Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐద్వా జాతీయ మహాసభలకు హైదరాబాద్‌ ముస్తాబు

ఐద్వా జాతీయ మహాసభలకు హైదరాబాద్‌ ముస్తాబు

- Advertisement -

గోడలపై రాతలను పరిశీలిస్తున్న నాయకులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈనెల 25 నుంచి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) జాతీయ మహాసభల నిర్వహణకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్నది. నగరంలో విస్తృతంగా గోడలపై రాతలు, ప్రముఖ కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపం వద్ద ఉన్న వీఎస్టీ చౌరస్తాలో గోడ రాతలను ఐద్వా జాతీయ నాయకులు టి జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర నాయకులు బుగ్గవీటి సరళ, ఆశాలతతోపాటు ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రజాసంఘాల నాయకులు ఎండీ అబ్బాస్‌, ఆర్‌ శ్రీరాం నాయక్‌, బి ప్రసాద్‌, మూడ్‌ శోభన్‌, ఎండీ జావేద్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గడ్డపై మొదటిసారిగా మహిళా సంఘం జాతీయ మహాసభలు జరుగుతున్నాయని చెప్పారు.

దేశం నలుమూలల నుంచి వివిధ పోరాటాలు, ఉద్యమాల్లో పాల్గొన్న వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలతోపాటు వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్‌ ఉద్యమాలకు నాంది పలికేందుకు ఈ మహాసభలు దోహదం చేస్తాయన్నారు. మొదటి రోజు వేలాదిమంది మహిళలతో భారీ బహిరంగ సభ, మహిళల ప్రదర్శన హైదరాబాదులో జరుగుతుందని వివరించారు. ప్రత్యేక ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నారని చెప్పారు. వాటి జయప్రదం కోసం ప్రత్యేక నిర్వహణ కోసం వివిధ రకాలైన కమిటీలను ఆహ్వాన సంఘం వేసిందని అన్నారు. ఈనెల 25న జరిగే బహిరంగ సభకు వేలాదిమంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -