కేతిగాడు : ఓరోరి ట్రంప్‌గా.. మోసకారి ట్రంప్‌గా.. నీ మాటలు చెల్లవురో… నీ ఆటలు సాగవురో… పొద్దునొకటి కూస్తావు, రాత్రి ఒకటి అరుస్తావు, నిను చూస్తే తెలుస్తుందిరో పిచ్చోని స్వర్గమంటె ఏమిటో… రేరు! నీవో పెద్ద పిచ్చోనివిరా. నీ మాటలు ఇక ఎవరూ నమ్మటంలా.. నాన్నా పులొచ్చే కథలా అయిందిరా నీ బతుకు. అందుకే మేమంటున్నాం. నీవు ఆడే ప్రతి మాటలో కపటముంది. కుట్ర వుంది. కుతంత్రం వుంది. నీ దేశంలోనే నిన్ను దిగిపొమ్మని జనాలు లొల్లి చేస్తన్రు. జర సోరులో ఉండ్రోరు.
జుట్టుపోలుగాడు : రేరు ఇరాన్‌గా. ఏం కూసావ్. నాకు సోరు లేదా. ఈ పెపంచకం నేనాడించేలా ఆడాల. నా పాటలే పాడాల. ఆ సోయింద్రోరు నాకు. నేను అగ్రదేశానికే అగ్రనేతను. ఒక్క అమెరికాకు ఏందెహె. ఈ పెపంచానికే అగ్రనేతను.
కేతిగాడు : రేరు ట్రంప్‌గా.. పోస్కోలు మాటలు కట్టిపెట్టి అసలు ఇసయానికి రారా.
జుట్టుపోలుగాడు : యుద్ధం టెంపరరీగా ఆగాలంటే నా పదిహేను షరతులకు నీవు లొంగి రావాల్రా. హార్మోజ్ జలసంధిని తెర్వాలి. నీ దగ్గర అణుబాంబులు వుండకూడదు. నీ యురేనియం అంతా మాకిచ్చేయాలా. ప్రతిసారీ మీ ఆయుధాలను, బాంబులను తనిఖీ చేస్తాం. అస్సలు మీ దేశంలో అణుశుద్దే వుండకూడదహె. మీ బంటు హిజ్బొల్లాకు నీవు సాయం చేయకూడదు. ఇలాంటివి ఇంకా సానా వున్నాయిరో. వాటిని నీవు అంగీకరిస్తేనే యుద్ధానికి బ్రేక్.
కేతిగాడు : అబ్బ.. ఛ… అసలు బ్రేక్ ఎవడడిగాడ్రా నిన్ను. నాకు నీవు షరతులు పెట్టడం కాదు, నీకు మేమే షరతులు పెడ్తాంరోరు.
మా ఇరాన్‌పై ఆంక్షలు పూర్తిగా ఎత్తేయాలి. మా దేశాల నేతలను చంపడం మానేయాలి. అసలీ యుద్ధం వల్ల జరిగిన నష్టపరిహారం మాకు చెల్లించాలి. అంతకంటే ముందు మా గల్ఫ్ దేశాల్లోని మీ ఆయుధ, సైనిక స్థావరాలన్నీ ఎత్తేయాలి. అసలు ఏమనుకుంటున్నావ్రా నీవు? ఈ పెపంచానికేమన్నా పెద్ద పోలీస్‌వా? ఎవడిచ్చాడ్రా నీకా అధికారం. అన్నీ నాకే కావాలంటావ్. కెనడా అంటావ్. క్యూబా అంటావ్. గ్రీన్లాండ్ అంటావ్. ఏదో సరదాగా యుద్దాలు చేస్తానంటావ్. ఏం తమాషాగా వుందా… తిత్తి తీస్తా నా కొడకా…
జుట్టుపోలుగాడు : ఏంట్రా నీవు తీసేది. నీవు ఓడిపోయావని నీ అణుబాంబులు పాతరేశానని ప్రపంచానికి ప్రకటించేశానెహె తెల్సా.
కేతిగాడు : అలాగా.. మరైతే చర్చలెందుకు బిడ్డా. అందుకే నీదో పిచ్చోని స్వర్గం అని పాడుతున్నా.
అల్లాటప్పాగాడు (ప్రవేశం) : రేరు రేరు.. నీవూ నీవూ మాట్లాడుకుంటే సరిపోద్దా… మరి నా సంగతేంది? గ్రేటర్ ఇజ్రాయిల్ సాధించేదాకా నేను నిద్రపోను. నేను ఇరాన్ ప్రధాని నెతన్యాహును. ఇరాన్ పై బాంబు లేస్తూనే ఉంటా.. ఊస్కో. ఉస్కో.. అంటూ ఈ ట్రంప్గాడ్ని ఉసిగొల్పింది నేనే.
కేతిగాడు : ఓహో చచ్చిపోయి బతికిపోనివా. అమెరికా షిప్ అలగ్జాండర్ పై దాడిచేసినా, ఖరీదైన ఎఫ్ -18 యుద్ద విమానాన్ని దెబ్బ తీసినా నీకు బుద్ధి రాలేదు. నా సత్తా చూసి ఆ ట్రంప్ గాడే నీ కాళ్ల బేరానికొచ్చాడు. ఆఫ్ట్రాల్ నీవెంత? నేను ముందే చెప్పాను. యుద్ధం ఏమాత్రం ముందుకు సాగినా గల్ఫ్‌లోని మీ సైనిక స్థావరాలన్నీ మా మందుపాతర్లతో స్మాష్. హార్మోజ్ జలసంధి బంద్. పెట్రోమంటలు ప్రపంచాన్ని అంటుకున్నాయిగా. గమనించలా… తెగించినోనికి తెడ్డే లింగం. బరితెగించా.. కాస్కోండ్రి.
బంగారక్క (ప్రవేశం) : రాజుకంటే మొండోడు ఎప్పుడూ బలవంతుడే. ఇరాన్ అలా మొండిగా మార్చింది ఈ ట్రంప్. నెతన్యాహులే. ఇది ముమ్మాటికి నిజం. లోకం కూడా అలానే కోడై కూస్తున్నది. యుద్ధం ఇప్పుడు సరాసరి మన ముంగిట్లోకి వచ్చేసింది. పెట్రోల్, గ్యాస్ కొరతతో ధరలన్నీ మండుతున్నాయి. కోవిడ్‌లో లాక్డౌన్ మాదిరి ఇంధన లాక్డౌన్ ప్రపంచాన్ని ముంచెత్తుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు.
ముగ్గురూ : మరి మనమేం చేయాలి?
బంగారక్క : ఏదైనా గట్టున వుండి మాట్లాడడం వేరు. యుద్ధంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడుతున్నవారి స్థానం నుండి నేతలు మాట్లాడాలి. ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా యుద్ధం తక్షణం ఆపాలి. ఆపేలా నేతలపై ఒత్తిడి తేవాలి. శాంతి మానవాళి ఊపిరని ఎలుగెత్తి చాటాలి.
– కె.శాంతారావు, 9959745723



