– ముఖ్య అతిథిగా హాజరైన ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్
హైదరాబాద్ : 16వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా మొదలైంది. బుద్దవతారం రాజు, లింగమనేని లక్ష్మి స్మారకార్థం హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హెచ్‌ఓటీఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డైరెక్టర్ సివి ఆనంద్ పోటీలను ఆరంభించారు. ‘దేశం నలుమూలల నుంచి వెటరన్ క్రీడాకారులు రావటం సంతోషంగా ఉంది. క్రీడోత్సాహానికి వయసుతో సంబంధం లేదని టెన్నిస్ క్రీడాకారులు మరోసారి నిరూపిస్తున్నారు. ఇంతమంచి టోర్నమెంట్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్‌కు అభినందనలు’ అని సివి ఆనంద్ అన్నారు. మహిళల సింగిల్స్‌లో ఓపెన్ పోటీ ఉండగా, పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో 30, 40, 50, 60, 70 ఏండ్ల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. టోర్నీలో పోటీపడుతున్న 408 మంది క్రీడాకారులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నామని హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, కార్యదర్శి రాజేశ్వర్ రావు, స్పోర్ట్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం ఆఫీస్ బేరర్లు సదాశివ రెడ్డి, అనిరుధ్, రామకష్ణ, సందీప్, సుబ్రమణ్యం, రాంబాబు సహా యుఎస్ ఎంబసీ ప్రతినిధి ఫ్రాంక్ తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.