Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమీన్‌పూర్‌లో హైడ్రా ఆపరేషన్‌ రికవరీ

అమీన్‌పూర్‌లో హైడ్రా ఆపరేషన్‌ రికవరీ

- Advertisement -

861 ఎకరాలకు ఫెన్సింగ్‌..
అక్రమ కట్టడాల కూల్చివేత


నవతెలంగాణ-అమీన్‌పూర్‌

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ భూముల్లోని కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత కొంతకాలంగా ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఆదివారం భారీ ఎత్తున ఫెన్సింగ్‌ పనులు, అక్రమ కట్టడాల తొలగింపును చేపట్టింది. దాదాపు 861 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఖాళీ ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం ప్రారంభమైన ఫెన్సింగ్‌ నిర్మాణ పనులు రాత్రి వరకు కొనసాగాయి. స్వల్ప విరామం తర్వాత ఆదివారం ఉదయం మళ్ళీ పనులు వేగవంతం చేశారు. భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు దాదాపు పూర్తి కావొచ్చిందని అధికారులు వెల్లడించారు. అమీన్‌పూర్‌లో ముఖీమ్‌ సోదరుడు అజీమ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 6 అంతస్తుల అక్రమ భవనాన్ని హైడ్రా నేలమట్టం చేస్తోంది.

ప్రస్తుతం భవనం తొలగింపు ప్రక్రియ 90 శాతం పూర్తయింది. పక్కనే ఉన్న ఇతర అపార్టుమెంట్లకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిసర భవనాలకు ఇబ్బంది కలగకుండా శాస్త్రీయ పద్ధతిలో కూల్చివేతలు చేపడుతుండటంతో ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతోందని సమాచారం. గతంలో కబ్జాదారుల అక్రమాలకు భయం భయంగా గడిపిన స్థానికులు.. హైడ్రా చర్యలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో ఇక్కడ భూములు కబ్జా అవుతుంటే ఏమీ చేయలేకపోయేవాళ్లం. ఇప్పుడు హైడ్రా రాకతో మాకు భరోసా కలిగింది. సామాన్యుల ఇండ్లను కూల్చబోమని ప్రభుత్వం హామీ ఇవ్వడం మాలో ధైర్యాన్ని నింపింది. విలువైన ప్రభుత్వ భూములను కాపాడటం అభినందనీయం.’ అంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైడ్రా ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి ఆక్రమణల తొలగింపు, ఫెన్సింగ్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -