బాచుపల్లి విల్లాల్లో హైడ్రా చర్యలు..
సోషల్ మీడియా ట్రోలింగ్‌పై నివాసితుల పిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బాచుపల్లి విల్లాల్లో హైడ్రా చర్యలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ ఆంటిలియా విల్లాస్ నివాసితులు చేసిన ఫిర్యాదుపై కమిషన్ చైర్మెన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారుల ప్రకారం మార్చి 9న హైడ్రా అధికారులు సరైన అవకాశం ఇవ్వకుండా వారి నివాస సముదాయంలోని కాంపౌండ్ గోడను కూల్చివేశారు. అలాగే జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలను తరలించేందుకు మహిళలు సమయం కోరినప్పుడు వారిని పక్కకు నెట్టినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో తప్పుడు సమాచారం ప్రచారం కావడంతో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు, ట్రోలింగ్ జరుగుతున్నది. దీంతో నివాసితుల్లో భయం, మానసిక ఆందోళన కలుగుతోందని వారు తెలిపారు.
ఈ అంశాలను పరిశీలించిన కమిషన్, ఇటువంటి ట్రోలింగ్, అవమానకర వ్యాఖ్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కల్పించిన జీవన హక్కు, గౌరవం, గోప్యత మరియు ప్రశాంత జీవన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 18(సి) ప్రకారం తాత్కాలిక ఉపశమనం కింద రాష్ట్ర డీజీపీకి సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో ట్రోలింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అలాగే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు రోడ్డుకు పక్కన విద్యుత్ సరఫరా కల్పించి వీధి దీపాలను పునరుద్ధరించేందుకు సహకరించాలనీ, టీజీఎస్పీడీసీఎల్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు అవసరమైన సాంకేతిక సహాయం అందించాలని సూచించింది. సంబంధిత అధికారులు తమ నివేదికలను కమిషన్‌కు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
మానవ హక్కుల కమిషన్ సీరియస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



