి. ఒకసారి యుద్ధం వస్తే ఆపడం చాలా కష్టతరమౌతుంది. ఈ మధ్యలో ఎంతోమంది అమాయకంగా బలైపోతుంటారు. ముఖ్యంగా కాశ్మీరుతో సహా సరిహద్దు ప్రాంతాల జనం ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని జీవిస్తుంటారు. అంతెందుకు దాడులకు జడిసి నిత్యం రద్దీగా వుండే తిరుపతి పుణ్యక్షేత్రం కూడా వెలవెలబోయింది.
సృష్టిలో మనిషికి మాత్రమే దక్కింది మాట. మాటలతో చర్చలు సాగాలి. శాంతిని సాధించాలి. మానవీయ కోణంతో ఉభయ దేశానేతలు సామాన్య ప్రజల క్షేమం కోరేవారేతే, ఆ చర్చలు అర్ధవంతంగా పరిణతితో సాగి ఓ సంతృప్తికరమైన, ఫలవంతమైన ముగింపును ఇస్తాయి. అలాగాక ఏ ఒక్కరైనా దుర్భుద్దితో మొండిగా వ్యవహరిస్తే చర్చలు నిజాయితీగా సాఫీగా జరగవు సరికదా యుద్ధభయం నిత్యం నీడలా వెంటాడుతూనే వుంటుంది. విషపూరిత విద్వేషం కొనసాగుతూనే వుంటుంది.
కాగా యుద్ధాలు ఆయా దేశాల ప్రగతికి అవరోధంగా నిలుస్తాయి. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పుడూ గట్టునే వుంటూ వాణిజ్యానికే పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే కదా.
సందట్లో సడేమియాలా భారత్ – పాక్‌లు యుద్ధవిరమణ నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందే, కాల్పుల విరమణకు ఉభయదేశాలు అంగీకరించాయని, ఇదంతా తన మధ్యవర్తిత్వం వల్లనే సాధ్యమయిందని, అణుయుద్ధాన్ని సైతం ఆపగలిగానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. ఈ ప్రకటన ప్రపంచాన్ని నివ్వెరపరచింది.
మరి ఇది నిజమా! కాదా! అనే విషయం ప్రధాని మోడి పెదవి విప్పడం లేదు. ఇదిలా వుండగానే పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్) 2.4 బిలియన్ డాలర్లు అప్పుగా ఇచ్చింది. ఐ.ఎం.ఎఫ్. అమెరికా చెప్పుచేతల్లో నడిచే సంస్థ అని అందరికీ తెలుసు. ఆ అప్పు నుండి ఎక్కువ శాతం ఆయుధాలను పాకిస్తాన్ తిరిగి అమెరికా నుండే కొనుగోలు చేస్తుంది.
మరి ఈ కాల్పుల విరమణ, ఆ విరమణలో అమెరికా మధ్యవర్తిత్వ మర్మం ఎంతవరకు నిజమో ఇట్టే తెలిసిపోతున్నది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌ను అమెరికా వాడుకుంటున్నట్టు ఇప్పుడు మరల పాకిస్తాన్‌ను వాడుకోవాలని వెనుకనుండి ఎగదోస్తున్నదా? అనే అనుమానమైతే చాలామందికి కలుగుతున్నది. అప్పుడిక యుద్ధం ఒక పట్టాన ముగియక, ఆగక, నిత్యం రావణకాష్టంలా మండుతూనే వుంటుంది.
తీగలాగితే డొంకంతా కదిలినట్టు… పాకిస్తాన్‌కు అమెరికా ఆ విధంగా మద్దతు ఇస్తే… పాక్ ఉగ్రవాదానికి అది మద్దతు ఇచ్చినట్టు కాదా? మరి అప్పుడు అమెరికా భారతదేశానికి మిత్రదేశం ఎలా అవుతుంది? ఈ విషయం ప్రధాని మోడి స్పష్టం చేయవలసి వుంది. కనుకనే వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు తక్షణం పార్లమెంటు సమావేశాలు జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సి.పి.ఎం. పార్టీ ఒకడుగు ముందుకువేసి కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం అభ్యంతరకరం అని తేల్చి చెప్పింది.
ప్రధాని మోడి మౌనం వీడి సమాధానం చెప్పనంతవరకు ఎన్నో ప్రశ్నలు భారత ప్రజల హృదయాల్లో ఇలా చెలరేగుతూనే వుంటాయి. పెహల్గాం పర్యాటకుల్ని హత్య చేసిన ఉగ్రవాదులందర్నీ పట్టుకున్నారా? అసలు వారెక్కడ తలదాచుకున్నారు? వారికి ఎవరు రక్షణ కల్పిస్తున్నారు? ఉగ్రవాద దాడులకు తామే కారణమంటున్న జైష్ ఎ మహమ్మద్ సంస్థ అధినేత మజూద్ అజర్ ఎక్కడీ ఏ రహస్య స్థావరాల్లో దాక్కున్నాడు? పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని చెప్తున్నాం. అది ఎంతశాతం? సమూలంగానా? శేషం మిగిలిందా? ఉగ్రవాద నెట్‌వర్క్‌ను మట్టుపెట్టాలంటే అసలు అలాంటి సంస్థలు ఎన్ని వున్నాయి? ఇతర దేశాలతో వాటికి గల సంబంధాలు ఏమిటి? అందుకు వ్యతిరేకంగా మన ప్రజలను ఎలా చైతన్యపరచాలి? ప్రజల మద్ధతు ఎలా కూడగట్టాలి? ఇవన్నీ మన ముందున్న సవాళ్లు.
మరి ఈ యుద్ధంలో మనవాళ్లు ఎంతమంది మరణించారు? యుద్ధం అన్నాక నష్టాలు జరగక తప్పవని మన భారత వైమానిక దళం కూడా ప్రకటించింది. వందమందికి పైగా భారతీయులను హతం చేసినట్లు పాక్ ప్రకటించుకుంటున్నది. ఇందులో నిజమెంత? మొత్తం పరిస్థితంతా చాలా సంక్లిష్టంగా తయారైంది.
యుద్ధం ముగియడం ఉగ్రవాదం అంతం కావడం, కాశ్మీర్‌తో సహా దేశమంతటా శాంతి నెలకొనడం నేడు భారత ప్రజలు కోరుకుంటున్నది.
అసలు మతోన్మాదమే ఈ ముష్కర ఉగ్రవాదానికి ప్రేరణ అని మరోసారి రుజువైంది. మత ఛాందసత్వం పాలకులు గల ఏ దేశమైనా చివరకు ప్రజల్ని అనివార్యంగా సంక్షోభంలోనే నెడతాయని పాకిస్తాన్ ద్వారా విస్పష్టంగా వెల్లడైంది. ప్రజల్ని సుభిక్షంగా పాలించలేక, ప్రజలకు సుఖశాంతులివ్వక, ఆర్థికంగా తమ యావద్ధేశాన్ని పాక్ పాలకులు పరాధీన పాల్జేయడం మనం గమనిస్తున్నాం.
ఆయుధ ఉత్పత్తి కర్మాగాలకు నెలవుగా వున్న అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు ప్రపంచాన యుద్ధాలు ఎంత ఎక్కువగా జరిగితే అంత పండుగ. వాటిని చల్లారనీయకుండా గోతికాడ నక్కల్లా కాచుక్కూర్చునే వుంటాయి. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో గాని, ఇజ్రాయిల్ – గాజా యుద్ధంలోగాని ట్రంప్ రెండో రాకడ పెత్తనం (మధ్య వర్తిత్వం) వెనుక, ఆయా దేశాల చమురు నిధి నిక్షేపాలు, రిసార్టు లావాదేవీల బరితెగింపు తప్ప అణుమాత్రం మానవత్వం లేదని తెలుస్తున్నది. మనం గుణపాఠాలు నేర్వక ఆ ఉచ్చులో చిక్కుకుంటే ఆ రెండు యుద్ధాల మాదిరి మన భారత్ – పాక్ యుద్ధం కూడా మరో ఆరని కుంపటిగా మారడానికి మనం ఎంతో దూరంలో లేం. కావున ఈ కీలక తరుణంలో కేవలం ఉన్మాదం తలకెక్కించుకుని వెర్రిమొర్రి ప్రేలాపనలు పేలకుండా చాలా జాగరూకతతో వ్యవహరించవలసిన బాధ్యత ప్రతి పౌరునిపై వున్నది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య, లౌకిక, సర్వసత్తాక భారత గణతంత్ర రాజ్యం కనుక.
- కె.శాంతారావు, 9959745723