Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయాప్‌ డిజైన్‌ లీడర్‌గా హైదరాబాద్‌

యాప్‌ డిజైన్‌ లీడర్‌గా హైదరాబాద్‌

- Advertisement -

యుఎక్స్‌ ఇండియా కాన్ఫరెన్స్‌లో మంత్రి భట్టి

నవతెలంగాణ – హైదరాబాద్‌
యాప్‌ డిజైన్‌ లీడర్‌గా హైదరాబాద్‌ను నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం హైదరాబాద్‌లో యుఎంఓ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ”యుఎక్స్‌ ఇండియా 25” పేరిట ఏర్పాటు చేసిన 21వ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ ప్రోడక్ట్‌ డిజైన్‌” ను ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి డిప్యూటీ సిఎం భట్టి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌ ఎటువంటి టెక్నాలజీ నైనా అందిపుచ్చుకొని లీడర్‌గా ఎదుగుతుందని భట్టి విక్రమార్క అన్నారు. ఎఐ టెక్నాలజీకి హైదరాబాద్‌ మహా నగరాన్ని గ్లోబల్‌ సెంటర్‌ గా నిలబెట్టేందుకు సిఎం రేవంత్‌ రెడ్డి తో పాటు యావత్‌ క్యాబినెట్‌ పట్టుదలతో ఉందన్నారు. డిజైన్‌ అనేది కేవలం అందానికి కాదని సామాజిక మార్పునకు ఆయుధం కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సమానత్వం, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని తెలిపారు.

హైదరాబాదును ప్రపంచ డిజైన్‌ క్యాపిటల్‌గా మార్చడానికి కలిసి పని చేద్దామని ప్రతినిధులకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఈ అంతర్జాతీయ సదస్సు హైదరా బాద్‌ చరిత్రలో ఒక మలుపు రాయి అన్నారు. తెలంగాణ రాష్ట్ర డిజిటల్‌ భవిష్యత్తును పరిపుష్టం చేయడంలో, మరో అడుగు ముందుకు వేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో యుపిఐ వంటి యాప్‌లు సరళంగా రూపొందించడంతో పెద్ద విజయం సాధించాయన్నారు. ప్రాంతీయ భాషల్లోనూ యాప్‌ లు రూపొందించడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు.

డిజైనింగ్‌కు పెద్దపీట వేస్తాం : మంత్రి శ్రీధర్‌ బాబు
హైదరాబాద్‌ను గ్లోబల్‌ డిజైన్‌ హబ్‌గా మార్చాలనే సంకల్పంతో త్వరలోనే ”సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ డిజైన్‌”ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు. టీ హబ్‌, టీ వర్క్స్‌, వీ హబ్‌ లాంటి సంస్థల ద్వారా తెలంగాణ ను ఇన్నోవేషన్‌ హబ్‌ గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ”ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌”లో డిజైనింగ్‌కు పెద్దపీట వేస్తున్నామన్నారు. డిజైనింగ్‌ అంటేనే సృజనాత్మకత అని, కాకపోతే ఆది యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. అప్పుడే ఆ యాప్‌ లేదా వెబ్‌ సైట్‌ మనుగడ సాధ్యమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -