ఒకటి రెండేండ్లు కాదు.. వందేండ్ల టార్గెట్
– హైడ్రా ఏర్పాటు తర్వాతే అక్రమ నిర్మాణాలపై చర్యలు
– పేదల ఇండ్లు కూల్చం..
– ప్రజాప్రతినిధుల ఫామ్‌హౌస్‌లను సైతం కూల్చేశాం
– రాబోయే తరాలకు ఆరోగ్యకర భవిష్యత్ అందిద్దాం..
– ప్రతి ఒక్కరూ సహకరించాలి : ‘మీట్ ది ప్రెస్’లో హైడ్రా కమిషనర్ ఐజీ ఏవి.రంగనాథ్
నవతెలంగాణ – సిటీబ్యూరో
”హైడ్రా రాజకీయాలకతీతంగా పనిచేస్తోంది. ఇది ఒకటి రెండేండ్లకు పరిమితం కాదు.. వందేండ్ల ప్రణాళికతో ముందుకెళ్తోంది.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి..” అని హైడ్రా కమిషనర్, ఐజీ ఏవి.రంగనాథ్ స్పష్టం చేశారు. వ్యక్తుల ప్రయోజనాలకన్నా ప్రజల ప్రయోజనాలకు మాత్రమే హైడ్రా ప్రాధాన్యత ఇస్తోందని, ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మి పనిచేయదని అన్నారు. అన్ని అంశాలపై పూర్తిగా అధ్యయనం చేశాక ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. కొన్ని సందర్భాల్లో మేధావులు, నిపుణులతో రాత్రి 11గంటల వరకు చర్చించిన రోజులున్నాయని తెలిపారు. హైడ్రా ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ‘మహానగర అభివృద్ధి- ఆటంకాలు’ అనే అంశంపై టీయూడబ్ల్యూజే అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో శనివారం ‘మీట్ ది ప్రెస్’ నిర్వహించారు. బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో.. హైడ్రాపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, వివాదాలు, అనుమానాలను కమిషనర్ ఏవి.రంగనాథ్ నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. మొదట్లో ఏ సంస్థకైనా ఒడుదుడుకులు తప్పవని, హైడ్రా కూడా అనేక అవరోధాలు, విమర్శలను ఎదుర్కొంటూ ఏడాది కాలంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రజల్లో హైడ్రా పట్ల నమ్మకం పెరిగిందనడానికి కూకట్‌పల్లి నల్లచెరువు నిదర్శనమని తెలిపారు. విపత్తుల నుంచి నగర ప్రజలను రక్షించేందుకు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైడ్రాలో ప్రస్తుతం 200 మంది సిబ్బంది వరకు పనిచేస్తున్నారని తెలిపారు. కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. వాటి ఫలితాలు భవిష్యత్‌లో బాగుంటాయని, కబ్జాదారుల నుంచి నగరాన్ని కాపాడి రాబోయే తరాలకు మంచి వాతావరణం, అభివృద్ధిని అందిస్తామన్నారు. హైడ్రా పనితీరుతో ప్రతి ఒక్కరిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వచ్చిందన్నారు. పార్కులు, నాలాలు, చెరువులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ తర్వాత ప్రభుత్వ భూములు, లేఆవుట్స్, ఎన్‌క్రోచ్‌మెంట్స్‌పై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు కోట్లు విలువచేసే 500ఎకరాల ప్రభుత్వ స్థలాలను కాపాడామని, ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సీఎస్‌ఆర్ పేరుతో కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు.
50 ఎకరాలున్న చెరువు 12ఎకరాలు అయిందని, అదే తరహాలో నాలాలు ఆక్రమణకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని చెరువులకూ సాంకేతిక ఆధారాలతో ఎఫ్‌టీఎల్ మార్కు చేస్తున్నామని, నాలాలను నోటిఫై చేస్తున్నామని చెప్పారు. ఫాతీమా కాలేజీనా.. మల్లారెడ్డి కాలేజీనా.. ఇంకోటా అనేది చూడమని, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
2015 – 2016లో ఫాతీమా కాలేజీ కట్టారని, ఆ సమయానికి అక్కడున్న చెరువుకు ప్రాథమికంగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణ కాలేదన్నారు. ఫాతీమా కాలేజీ ఏర్పాటు తర్వాత అక్కడ బస్తీలు, నివాస గృహాలు నిర్మాణమయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 80శాతం చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది కానీ ఫైనల్ నోటిఫికేషన్ కాలేదన్నారు. కొద్ది నెలల్లోనే నగరంలోని అన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల్‌ను సైంటిఫిక్‌గా హద్దులను నిర్ధారించి ఫెన్సింగ్ చేస్తామన్నారు. హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవన్నారు. హైడ్రా రాకముందు నిర్మాణాలు, పర్మిషన్లు తీసుకుంటే వాటి జోలికెళ్లబోమని స్పష్టం చేశారు. పేదల ఇండ్లను కూల్చబోమన్నారు. తప్పని పరిస్థితుల్లో కూల్చివేస్తే అన్ని విధాలా విచారించి ప్రభుత్వం నష్టపహారం చెల్లిస్తుందన్నారు. కూకట్‌పల్లిలో షెడ్స్‌ను మాత్రమే కూల్చేశామన్నారు. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని భావిస్తే కోర్టుకెళ్లొచ్చని సూచించారు.
ఎన్ కన్వెన్షన్‌పై చెరువుకు ఫైనల్ నోటిఫికేషన్ కావడంతోనే కూల్చేశామని చెప్పారు. జయభేరీ లేఆవుట్‌లో పార్కులు, రోడ్లు, ఇతర వాటికి మొదట్లో స్థలాలను కేటాయించి, ఆ తర్వాత కబ్జా చేశారన్నారు. వాటిపై ఫిర్యాదులు అందడంతోనే అక్కడ కూల్చివేతలు జరిపామని చెప్పారు. గండిపేట్‌లో సైతం ప్రజాప్రతినిధుల ఫామ్‌హౌజ్‌లు, స్థలాలను కూల్చేశామన్నారు. ఎవరూ అపోహలకు వెళ్లకుండా రాబోవుతరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్‌ను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, టీయూడబ్య్లూజే ప్రధాన కార్యదర్శి కె.రామ్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.