స్టార్టప్స్, ఇన్నోవేషన్స్ కోసం ”ఫండ్స్ ఆఫ్ ఫండ్స్” : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”క్వాంటం సిటీ”గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ”క్వాంటం టెక్నాలజీ”లో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారి ”లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ”ని రూపొందిం చామన్నారు. గచ్చిబౌలిలోని ”ఐఐఐటీ హైదరాబాద్”లో నిటి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం, తెలంగాణ క్వాంటం స్ట్రాటజీని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచ రూపురేఖలు మార్చాయన్నారు. అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందని పేర్కొన్నారు.
లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీలో భాగంగా రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్, టాలెంట్ పైప్‌లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన క్వాంటం పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్స్, కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా ”ఫండ్స్ ఆఫ్ ఫండ్స్”ను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. ”ఇండస్ట్రీ డే” పేరిట ప్రతి వారంలో ఒకరోజు అధికారులు, ప్రతి నెలలో ఒక రోజు సంబంధిత మంత్రి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావే శమవుతారన్నారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, సభ్యులు డా.వీకే సారస్వత్, దేబ్ జానీ ఘోష్, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



