Wednesday, July 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన

రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన

- Advertisement -

– బాధితులకు న్యాయం చేయాలి : ఎన్‌హెచ్‌ఆర్‌సీకి బీఆర్‌ఎస్‌ నేతల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం భయాందోళనల రాజ్యంగా మార్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, నేతలు డాక్టర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. తెలంగాణలో గిరిజనులు, పిల్లలు, రాజకీయ బాధితుల విషయంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌ నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌తో కలిసి వారి పిటిషన్‌ సమర్పించారు. ప్రజాస్వామ్య ఆధార స్తంభాలను కూల్చివేసి రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోం దని విమర్శించారు. విపక్షనాయకులపై కుట్రపూరిత దాడులకు పూనుకుంటున్నదని ఆరోపించారు. ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులపైనా, సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం చేసే వారిపైనా నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తోందని విమర్శించారు. 16 వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ, పారిశ్రామిక భూమి ఉన్నప్పటికీ ఫార్మా విలేజ్‌ నిర్మాణం పేరుతో లగచర్లలో గిరిజనుల భూములను లాక్కోవడం దారుణమన్నారు. రైతుల ప్రతిఘటనను అణచివేయడానికి చట్టవిరుద్ధ చర్యలు తీసుకున్నదని విమర్శించారు. రాజకీయ కక్షతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై 15 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయించిందని ప్రస్తావించారు. చాలా వరకు అవి కోర్టుల వద్ద నిలబడలేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను, పౌరులను భయపెట్టడానికి అరెస్ట్‌ అధికారాలు ,లుక్‌ఔట్‌ సర్క్యులర్ల (ఎల్‌ఓసీ) దుర్వినియోగం జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణలో ఆన్‌లైన్‌లో అభిప్రాయం వ్యక్తం చేస్తే జైలు శిక్ష అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19కి వ్యతిరేకమని తెలిపారు. ప్రభుత్వ స్నేహపూర్వక వార్తా ఛానెళ్లకు దర్యాప్తు వివరాలను ఎంపిక చేసి లీక్‌ చేయడం ద్వారా చట్టపరమైన ప్రక్రియలను సంచలనాత్మక మీడియా ట్రయల్స్‌గా మార్చడాన్ని తప్పుబట్టారు. విపక్ష నేతలపైనే కాకుండా సొంత క్యాబినెట్‌లోని వారిపైనా సీఎం రేవంత్‌రెడ్డి అక్రమ స్నూపింగ్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో నిర్లక్ష్యం, స్వచ్ఛతలేని ఆహారం అందించడం మూలాన వందమందికిపైగా మరణించారని తెలిపారు. పిల్లలను స్కూల్‌ వంటశాలల్లో పని చేసేందుకు ఒత్తిడి పెంచడం దుర్మార్గమన్నారు. ఇది బాల కార్మిక చట్టాల ఉల్లంఘనే అవుతుందని తెలిపారు. బాధితులకు, ముఖ్యంగా గిరిజనులు, పిల్లలకు పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించాలనీ, న్యాయమైన, సమాన న్యాయం, ఎఫ్‌ఐఆర్‌ నమోదులో వివక్ష లేకపోవడం, రాజకీయ లక్ష్యాలను ఆపడానికి పోలీసులకు బలమైన మార్గదర్శకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో పారదర్శక సంస్కరణలు చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -