అడ్డుకున్న స్థానికులు
పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు
36 ఎకరాల ప్రభుత్వ భూముల స్వాధీనం
నవతెలంగాణ-మియాపూర్
రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో హైడ్రా అధికారులు శనివారం ఉదయం పెద్దఎత్తున కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన గుడిసెలను జేసీబీలతో తొలగించారు. స్థానికులు అడ్డుకోవ డంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగించారు. సుమారు 36ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి హైడ్రా, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని కొండాపూర్ విలేజ్ రెవెన్యూ సర్వే నెంబర్ 59లో 36 ఎకరాల భూమి 12 మంది రైతుల ఆధీనంలో ఉంది. అయితే, ఇది ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. దాంతో 12 మంది రైతులు ఆ భూమిని గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిందని రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు హైకోర్టులో కేసు వేశారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానికి చెందుతుందని ఇటీవల తీర్పు వెల్లడించింది.
దాంతో శనివారం ఉదయం హైడ్రా, రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడిసెలను కూల్చివేశారు. ఈ క్రమంలో అధికారులకు, స్థానికులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తమ గుడిసెలను కూల్చివేయొద్దంటూ స్థానికులు మొర పెట్టుకున్నారు. జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 60 ఏండ్లుగా ఈ భూమిలో ఉన్నామని ఆందోళన చేశారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ భూమిని తాము స్వాధీనం చేసుకుంటున్నామని హైడ్రా, రెవెన్యూ అధికారులు స్థానికులకు వివరించే ప్రయ్నతం చేశారు. సుమారు 36ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3600కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూమి రక్షణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.