కిరాయికి వచ్చి నాలాతో పాటు రోడ్డునూ ఆక్రమించి నిర్మాణాలు
రెండెకరాల పార్కుకు దారి లేకుండా
చేసిన కిరాయిదారుడు
కోర్టు అనుమతులతో కూల్చివేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 41లో.. రోడ్డుతో పాటు నాలానూ ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా శుక్రవారం తొలగించింది. 30 అడుగుల రహదారిలో ఆక్రమణలు తొలగించి 2 ఎకరాల పార్కుకు దారి చూపింది. దాదాపు రూ. 200 కోట్ల ఆస్తిని కాపాడి.. ప్రజా వినియోగంలోకి హైడ్రా తెచ్చింది. జూబ్లీహిల్స్ సొసైటీ ప్రతినిధులు, అక్కడ నివాస ప్రాంతాలకు చెందిన వారు ఇచ్చిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో ఇది వరకే పరిశీలించారు. నాలాతో పాటు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు నిర్ధారణ కావడంతో వాటి తొలగింపునకు హైడ్రా గతంలోనే నోటీసులు ఇచ్చింది. కోర్టునుంచి అనుమతులు లభించడంతో బుధవారం అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది.
కిరాయికి వచ్చి కబ్జాలు చేసిన వైనం..
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 41లో అవసరాల శ్రీనివాస్ రుక్మాందగ రావుకు 1000 గజాల స్థలం ఉంది. ఇందులో 200 గజాల వరకూ ఇల్లు కట్టారు. ఈ ఇల్లు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి చేరువలో ఉంది. క్రోతుపల్లి శ్రీనివాస్‌కు దీన్ని అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటికి పక్కనే 30 అడుగుల మేర రోడ్డు ఉంది. ఈ రోడ్డు మార్గంలో వెళ్తే 2 ఎకరాల పార్కుకు చేరుకోగలం. అయితే కిరాయిదారు ఆ దారినే మూసేసి పార్కుకు దారి లేకుండా చేశాడు. 30 అడుగుల మేర ఉన్న రహదారిలోనే బాక్స్ టైపు నాలా ఉండగా నాలాతో పాటు రోడ్డును సగం వరకూ ఆక్రమించేశాడు. ఇంటి ఖాళీ స్థలంతో పాటు పక్కనే ఉన్న రోడ్డును కూడా ఆక్రమించి హాస్టల్ నిర్మించాడు. ఇంటి వెనకున్న ఖాళీ స్థలంలో కారు మరమ్మతుల షెడ్డును ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చాడు. మొత్తం 907 గజాల మేర ఆక్రమణలకు పాల్పడ్డాడు. వాటిని అద్దెకు ఇచ్చి నెలకు రూ. 10 లక్షల వరకూ వసూలు చేస్తున్నాడు. ఇవన్నీ ఇంటి ఓనర్‌కు సంబంధం లేకుండా జరిగిపోయాయి.
పార్కుకు దారి చూపిన హైడ్రా..
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 41లో ఎటు చూసినా వ్యాపార సముదాయాలున్నాయి. ట్రాఫిక్ రద్దీతో ఎక్కడా నిల్చోడానికి కూడా స్థలం లేని ప్రాంతం. అలాంటి చోట 2 ఎకరాల మేర పార్కు ఉంటే ఎంత ప్రయోజనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే రోడ్డును ఆక్రమించి కిరాయి దారుడు నిర్మించిన కట్టడాలను హైడ్రా తొలగిం చడంతో ఇప్పడు పార్కుకు దారి దొరికింది. ఇప్పుడా 2 ఎకరాల పార్కును జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆ పార్కు అందు బాటులోకి వస్తే అక్కడ ఎంతో మందికి ప్రాణవా యువు అందుతుంది. పార్కుకు దారి లభించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కిరాయిదారున్ని తప్పు పట్టిన కోర్టు..
బాధితుల నుంచి ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై కిరాయిదారుడు హైకోర్టును ఆశ్రయించారు. రోడ్డు, నాలాను ఆక్రమించి ఎలా నిర్మాణాలు చేపడతారంటూ కిరాయిదారుడిని కోర్టు ప్రశ్నించింది. అతను చేస్తున్న వాదనలను తప్పు పట్టింది.
ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలున్నాయా అని ఇంటి ఓనర్‌ను కోర్టు అడిగింది. తనకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడంతో ఆక్రమణల తొలగింపునకు హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. దాంతో బుధవారం రంగంలోకి దిగిన హైడ్రా అక్కడ నిర్మించిన హాస్టల్ భవనాన్ని, కారు మెకానిక్ షెడ్డును తొలగించింది.
జూబ్లీహిల్స్‌లో హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES