Tuesday, February 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపొల్యూషన్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌

పొల్యూషన్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌

- Advertisement -

ఓఆర్‌ఆర్‌ బయటకు పరిశ్రమల తరలింపు?
ప్రస్తుత పారిశ్రామిక వాడల్లో మల్టీయూజ్‌ జోన్లు
కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులకు వినియోగం


నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకూ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. నగరంలో పారిశ్రామిక వాడలు కాలుష్యపు జాడలుగా మారాయి. నగరవాసిని కాలుష్య భూతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు అంతంత మాత్రంగానే ఉండటంతో కాలుష్య కారక పరిశ్రమలను నగర శివారులోకి తరలించాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. కాలుష్యం వెదజల్లే కంపెనీలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లు, 300 డివిజన్లుగా విస్తరించిన విషయం తెలిసిందే. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న కోర్‌ అర్బన్‌ రీజియన్‌( క్యూర్‌)ను 2047 నాటికి కాలుష్య రహిత నగరంగా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులను, వాహనాల వినియోగం పెంచడం అందులో భాగమేనని అంటున్నారు. భూగర్బకేబుళ్లు వేయడం, చెరువులను శుభ్రంగా ఉంచడం, కఠినమైన శానిటేషన్‌, వ్యర్థాల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదే సందర్భంగా కాలుష్యకారమైన పరిశ్రమలను కూడా బయటకు పంపేందుకు వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేపట్టింది.

హైదరాబాద్‌ ఇండిస్టియల్‌ బ్యాంట్రాన్స్‌ కింద తరలింపు
మహానగరం పరిధిలో శరవేగంగా అభివద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం నగర, శివారు ప్రాంతాల్లో అనేక పారిశ్రామికవాడలు ఉన్నాయి. వాటి నుంచి వస్తున్న కాలుష్యంతో స్థానిక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. గాలి, నీరు, వాతావరణం ఇలా అన్ని కాలుష్యమవుతున్నాయి. రోజురోజుకూ ప్రజల నుంచి కూడా డిమాండ్‌ పెరుగుతున్న ఈ నేపథ్యంలో నగరంలోని పారిశ్రామిక ప్రాంతాలను ఓఆర్‌ఆర్‌ బయటికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన హైదరాబాద్‌ ఇండిస్టియల్‌ బ్యాంట్రాన్స్‌ కింద సదరు పారిశ్రామికవాడలన్నీ ఓఆర్‌ఆర్‌ బయటకు తరలిపోనున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఇదంతా ఒకేసారి జరగదు అని, విడతల వారీగా ఉంటుందని, పరిశ్రమలు బయటకు వెళ్లేందుకు వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

రెడ్‌ కేటగిరీ పరిశ్రమలే ఎక్కువ
నగరంలో దాదాపు 2 వేలకు పైగా రెడ్‌ కేటగిరీ పరిశ్రమలు ఉన్నట్టు అంచనా. ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమల్లో సుమారు 2,500 వరకు నగర పరిధిలోనే ఉండొచ్చని అంచనా. వీటిల్లో ఇప్పటి వరకు సుమారుగా 40 శాతం కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. బోలక్‌పూర్‌లోని తోలు పరిశ్రమను మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు, ఇనుము, స్టీల్‌ పరిశ్రమలను వికారాబాద్‌ జిల్లా రాకంచర్లకు, నూనె తయారీ పరిశ్రమలను సంగారెడ్డి జిల్లాకు తరలించగా.. జహీరాబాద్‌ సమీపంలో టీజీఐఐసీ మౌలిక వసతులను అభివద్ధి చేసి, పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ఆసక్తి ఉన్న పరిశ్రమలకు ఆయా ప్రాంతాల్లో స్థలాలను కేటాయించారు. అప్పట్లో కొన్ని కారణాల వల్ల వెళ్లలేదు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కాలుష్య కారక పరిశ్రమల తరలింపు ప్రక్రియ మరోసారి తెరపైకి రావడంతో ఈ అంశాన్ని సర్కార్‌ సీరియస్‌గా తీసుకుని పరిశ్రమల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది.

పొల్యూషన్‌ ఫ్రీ సిటీగా నగరం
పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలిస్తే హైదరాబాద్‌ పొల్యూషన్‌ ఫ్రీ నగరంగా మారనుంది. ఇప్పటి వరకు పరిశ్రమలు కొనసాగిన ప్రాంతాలను అందమైన కారిడార్లుగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటి వరకు పరిశ్రమలు కొనసాగిన భూముల్లో అందమైన ఆపార్ట్‌మెంట్స్‌, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు రానున్నాయి. హోటళ్ల వంటి కమర్సియల్‌ కాంప్లెక్సులతో పాటు స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు, రీసెర్చ్‌ సెంటర్లు వెలియనున్నాయి. పలు విద్యాసంస్థలు, పార్కులు, స్పోర్ట్స్‌ కాంప్లెక్సులు, కల్చరర్‌ సెంటర్లు రానున్నాయి. వీటితో పాటు టెక్నాలజీ పార్కుల నిర్మాణాలు సైతం జరుగనున్నాయి. నగర శివారులో ప్రస్తుతం 22 పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. వాటిల్లో నాచారం, మల్లాపూర్‌, చర్లపల్లి, మౌలాలి, ఉప్పల్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, సనత్‌నగర్‌, మేడ్చల్‌, కుషాయిగూడ, గాంధీనగర్‌, పఠాన్‌చెరు, పాశమైలారం, రామచంద్రాపురం, కాటేదాన్‌, హయత్‌నగర్‌ ప్రాంతాలు ఉన్నాయి. వీటిని అక్కడి నుంచి ఓఆర్‌ఆర్‌ బయటికి తరలించే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టింది.

మల్టీ యూజ్‌ జోన్లుగా ఏర్పాటు
ప్రస్తుత పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములను పరిశ్రమలు తరలి వెళ్లిన తర్వాత థర్డ్‌-యూజ్‌ జోన్లుగా మార్చి, అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి వాటిని నిర్మించడానికి ప్రభుత్వం అనుమతించినట్టు సమాచారం. ప్రస్తుత పారిశ్రామికవాడల్లో మొత్తం 9వేల ఎకరాలకు పైగా భూమిని గుర్తించారు. ఇందులో దాదాపు 5వేల ఎకరాల్లో ప్లాట్లు, కార్యాలయాలు, పాఠశాలలు, ఆపార్టుమెంట్లు, ఆస్పత్రులు, హోటళ్లు, టెక్‌ పార్కులను ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -