మెట్రో రెండో దశకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు నిల్
రాష్ట్ర విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసిన నిర్మలమ్మ
ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి దక్కని ప్రయోజనం
తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతోందంటూ విమర్శల వెల్లువ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా గ్రేటర్‌వాసులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ రవాణా కష్టాలను తీర్చే ‘మెట్రో రెండో దశ’ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి భారీ సహకారం అందుతుందని ఆశించిన రాష్ట్రానికి.. బడ్జెట్‌లో కనీస ప్రస్తావన కూడా లేకపోవడంతో ఆశలన్నీ అడియాశలయ్యాయి.
మెట్రో ఊసే లేదు.. నయా పైసా రాలేదు
హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు తాజా కేంద్ర బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులూ జరగలేదు. దాదాపు రూ.24,000 కోట్లతో చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ (ఎయిర్‌పోర్ట్ మెట్రో, ఓల్డ్ సిటీ, ఇతర పొడిగింపులు) కోసం కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి డీపీఆర్‌లు సమర్పించి, జాయింట్ వెంచర్ పద్ధతిలో నిధులు కేటాయించాలని కోరారు. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రాజెక్టు ఊసే ఎత్తకపోవడం గమనార్హం.
తెలంగాణపై కేంద్రం వివక్ష..!?
దేశానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే టాప్ రాష్ట్రాలో తెలంగాణ ఒకటి. ఐటీ, ఫార్మా రంగాల్లో దేశానికి తలమానికంగా నిలుస్తున్న హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కానీ, గుజరాత్, కర్నాటక, బీహార్ వంటి రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం సగభాగం కూడా తెలంగాణకు ఇవ్వలేదని, ఇది కచ్చితంగా రాజకీయ వివక్షేనని రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజన హామీల అమలులోనూ, కొత్త ప్రాజెక్టుల మంజూరులోనూ తీవ్ర వివక్ష కనబరుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇద్దరు కేంద్ర మంత్రులున్నా.. ఫలితం శూన్యం?
ఈసారి బడ్జెట్‌పై తెలంగాణ ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం.. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఇద్దరు కీలక నేతలు ఉండటమే. కేంద్ర క్యాబినెట్ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు ఉద్దండులు కేంద్రంలో చక్రం తిప్పుతున్నా, హైదరాబాద్ మెట్రోకు నయా పైసా తేలేకపోయారనే విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ‘పక్క రాష్ట్రాలకు నిధుల వరద పారుతుంటే, మన కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారు’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత రాష్ట్ర అభివృద్ధి కోసం అధిష్టానంపై ఒత్తిడి తేవడంలో వీరు వెనుకబడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంపై అదనపు భారం..
కేంద్ర బడ్జెట్‌లో నిధులు రాకపోవడంతో, మెట్రో రెండో దశ భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది పెను భారమే. కేంద్రం చేయి విదిల్చి ఉంటే ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యేవని, ఇప్పుడు జాప్యం జరిగే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో.. హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థకు మాత్రం ‘వికాసం’ కనిపించడం లేదని నగర వాసులు పెదవి విరుస్తున్నారు. ఇక మెట్రో సంగతి పక్కన పెడితే.. ఈ బడ్జెట్‌లో హైదరాబాద్‌కు రవాణా పరంగా ఒక బంపర్ ఆఫర్ లభించింది. దేశంలో కొత్తగా ప్రకటించిన 7 హై స్పీడ్ రైల్(బుల్లెట్ రైలు తరహా) కారిడార్లలో మూడు హైదరాబాద్‌ను అనుసంధానిస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రోకు మొండిచేయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



