ఫైనల్లో హైదరాబాద్‌

Hyderabad in the final– క్వాలిఫయర్‌ 2లో సన్‌రైజర్స్‌ ఘన విజయం
– రాజస్థాన్‌ రాయల్స్‌కు తప్పని భంగపాటు
– అభిషేక్‌, షాబాజ్‌ స్పిన్‌ మాయజాలం
– హైదరాబాద్‌ 175/9, రాజస్థాన్‌ 139/7
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధించింది. బ్యాటర్లు మరోసారి నిరాశపరిచినా యువ స్పిన్నర్లపై భరోసా ఉంచిన సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. అభిషేక్‌ శర్మ (2/24), షాబాజ్‌ అహ్మద్‌ (2/23) మాయజాలంతో ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌ విలవిల్లాడింది. ధ్రువ్‌ జురెల్‌ (56 నాటౌట్‌), యశస్వి జైస్వాల్‌ (42) మెరిసినా 176 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌ 139/7 పరుగులకే పరిమితమైంది. 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఆదివారం ఐపీఎల్‌ టైటిల్‌ పోరులో కోల్‌కత నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది.
నవతెలంగాణ-చెన్నై
యువ స్పిన్నర్లు అభిషేక్‌ శర్మ (2/24), షాబాజ్‌ అహ్మద్‌ (3/23) మాయ చేశారు. స్పిన్‌ స్వర్గధామం చెపాక్‌లో వికెట్ల జాతర చేశారు. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్ల ప్రతాపంతో రాజస్థాన్‌ రాయల్స్‌ చతికిల పడింది. 176 పరుగుల ఊరించే ఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులే చేసింది. 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (42, 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్‌ జురెల్‌ (56 నాటౌట్‌, 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా.. రాజస్థాన్‌ రాయల్స్‌ను ఫైనల్స్‌కు చేర్చలేకపోయారు. అంతకుముందు, హెన్రిచ్‌ క్లాసెన్‌ (50, 34 బంతుల్లో 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో హైదరాబాద్‌ను ఆదుకున్నాడు. ట్రావిశ్‌ హెడ్‌ (34, 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ త్రిపాఠి (37, 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్‌లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ పేస్‌ త్రయం ట్రెంట్‌ బౌల్ట్‌ (3/45), అవేశ్‌ ఖాన్‌ (3/27), సందీప్‌ శర్మ (2/25) రాణించారు.
స్పిన్‌ మాయకు రాయల్స్‌ విలవిల : 176 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్‌ మాయకు విలవిల్లాడింది. టామ్‌ (10) వికెట్‌తో కమిన్స్‌ తొలి వికెట్‌ తీయగా.. ఆ తర్వాత స్పిన్నర్లు చూసుకున్నారు. పార్ట్‌టైమ్‌ యువ స్పిన్నర్లు అభిషేక్‌ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌లకు బంతి అందించిన కమిన్స్‌ గొప్ప ఫలితం రాబట్టాడు. సంజు శాంసన్‌ (10), హెట్‌మయర్‌ (4)ను అభిషేక్‌ అవుట్‌ చేయగా.. రియాన్‌ పరాగ్‌ (6), యశస్వి జైస్వాల్‌ (42), అశ్విన్‌ (0) వికెట్లను షాబాజ్‌ పడగొట్టాడు. అభిషేక్‌, షాబాజ్‌లు ఎనిమిది ఓవర్లలో 47 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ఆ ఇద్దరి మ్యాజిక్‌తో క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (42) ఆరంభంలో, చివర్లో ధ్రువ్‌ జురెల్‌ (56 నాటౌట్‌) రాయల్స్‌కు పరుగులు సాధించారు. కానీ అప్పటికే సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ను ఖాతాలో వేసుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్లకు రాయల్స్‌ 139 పరుగులే చేసింది.
బౌల్ట్‌ దెబ్బకొట్టినా.. : మంచు ప్రభావం ఎక్కువగా ఉండే చెపాక్‌లో టాస్‌ నెగ్గిన రాజస్థాన్‌ రాయల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. లెఫ్టార్మ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ రాయల్స్‌కు రాయల్‌ ఆరంభం అందించాడు. తొలి ఓవర్లోనే ఓ సిక్సర్‌, ఫోర్‌తో దండయాత్ర మొదలుపెట్టిన అభిషేక్‌ శర్మ (12) ఆ ఓవర్లోనే వికెట్‌ కోల్పోయాడు. లెంగ్త్‌ బాల్‌ను ఫుల్‌ షాట్‌కు ఆడేందుకు వెళ్లిన అభిషేక్‌ శర్మ.. కవర్స్‌లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. రాహుల్‌ త్రిపాఠి (37), ట్రావిశ్‌ హెడ్‌ (34) పవర్‌ప్లేలో దూకుడు తగ్గకుండా ఆడారు. హెడ్‌ కాస్త నెమ్మదించినా..రాహుల్‌ త్రిపాఠి రెచ్చిపోయాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. హెడ్‌, త్రిపాఠి జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో పవర్‌ప్లేలోనే బౌల్ట్‌కు ఏకంగా మూడో ఓవర్‌ అందించిన సంజు శాంసన్‌.. సన్‌రైజర్స్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. స్లో బౌన్సర్‌తో రాహుల్‌ త్రిపాఠిని సాగనంపిన బౌల్ట్‌.. ఎడెన్‌ మార్‌క్రామ్‌ (1) కథ సైతం ముగించాడు. దీంతో ఐదు ఓవర్లలో 57 పరుగులకు సన్‌రైజర్స్‌ మూడు వికెట్లు చేజార్చుకుంది. పవర్‌ప్లేలో ఆరు ఓవర్లలో 68 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌.. భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది!.
ఆదుకున్న క్లాసెన్‌ :
సన్‌రైజర్స్‌ బ్యాటర్లు మరోసారి నిరాశపరిచిన తరుణంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ట్రావిశ్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌లు నాల్గో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. పది ఓవర్ల వరకు ఈ జోడీ క్రీజులో ఉండటంతో సన్‌రైజర్స్‌ శిబిరంలో భారీ స్కోరుపై ఆశలు చిగురించాయి. కానీ సందీప్‌ శర్మ స్లో బౌన్సర్‌తో హెడ్‌ కథ ముగించాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి (5), అబ్దుల్‌ సమద్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. సహజంగానే దూకుడుగా ఆడే హెన్రిచ్‌ క్లాసెన్‌ బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశాడు. నాలుగు సిక్సర్లతో 33 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ షాబాజ్‌ అహ్మద్‌ చక్కటి సహకారం అందించాడు. స్ట్రయిక్‌రొటేట్‌ చేస్తూ విలువైన పరుగులు జోడించాడు. అర్థ సెంచరీ అనంతరం 19వ ఓవర్‌ తొలి బంతికి క్లాసెన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. సందీప్‌ వర్మ కండ్లుచెదిరే యార్కర్‌తో ప్రమాదకర హిట్టర్‌ను డగౌట్‌కు పంపించాడు. పాట్‌ కమిన్స్‌ (5 నాటౌట్‌), షాబాజ్‌ అహ్మద్‌ (18), జైదేవ్‌ ఉనద్కత్‌ (5) మెరుపులతో 20 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 175 పరుగులు చేసింది.

Spread the love