చంఢగీడ్‌పై 136 పరుగులతో ఘన విజయం
హైదరాబాద్ : విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఎలైట్ గ్రూప్-బిలో రాజ్‌కోట్‌లో చంఢగీడ్‌పై 136 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (109, 118 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా.. అభిరాత్ రెడ్డి (71, 64 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. ఆమన్ రావు (13), తన్మయ్ అగర్వాల్ (16), వరుణ్ గౌడ్ (13), ప్రజ్ఞయ్ రెడ్డి (9), నితీశ్ రెడ్డి (13)లు నిరాశపరిచారు.
ఛేదనలో చంఢగీడ్ 37.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. రక్షణ్ రెడ్డి (3/34), నితీశ్ రెడ్డి (2/27), సివి మిలింద్ (2/20) వికెట్ల వేటలో విజృంభించారు. మహ్మద్ సిరాజ్ (1/19), అనికెత్ రెడ్డి (1/24) తలా ఓ వికెట్ పడగొట్టారు. చంఢగీడ్ తరఫున సన్యమ్ సైని (46, 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), విష్ణు కశ్యప్ (27 నాటౌట్, 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనన్ వోహ్రా (24, 38 బంతుల్లో 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. సెంచరీ హీరో తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.



