– ప్రతీరోజు చెత్త సేకరణ జరగాలి
– క్యూర్ పరిధిలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి
– కొత్త డంప్ యార్డులు అందుబాటులోకి తీసుకురండి : మున్సిపల్ కమిషనర్ల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగరాన్ని క్లీన్‌సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్‌కు సంబంధించిన ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటు లోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరముందని చెప్పారు. నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతోపాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రెటరీ మాణిక్‌రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినరుకృష్ణారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన యూఎస్ గవర్నర్
అమెరికాలోని డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ శనివారం సీఎం ఏ రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఆయనతో మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య, విద్యారంగాల్లో సంస్కరణలపై సీఎం ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేసిన పేద మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు, రుణమాఫీ ఇతర అంశాలను సీఎం ఆయనకు వివరించారు.డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్ రంగాలపైనా వారు చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్‌కు రావల్సిందిగా మాట్ మేయర్ సీఎంను ఆహ్వానించారు.
హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మార్చాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



