భార్య గొంతు కోసి హత్యాయత్నం
నవతెలంగాణ -నాగోల్
కుటుంబ కలహాలు, వరకట్నం వేధింపులు, మద్యపాన వ్యసనాలతో భర్త.. భార్య గొంతుకు కోసి హత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనర్సింహ కాలనీలో ఆదివారం జరిగింది. నాగోల్ సీఐ మహమ్మద్ మగ్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా కొనిజేడుకు చెందిన ఉప్పుతల్లి వేణుగోపాల్‌తో అదే జిల్లా కందుకూరుకు చెందిన మహాలక్ష్మికి 2024లో వివాహం అయ్యింది. వివాహ సమయంలో పుట్టింటి వాళ్లు 15 తులాల బంగారం, రూ.10 లక్షలు కట్నంగా ఇచ్చారు. మద్యానికి బాసిసైన వేణుగోపాల్.. వివాహం అయిన కొంతకాలం నుంచే భార్యను హింసించేవాడు. మద్యం కోసం భార్య బంగారు ఆభరణాలనూ అమ్మేశాడు. మహాలక్ష్మి కొంత బంగారాన్ని పుట్టింట్లో ఉంచగా ఆ బంగారం తీసుకురావాలని వేధించేవాడు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు కావడంతో పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా సమస్య సద్దుమణగలేదు. కాగా, ఆదివారం బంధువుల ఇంట్లో గృహప్రవేశం వేడుకకు రావాలని మహాలక్ష్మి వేణుగోపాల్‌ను కోరగా తనను చంపేస్తానని బెదిరిస్తూ జేబులో నుంచి పేపర్ కట్టర్ బ్లేడు తీసి ఆమె గొంతు కోశాడు.
ప్రతిఘటించిన సమయంలో మహాలక్ష్మి కుడి చేతి చిటికెన వేలు తెగింది. భయంతో బయటకు పరుగెత్తడంతో ఇరుగుపొరుగువారు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మహిళను వైద్యం కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడాన్ని ప్రశ్నించినందుకే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితురాలు మహాలక్ష్మికి ఆపరేషన్ పూర్తి చేశామని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, 48 గంటల వరకు అబ్జర్వేషన్‌లో ఉంటుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం సెలవయినప్పటికీ ఆర్థికపరమైన ఆలోచనలు చేయకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహాలక్ష్మికి ఆపరేషన్ చేశామని సుప్రజా ఆస్పత్రి ఎండీ విజరు కుమార్ గౌడ్ తెలిపారు.
అదనపు కట్నం కోసం భర్త అఘాయిత్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES