Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభార్యలను చంపిన భర్తలు

భార్యలను చంపిన భర్తలు

- Advertisement -

కత్తి, గొడ్డలితో నరికి హత్యలు
కుషాయిగూడ, రెబ్బెనలో దారుణాలు


నవతెలంగాణ-సిటీబ్యూరో/కాప్రా/ రెబ్బెన

అనుమానాలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి.. ఏరులై పారుతున్న మద్యం కుంపటి పెడుతోంది.. చివరికి హత్యలకు దారితీస్తున్నాయి.. రోజుకో చోట దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో శనివారం భార్యలను కత్తి, గొడ్డలితో నరికి హత్యచేశారు భర్తలు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మెత్కూర్‌ సమీపంలోని అడ్డగూడూర్‌ గ్రామానికి చెందిన బోడ శంకర్‌కు 20 ఏండ్ల కిందట మంజుల(35)తో వివాహం జరిగింది. పెండ్లి తర్వాత కొన్నాళ్లు వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. బతుకుతెరువు నిమిత్తం వారు ముంబయికి వలస వెళ్లారు. దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. ఆ తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న శంకర్‌ ఆమెను తరచూ తిట్టడం, కొట్టడం చేసేవాడు.

భర్త వేధింపులు భరించలేక వారం కిందట ఆమె మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలోని మహేశ్‌నగర్‌లో నివాసముంటున్న తన సోదరి రాణి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత శంకర్‌ కూడా తన కుమారులతో కలిసి అక్కడికే వచ్చాడు. శుక్రవారం పెద్దల సమక్షంలో దంపతుల మధ్య రాజీ కుదిర్చారు. ఇకపై తన భార్యను ఇబ్బంది పెట్టనని ఒప్పుకున్నాడు. అయితే అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో కత్తితో మంజుల మెడ, కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె అరుపులకు అందరూ నిద్రలేచారు. శంకర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మంజుల అక్కడికక్కడే మృతిచెందింది. కుషాయిగూడ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో..
కుమురంభీం ఆసిఫాబాద్‌ రెబ్బెన మండలంలోని నారాయణపూర్‌ గ్రామానికి చెందిన గజ్జల తిరుపతి ఆటో డ్రైవర్‌ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. తాగుడుకు బానిసై భార్య స్రవంతితో తరచూ గొడవ పడేవాడు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. శనివారం తెల్లవారుజామున కూడా తిరుపతి భార్యతో ఘర్షణ పడ్డాడు. మాటా మాటా పెరగడంతో ఆవేశంలో గొడ్డలితో స్రవంతిపై దాడి చేశాడు. రక్తపు మడుగులో పడిపోయి ఆమె అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గజ్జల తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్పీ చింతరంజన్‌, సీఐ సంజరు, ఎస్‌ఐ వెంకటకృష్ణ ఘటన స్థలంలో పరిశీలించి విచారణ చేపట్టారు. హత్య జరిగిన తీరు, కుటుంబీకులు, చుట్టు పక్కాల వారి ద్వారా సమాచారం సేకరించారు. మృతురాలి తమ్ముడు టేకుమట్ల సంజరు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -