జుట్టుపోలుగాడు : జగజ్జేత… అమెరికా అగ్రనేత, ఈ డోనాల్డ్ ట్రంప్‌కు అహో.. ఏమి ఈ ఘోర పరాభవము? నా సొంత గడ్డ అమెరికా వాసులకే ప్రప్రథమ ప్రయోజనము చేకూర్చెదనని బాస చేసితిని. నాదువారని నేను త్రికరణశుద్దిగా నమ్మిన నాటోకూటమియేనాకు ఎదురు తిరుగుతున్నది. అదియునూ గాక నా సొంతదేశంలోనే లక్షలాది జనం తండోపతండంబులుగా వీధుల్లోకి వచ్చి ‘రాజులు వద్దు – రాజరికాలు వద్దు’ అంటూ ఘీంకరించుచుండిరి. ఏమియూ అర్థం కాకున్నది. ఇది విధి వైపరీత్యము కాదు కదా..?!
కేతిగాడు : వంకాయ్. అద్దాలమేడనుండి బయటకొచ్చి చూడు. నువ్వసలే పండుకోతివి. కల్లుతాగావ్. పైగా నిప్పుతొక్కావ్. అందుకే పిచ్చికక్కిరిలా పూటకోమాట మాట్లాడుతున్నావ్.
జుట్టుపోలుగాడు : ఆ.. ఏమా మాటలు. అమంగళవాక్కులు ప్రతిహతమౌగాక. అమెరికా అధ్యక్షునిగా రెండో రాకడ బహుకొద్దిమందికే స్వంతం. ఎన్నో కలలతో, ఎన్నెన్నో ఊహాగానాలతో నేనా పదవిని చేపట్టితిని. అమెరికాయే గాదు, మొత్తం భూగోళమంతటిని నా గుప్పెట బంధించాలని అనుకున్నా. ఏ దేశాధినేతనైనా ‘బెండ్ ఆర్ బ్రేక్’ (వంచు లేక తుంచు) సిద్ధాంతంతో నావైపుకు తిప్పుకోవాలనుకున్నాను. శక్తి వంచన లేకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నాను. ఆధునిక యుగాన ఇంతకుమించి పాలనా నీతిగాని, వాణిజ్య నీతిగాని ఏమున్నది?
ఇరాన్ ప్రజలు తమ వృద్దనేత అయితుల్లా ఖొమైనీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమాలు చేశారే. నా ఆప్తమిత్రుడు నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించినవాడు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు సలహా మేరకు అకస్మాత్తుగా ఇద్దరం కలిసి ఏకపక్షంగా యుద్ధం ప్రారంభించితిమి. ఒకే దెబ్బతో ఖొమైనీని, అతగాని అనుచరులను మట్టు బెట్టితిమి. మేమాశించిన రీతిలో ఇరాన్ ప్రజలు మా చర్యకు హర్హామోదాలు వ్యక్తం చేయకపోగా, మాకు వ్యతిరేకంగా నిలబడుచుంటిరే. మమ్మల్నే అంతం చేయాలనిప్రతిన బూనుతున్నారే. ఇదేమి విడ్డూరము? ఎంతగా యోచించిననూ అర్థం కాకున్నది.
కేతిగాడు : రేయ్ ట్రంప్‌గా! ఎనకటి ఎవడో నీలాంటోడు ‘పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నాడట’. అలా వుందిరోయ్ నీ తంతు. ఖొమైనీని చంపాలని బడిపిల్లలపై బాంబులేసి చంపుతావా? పాపం, పుణ్యం తెలియని పసిపిల్లల్రా వాళ్లు. అసలు యుద్ధం అంటే ఏంటనుకున్నావ్రా నువ్వు? ఏమాత్రం సిగ్గు, లజ్జ, అభిమానం, విచక్షణ లేకుండా బాంబులేసి పిల్లలు, తల్లులు, అమాయకపు ప్రజలను చంపడమేంట్రా. గాజాలో కూడా నీ జిగ్నీదోస్త్ నెతన్యాకు కూడా అదే గదరా చేసింది. వాడో జాతి విద్వేష హంతకుడు. నువ్వు వాడ్ని మించిపోయావ్రోరు. మీరిద్దరూ మనుషులే కాదు. మనుషుల రక్తం తాగే నరరూప రాక్షసులు.
జుట్టుపోలుగాడు : హతోస్మి.లోకంతో నాకు పనిఏల. నేను ఏ క్షణం ఏదంటే అది ఈ ఉర్వీతలంబున వ్యాపించవలె. రెండు నాల్కల విషనాగు కాదు. పదినాల్కల విషనాగు ఏ విధంబుగా వుండునో చూపించెద. అవును ఇక ఇరాన్‌తో భీకరపోరాటమే. నాదు అని నమ్మిన నాటో కూటమి నా మాట వినదా. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాలు నాకే ఎదురు తిరుగుతాయా? హార్మోజ్ జలసంధిని ఇరాన్ చెరనుండి తప్పించడానికి నాతో కలసి యుద్ధం చేయరా? వారి గగన తలంపై నా యుద్ధ విమానాలు విహరించరాదా? ఏమా బలుపు? నేనే లేకుంటే నాటో ఇక ఎక్కడీ అది ఓ కాగితపు పులి. అవును నాటో ఓ కాగితపు పులి. హా.. హా.. హా..
ష్! అణ్వాయుధాలు తయారు చేయబోనని ఇరాన్ నాకు చెప్పనవసరం లేదు. నాకు నమ్మకం కలిగినచో నేనే యుద్ధ దాడులు నిలిపివేసెదను. హార్మోజ్ జలసంధిని తెరిపించే బాధ్యత ఒక్క అమెరికాకే ఏల? ఎవరి దారి వారిది. ఒక్కోసారి నాలో కలుగుతున్న మార్పు నాకు నాకుగానే ఆశ్చ్యం గొల్పుతున్నది సుమా.. మరి చెలరేగుతున్న కసి.. ద్వేషం? ఇరాన్‌ను సర్వనాశనం చేసేందుకు సైనిక పటాలాన్ని పంపించెదను. సైన్యం విజృంభిస్తే ఇరాన్ సమూలంగా ధ్వంసమై పాతరాతి యుగానికి పోవాల్సిందే. ఆ…
కేతిగాడు : నోర్ముయ్యెహె.. ముందు నీ అమెరికా టెక్ కంపెనీలను కాపాడుకో. అమెజాన్‌పై దాడి జరిగిందా లేదా.. నీ అంతటి మూర్ఖపునేత ఇంతవరకు ప్రపంచంలో పుట్టలేదని లోకం కోడై కూస్తుంది. నీవల్లనే దేశ దేశాల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు పుడ్తున్నారు. గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత, రవాణా ఇబ్బందులు, మందుల కొరత, యూరియా కొరత… అన్నీ చుట్టుముడుతున్నయి. తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్టు నీవు ఈ పెంపంచకాన్ని చెరబట్టావ్రోయ్.
బంగారక్క : బాగా చెప్పావ్ మావా. నేతల ప్రాణమైనా, సైనికుల ప్రాణమైనా సాధారణ ప్రజల ప్రాణమైనా ఒక్కటే. ఈ జ్ఞానం ఎవరికైనా ఎరుక కావాలె. ప్రపంచాన్ని చెరబట్టిన వాడు ఎవడైనా అంతం కావాల్సిందే. ఇలాంటి పరమ మూర్ఖా గ్రాసేర నేతలు, నరహంతకులు మున్ముందు రాజకీయాల్లోకి రాకుండా యువత తప్పక జాగ్రత్త పడాలి. పడుతున్నది. యావత్ యువ ప్రపంచం నేర్చుకుంటున్న నవపాఠం ఇదే.
- కె.శాంతారావు, 9959745723



