నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్‌లో భారీ ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. సుమారు రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో సర్వే నంబర్ 403లో ఐదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 1.20 ఎకరాల స్థలాన్ని జలమండలికి వాటర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో కేటాయించింది. అయితే, పార్థసారథి అనే వ్యక్తి ఈ మొత్తం ఐదెకరాల భూమి తనదేనంటూ అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ పత్రాలతో కోర్టును ఆశ్రయించాడు. వాస్తవానికి ఈ భూమి సర్వే నంబర్ 403 కాగా, అతను 403/52 అనే నకిలీ సర్వే నంబర్‌ను సృష్టించి మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
కోర్టులో కేసు విచారణలో ఉండగానే, పార్థసారథి ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బౌన్సర్లు, వేటకుక్కలను కాపలాగా ఉంచాడు. లోపల తాత్కాలిక షెడ్లు నిర్మించి, భూమిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. వాటర్ రిజర్వాయర్ నిర్మాణానికి వెళ్లిన జలమండలి సిబ్బందిని అడ్డుకోవడంతో పాటు, స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. హైడ్రా సిబ్బంది ప్రత్యేక యంత్రాలతో కబ్జాదారు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, షెడ్లను పూర్తిగా కూల్చివేశారు. అనంతరం 5 ఎకరాల భూమి చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ వేసి, ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.