Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హుస్నాబాద్ అభివృద్ధి అంటే బీఆర్ఎస్ 

హుస్నాబాద్ అభివృద్ధి అంటే బీఆర్ఎస్ 

- Advertisement -

– కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
– పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టణానికి కొత్త రూపు
– రోడ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు అన్నీ బీఆర్ఎస్ హయాంలోనే
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పరిమిత పాలనకే పరిమితమైందని, ఈ కాలంలో హుస్నాబాద్‌కు చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆయన విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హుస్నాబాద్ పట్టణం రూపురేఖలు పూర్తిగా మారాయని చెప్పారు. పట్టణంలో ఎక్కడ చూసినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని అన్నారు.

రోడ్ల విస్తరణ, మాతా శిశు ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నూతన మున్సిపాలిటీ భవనం, సమీకృత ప్రభుత్వ కార్యాలయాలు, పాలిటెక్నిక్ కళాశాల, గురుకుల పాఠశాలలు ఇవన్నీ బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమయ్యాయని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతులను రాజులుగా మార్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని, కరువు గడ్డగా ఉన్న ప్రాంతాలను కోనసీమగా మార్చిన చరిత్ర ఉందన్నారు.

పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి అండగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.ప్రస్తుతం మంత్రి ఉన్న ప్రభాకర్ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని, చేతల్లో మాత్రం పనులు కనిపించడం లేదని అన్నారు.హుస్నాబాద్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, అభివృద్ధిని చేసిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణకు ఇంటి పార్టీ అని, తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేది బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హుస్నాబాద్‌ను అభివృద్ధి చేసినట్లే, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని… రాబోయే ప్రభుత్వంలో ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ ఎన్నికల్లో కేసీఆర్‌కు మద్దతుగా నిలబడి, ఈ గడ్డ తెలంగాణ గడ్డ అని మరోసారి నిరూపించాలని ఆయన ఓటర్లను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -