ఆయన విలువలు, నిబద్ధత, క్రమశిక్షణ అందరికీ ఆదర్శం
కుటుంబ బాధ్యత, సామాజిక స్పృహతో మెలిగిన వ్యక్తి
పేపర్ బాయ్ టు ఎడిటర్ పుస్తకావిష్కరణలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామాన్య కుటుంబంలో పుట్టిన ఎస్ వినయకుమార్ అసామాన్యుడిగా ఎదిగారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయన పార్టీ పట్ల, సిద్ధాంతం పట్ల, సంస్థ పట్ల, కుటుంబం పట్ల ఎంతో వినయంగా విధేయుడిగా ఉన్నారని అన్నారు. ప్రజాశక్తి పేపర్‌బాయ్ గా పనిచేసి అదే పత్రికకు ఎడిటర్ స్థాయి వరకు ఎదిగిన తీరు అందరికీ ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. వివాద రహితుడిగా సమాజంలో ఆయన గుర్తింపు పొందారనీ, ఎంతో లౌక్యంగా వ్యవహరిస్తారని అన్నారు. ఆయన వ్యక్తిత్వం, పాటించిన విలువలు, నిబద్ధత, క్రమశిక్షణ అందరికీ ఆదర్శమని వివరించారు. కుటుంబం పట్ల బాధ్యత, సామాజిక స్పృహతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. పేపర్‌బాయ్ టు ఎడిటర్ పుస్తకాన్ని అందరూ చదవాలనీ, ఎన్నో విషయాలపై అవగాహన కలుగుతుందన్నారు.
‘పేపర్‌బాయ్ టు ఎడిటర్’ పేరుతో ఆత్మకథ పుస్తకాన్ని ప్రజాశక్తి మాజీ సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వినయకుమార్ రాశారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ పుస్తకాన్ని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జి రాధారాణి ఆవిష్కరించారు. మహేంద్ర విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ లా మాఢభూషి శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి చైర్మెన్ కె శ్రీనివాసరెడ్డి, నమస్తే తెలంగాణ మాజీ సంపాదకులు అల్లం నారాయణ, ప్రజాశక్తి మాజీ సంపాదకులు తెలకపల్లి రవి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, వినయకుమార్ సతీమణి కె సుజావతి తదితరులు ప్రసంగించారు. సమన్వయకర్తగా కంబాలపల్లి కృష్ణ, వేదికపైకి మద్దాలి ఉజ్వల వక్తలను ఆహ్వానించగా సదుర్ల సందీప్‌కుమార్ వందన సమర్పణ చేశారు.
ఈ పుస్తకం కథ కాదు వాస్తవం : మాఢభూషి శ్రీధర్
వినయకుమార్ రాసిన పుస్తకం కథ కాదనీ, వాస్తవమని మహేంద్ర విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ లా మాఢభూషి శ్రీధర్ అన్నారు. జీవితంలో చూసిన, తెలుసుకున్న అనేక విషయాలను ప్రస్తావించారని గుర్తు చేశారు. జర్నలిజం గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో అందరికీ ఉపయోగపడేలా రాశారని వివరించారు. ఆయన రచన, రాసిన పద్ధతి అందరికీ అర్థమయ్యేలా ఉందన్నారు. జర్నలిజం, సిద్ధాంతం, జీవితం, కుటుంబ పట్ల ఎంతో అంకితభావంతో వ్యవహరించారని అన్నారు. టెక్నాలజీ పెరుగుతున్నదనీ, అందుకనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కుటుంబ వ్యవస్థ గొప్పదనీ, దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.
వినయ్ జీవితం ఆదర్శం : కె శ్రీనివాసరెడ్డి
వినయకుమార్ జీవితం ఆదర్శమని మీడియా అకాడమి చైర్మెన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. కష్టాలు, బాధలు అనుభవించిన వ్యక్తులు ఈ స్థాయికి ఎదగడం అరుదుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం జర్నలిజం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయన్నారు. కానీ అవి శాశ్వతం కాదని అన్నారు. పాఠకులు ప్రశ్నించే స్థాయికి ఎదిగారనీ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా మీడియా ఉండాలని సూచించారు. కమ్యూనిస్టు జర్నలిజం వల్లే ఇతర మీడియా సంస్థలు ప్రజల సమస్యల గురించి రాయకుంటే వాడుకలో ఉండలేమనే పరిస్థితి వచ్చిందన్నారు.
విలువలతో ఎదిగిన వినయ్ : అల్లం నారాయణ
వినయకుమార్ విలువలతో ఎదిగారని నమస్తే తెలంగాణ మాజీ సంపాదకులు అల్లం నారాయణ అన్నారు. వివాదాల జోలికి పోకుండా ఉన్నారని చెప్పారు. గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నారని వివరించారు. నిబద్ధతతో పనిచేశారని అన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం ఎంతో ఉందన్నారు. ప్రజాశక్తి పేపర్‌బాయ్ గా పనిచేసి అదే పత్రికకు ఎడిటర్ కావడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక్కడి వరకు రావడానికి ఆయన తల్లిదండ్రులు, సొంత శ్రమ కారణమని చెప్పారు.
వినయకుమార్ విప్లవకుమార్ : తెలకపల్లి రవి
వినయకుమార్ విప్లవ కుమార్, విలేకరి కుమార్, విజ్ఞాన కుమార్ అని ప్రజాశక్తి మాజీ సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు. కానీ వివాద కుమార్ కాదన్నారు. వామపక్ష జర్నలిజమే ప్రధాన స్రవంతి జర్నలిజమని అన్నారు. వామపక్ష పత్రికలే లేకుంటే సామాన్యుల సమస్యలు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చేవా?అని అడిగారు. వినయకుమార్ చతుర్భాష సంపన్నుడని చెప్పారు. సవాళ్లను తట్టుకోవడానికి సమయాత్తం కావాలన్నారు.
వినయ్ ఫ్యామిలీ మ్యాన్ : పాశం యాదగిరి
వినయకుమార్ ఫ్యామిలీ మ్యాన్ అని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. ఆయనకు వ్యక్తిగత నిజాయితీ, రాజకీయ నిజాయితీ ఉందన్నారు. ఒక్క తప్పు కూడా చేయలేదని వివరించారు. వినయకుమార్ వెంటనే సుజావతి ఉండడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
నిజ జీవితాల గురించి తెలుసుకున్నా
ఈ పుస్తకం చదివి నిజ జీవితాల గురించి తెలుసుకున్నానని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జి రాధారాణి అన్నారు. ఈ పుస్తకం చదువుతుంటే వినయకుమార్ జీవితంలో, తమ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలకు ఎన్నో పోలికలున్నాయని వివరించారు. కుటుంబ విలువల గురించి ఎన్నో విషయాలు అర్థమయ్యాయని చెప్పారు. చిన్న కుటుంబం నుంచి ఎడిటర్ స్థాయి వరకు, సామాన్యుడిగా జీవితం ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీరు ఎంతో మందిని ప్రభావితం చేస్తుందన్నారు. జర్నలిజంలో సమగ్ర సమాచారం ఉండాలంటే ఎలా రాయాలో తెలియాలంటే ఈ పుస్తకాన్ని చదవాలని కోరారు.
జస్టిస్ రాధారాణి
మా నాన్న వల్లే సాహిత్యంపై అభిరుచి
తమ నాన్న వల్లే వల్లే సాహిత్యం అభిరుచి కలిగిందని ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్ వినయకుమార్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రభావం తనపై అపారంగా ఉందన్నారు. ఈనాడు శిక్షణతో తేలిక పదాలను వాడాలనేది నేర్చుకున్నానని వివరించారు. సామాజిక దృష్టితో ప్రతి పదాన్ని రాయాలన్నారు. తెలంగాణ సంస్కృతి నిజంగానే గంగా జమునా తెహజీబ్ అని చెప్పారు. ప్రజాశక్తి జర్నలిజం స్కూల్ అన్ని మీడియా సంస్థల్లో పాత్రికేయుల కొరతను తీర్చిందన్నారు. ఎత్తిపోతల పథకాల వల్లే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు కోనసీమగా మారిందని అన్నారు. నీటి వనరులు అందుబాటులోకి రావడంతో వలసలు ఆగిపోయాయని చెప్పారు. వినయకుమార్ సతీమణి కె సుజావతి మాట్లాడుతూ వినయకుమార్ ఎంతో నిబద్ధత ఉందన్నారు. ఆయనకు ప్రజాశక్తి సంస్థ ఇచ్చిన వాహనాన్ని కార్యాలయ అవసరాలకు తప్ప కుటుంబ సభ్యుల కోసం వినియోగించే వారు కాదని గుర్తు చేశారు.
వినయకుమార్



