– గాజాలో 20 లక్షల మందికి అందని ఆహారం
– డబ్య్లూహెచ్‌ఓ చీఫ్ వెల్లడి
రాఫా: ఇజ్రాయిల్.. హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి గాజాలో ఆహారం అందక ఆకలికేకలతో వందలమందికి పైగా చనిపోయారు. వైమానిక దాడుల్లో వందలాది మంది చనిపోతున్నా.. ఇజ్రాయిల్ నరమేధం సృష్టిస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో గాజా ప్రాంతంలో ”ఆకలితో” 20లక్షల మంది ప్రజలు అలమటిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా సహాయాన్ని నిలిపివేయడం వల్ల కరువు ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు. పాలస్తీనా భూభాగంలోకి ప్రవేశించడానికి అనుమతి లభిస్తే ..సహాయం అందించటానికి డబ్ల్యూహెచ్‌ఓ, ఇతర స్వచ్ఛంద సంస్థలు సిద్ధంగా ఉన్నాయని టెడ్రోస్ తెలిపారు. మరోపక్క సోమవారం ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పరిమిత ఆహార సహాయాన్ని అనుమతిస్తుందని ప్రకటించిన తర్వాత, ”దౌత్యపరమైన కారణాలతో” గాజాలో కరువును నివారించడం ఇజ్రాయిల్‌కు అవసరమని అన్నారు. ”తాజా దిగ్బంధంలో రెండు నెలలు గడిచినా, రెండు మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు” అని టెడ్రోస్ అన్నారు. అయితే 160,000 మెట్రిక్ టన్నుల ఆహారం ”కొద్ది నిమిషాల దూరంలో సరిహద్దు వద్ద బ్లాక్ చేయబడింది” అని పేర్కొన్నారు. ”కొనసాగుతున్న దిగ్బంధంలో ఆహారంతో సహా మానవతా సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడంతో గాజాలో కరువు ప్రమాదం పెరుగుతోంది.” అని వివరించారు. వార్షిక ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ప్రారంభోత్సవంలో టెడ్రోస్ మాట్లాడుతూ.. పెరుగుతున్న శత్రుత్వాలు, తరలింపు ఆదేశాలు, కుచించుకుపోతున్న మానవతా స్థలం, గాజా సహాయ దిగ్బంధం ”ఇప్పటికే మోకాళ్లపై ఉన్న ఆరోగ్య వ్యవస్థకు ప్రాణనష్టం పెరుగుతోంది” అని అన్నారు. ”సరిహద్దుల వద్ద మందుల కోసం వేచి ఉండటంతో ప్రజలు నివారించగల వ్యాధులతోనూ మరణిస్తున్నారు. ఆస్పత్రులపై దాడులు ప్రజలను పట్టించుకోకుండా చేస్తున్నాయి” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.నవంబర్ 2023 నుంచి గాజా స్ట్రిప్ నుంచి 617 మంది క్యాన్సర్ రోగులతో సహా 7,300 మందికి పైగా రోగుల వైద్య తరలింపులకు డబ్లూహెచ్‌ఓ సహకరించిందని టెడ్రోస్ చెప్పారు. అయినప్పటికీ, గాజా నుంచి 10,000 మందికి పైగా రోగులకు ఇంకా వైద్య తరలింపు అవసరమని ఆయన అన్నారు. ”మరి కొంత మంది రోగులను అంగీకరించాలని మేము సభ్య దేశాలను కోరుతున్నాం. ఈ తరలింపులను అనుమతించమని, అత్యవసరంగా అవసరమైన ఆహారం, ఔషధాలను లోపలికి అనుమతించాలని ఇజ్రాయిల్‌ను కోరుతున్నాము” అని టెడ్రోస్ అన్నారు.
యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలో ఇజ్రాయిల్ కొత్తగా పునర్‌నిర్మాణ పనులను వేగిరపర్చింది. గాజా మొత్తాన్ని ఇజ్రాయిల్ తమ ”ఆధీనంలోకి తీసుకుంటుంది”అని నెతన్యాహు అన్నారు. బందీలను విడిపించడం , హమాస్‌ను ఓడించడం లక్ష్యంగా ఇజ్రాయిల్ ఈ ప్రచారాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. అదే విధంగా ”ఆచరణాత్మక , దౌత్యపరమైన కారణాల వల్ల మనం (గాజా) జనాభాను కరువులో మునిగిపోనివ్వకూడదు” అని నెతన్యాహు తన టెలిగ్రామ్ ఛానెల్‌కు పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు.కానీ గాజాకు సహాయం పునరుద్ధరించాలని అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. అక్కడ ఆహారం, స్వచ్ఛమైౖన నీరు, ఇంధనం , ఔషధాల కొరత గురించి యూఎన్ సంస్థలు హెచ్చరించాయి.ఈ ప్రాంతం ”కరువు ప్రమాదం తీవ్రంగా ఉంది”, జనాభాలో 22 శాతం మంది ఆసన్నమైన మానవతావాద ”విపత్తు”ను ఎదుర్కొంటున్నారని యూఎన్ , ఎన్జీఓ మద్దతుగల ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (ఐపీసీ) తాజాగా వెల్లడించింది.
ఆకలి కేకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES