– అత్యవసరాలపై ఇజ్రాయిల్ ఆంక్షలు
– బాంబు దాడులతో దద్దరిల్లుతున్న నగరం
– తాజా దాడిలో 78 మంది మృతి
– సిరియా పైనా దాడులు
గాజా : పాలస్తీనాపై ఇజ్రాయిల్ దళాలు అడ్డూ అదుపూ లేకుండా విరుచుకుపడుతున్నాయి. గాజాలో మారణహోమాన్ని సాగిస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఆహారం, ఇంధనం, నీరు, అత్యవసర మందులు లభించకుండా అడ్డుకుంటూ తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దారుణమైన ఆకలి సంక్షోభం తలెత్తింది. ఇజ్రాయిల్ దళాలు జరిపిన తాజా దాడిలో 78 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆహారం, తాగునీటి కోసం సహాయ కేంద్రాలకు వచ్చిన వారు సైతం మృత్యువాత పడుతున్నారు.
దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఆహార పంపిణీ కేంద్రం సమీపంలో సోమవారం ఇజ్రాయిల్ సైనికులు దాడి చేశారు. ఈ ఘటనలో కనీసం ఐదుగురు చనిపోయారని పాలస్తీనా అధికార వార్తా సంస్థ వఫా తెలిపింది. ఇజ్రాయిల్, అమెరికా మద్దతుతో వివాదాస్పద గాజా మానవతావాద ఫౌండేషన్ (జీహెచ్‌ఎఫ్) నడుపుతున్న సహాయ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులలో ఇప్పటివరకూ 838 మంది చనిపోయారని చెప్పింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న శిబిరంపై జరిగిన దాడిలో తొమ్మిది మంది మరణించగా పలువురు గాయపడ్డారు. సెంట్రల్ గాజాపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో బురైజ్ శరణార్థి శిబిరంలో ఉంటున్న తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఇదిలావుండగా సిరియాలోని సువేరాపై ఇజ్రాయిల్ తాజాగా దాడులు జరిపింది. ఇది డ్రూజ్ ప్రజలు ఎక్కువగా నివసించే నగరం. డ్రూజ్ ప్రజలకు వ్యతిరేకంగా సిరియా పాలకులు చేపడుతున్న చర్యలను నిరసిస్తూ అక్కడి సైనికులు, ఆయుధాలను లక్ష్యంగా చేసుకొని దాడి జరిపామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ, రక్షణ మంత్రి కట్జ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే గోలాన్ హైట్స్‌ను ఆక్రమించుకున్న ఇజ్రాయిల్ ఇప్పుడు డ్రూజ్ ప్రజలను కాపాడే పేరుతో సువేరాపై దాడికి దిగిందని, తద్వారా తన ఆధిపత్యాన్ని విస్తరించుకోవాలని అనుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది బాధ్యతారాహిత్యమైన చర్య అని ఖతార్ విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యానించారు. సిరియా ప్రజల భద్రత ఇజ్రాయిల్ బాధ్యత కాదని చురక వేశారు. ఇజ్రాయిల్, హమాస్ మధ్య దోహాలో కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అయితే ఆయన వివరాలేవీ అందజేయలేదు.
గాజాపై ‘ఆకలి’ సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES