”రక్తం రుచిమరిగిన మృగ విన్యాసం, గాజా వీధుల్లో పగిలిన గుండెల ధ్వని, ఇసుక రేణువుల్లా రాలే కన్నీటి జ్వాల, ఇజ్రాయిలూ! నీ నేల కరుణామయుడు పుట్టా డంటే ఎలా నమ్మాలి!” అంటాడు, గాజా అమాన వీయ దృశ్యాన్ని చూసిన కవి. నిజమే కదా! కనీసమైన మానవ లక్షణమూ కనిపించకుండా జరుగుతున్న దానవకాండకు ఇప్పుడీ ప్రపంచమంతా సాక్షి. ప్రపంచంలోని దేశాలన్నింటిలో గాజా ప్రజలతో పాటుగా జీవిస్తున్న ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు చూస్తుండగానే దారుణ మారణకాండ సాగిపోతున్నది. పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడికి ఏడాది దాటింది. ఆధునిక ప్రపంచంలో దేశాలు, ప్రజలు ఎలా జీవించాలో, సంబంధాలు ఏ విధంగా కొనసాగించాలో కొన్ని నియమాలను, సూత్రాలను నిర్దేశించుకున్నాయి. మన పురాణాలు, కావ్యాలు, రాజుల కథలు, రామాయణ మహా భారతాలు ఏవి చదివినా చట్టాలు, న్యాయాలు, నీతులు, కొన్ని పద్ధతులు కనిపిస్తాయి. అయితే వాటిల్లో దుర్మార్గం, దుష్టత్వం చూస్తాము! కానీ ఇద్దరు రాజుల మధ్య, రాజ్యాల మధ్య యుద్ధం వచ్చినప్పుడు సైన్యంతో తలపడేవారు. ఒక నీతికి బుద్ధులుగా ఉండేవారని చెప్పుకుంటాము. యుద్ధంలో స్తీల, పిల్లల, బలహీనుల జోలికి వెళ్లేవారు కాదు. లొంగి పోతున్నామని చేతులెత్తితే చంపేవాళ్లూ కాదు. అయినా ఈ యుద్ధాల్లో చిందే రక్తపాతాన్ని, విధ్వం సాన్ని చూడలేకే సిద్ధార్థుడు శాంతినెలా సాధించాలోనని సత్యాన్వేషణ కోసం రాజ్యం విడిచి వెళ్లి బుద్ధుడిగా జ్ఞానాన్ని సముపార్జిం చాడు. అది వేరే విషయం. కానీ రాజ్యం అనే నిర్మాణంలోనే ఆక్రమణ, యుద్ధం అనివార్యమవుతున్నాయి. రాజ్యం యొక్క లక్ష్యం సంపదపై ఆధిపత్యమే కనుక, విధ్వంసం, అమానవీయత అనివార్య ఫలాలు మిగిలాయి.
రాజ్యాలు నశించి, ప్రజాస్వామ్య ఆధునిక భావనలు అభివృద్ధి చెందాక సహజీవనం, సౌభ్రాతృత్వం, సహకారం, సమత వైపు ప్రజలు అడుగులేస్తున్న తరుణంలో ఒక సంవత్సరకాలంగా ఒక దేశం ఇంకో దేశంపై దాడులు చేస్తూ మనవ హననానికి పాల్పడటం దారుణమైన విషయం. ప్రతిరోజూ, ప్రతిక్షణం, ఎప్పుడు ప్రాణాలు పోతాయో, ఏ బాంబు పేలుతుందో తెలియని ఆందోళన, నరకయాతనలో గాజాలోని ప్రజలు అనుభవిస్తున్నారు. సాధారణ పౌరులు, మహిళలు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రజలంతా విలవిల్లాడుతున్నారు. జరుగుతున్న యుద్ధ కారణాలకు వారేమీ సంబంధీకులు కాదు. అందరిలానే బతికే హక్కున్న ప్రజలు. అసలు ఇది యుద్ధమే కాదు. యుద్ధమంటే రెండుపక్షాలూ తలపడాలి. ఇక్కడ ఏకపక్షంగా జరుగుతున్న పాశవిక దాడి మాత్రమే. ప్రజలపై రెండు రకాలుగా యుద్ధం జరుగుతున్నది. ఒకటి బాంబులు, క్షిపణులు వేసి చంపేయడం. రెండు పరోక్షంగా అక్కడున్న ప్రజలకు, పసిపాపలకు ఆహారం, నీళ్లు దొరక్కుండా, అందకుండా చేసి చంపడం. అంతేకాదు అనారోగ్యంతో బాధపడేవారికి చికిత్స, మందులు అడ్డుకుని చనిపోయేలా చేయడం. అందరం అంగీకరించి ఆమోదించుకున్న అతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమానవీయ దాడిని ఇజ్రాయిల్ పాలస్తీనాపై చేస్తున్నది.
పాలస్తీనాలో మానవతా సంక్షోభం ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుట్రెస్ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశాడు. గత కొన్నిరోజుల్లో ఇజ్రాయిల్ సైన్యం బెదిరింపులకు భయపడి దాదాపు ముప్పయివేల మంది ప్రజలు అభద్రజీవులై తమ గూడు వొదిలిపోయారు. ఆశ్రయం, ఆహారం, ఔషధాలు, నీరు వంటి ప్రాథమిక అవసరాల్లేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. అంతర్జాతీయ సంస్థలు, సహాయ బృందాలు వారికి ఆహారం అందించడానికి వెళ్తే వారినీ నిర్భంధిస్తున్నారు. సహాయం అందుకోవడానికి వచ్చి అన్నార్తులపై తుపాకులు ఎక్కుపెట్టి చంపేస్తున్నారు. అట్లా వేలాదిమంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇప్పుడు కొంతకాలంగా గాజాకు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇంక్యుబేటర్లు మూతపడ్డాయి. రోగులు మృత్యువాత పడుతున్నారు. ఆకలితో పసి పిల్లలు రోధిస్తున్నారు. ఇసుకతో కడుపును నింపుతున్న దృశ్యాలు మనుషులె వరినైనా చలింపచేస్తాయి. యుద్ధనీతికి, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ దాడి అమానవీయమైనది. ఇలాంటి అమానవీయదాడికి పాల్ప డుతున్న ఇజ్రాయిల్‌కు అండదండలు అందిస్తున్నది అమెరికా. మొన్న ఇరాన్‌పై యుద్ధానికీ ఇజ్రాయిల్ సై అని చావు దెబ్బ తిన్నది. ఇరాన్ కూడా ధీటుగా జవాబివ్వడంతో, ఆ దేశ ప్రజలు కూడా సారీ ఇరాన్ అని క్షమార్పణ కోరాయి. అక్కడి ప్రజలకు యుద్ధ విధ్వంసం తెలిసొస్తే తప్ప ఆ పరిస్థితి రాలేదు. కానీ ఏడాదికాలంగా పాలస్తీనా గాజాపై విధంసాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయిల్ ఆగడాలను ప్రపంచం తీవ్రంగా ఖండించాల్సి ఉన్నది. ధర్మం, నీతిసూత్రాలను నిత్యం వల్లించే మనదేశ ప్రధాని, ఇంత అమానవీయం చోటుచేసుకుంటున్న గాజా విషయమై నోరు విప్పడం లేదు. ఎప్పటినుంచో పాలస్తీనాకు మనకూ ఉన్న సత్సంబంధాలను సైతం నిరాకరించి అమెరికా, ఇజ్రాయిల్‌తో అంట కాగడం, దేశానికి చెడ్డపేరు తెస్తున్నది. ప్రపంచమూ, ఇంతమంది మనుషులం చూస్తుండగానే మానవతా ధ్వంస రచన జరగడం అత్యంత బాధాకరం. గాజాకు మద్దతుగా నిలవడం కనీస మానవ ధర్మం.
మానవతా విధ్వంసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES