Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరూ. 1400 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

రూ. 1400 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

- Advertisement -

కొండాపూర్‌లో ఏడు ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

కొండాపూర్‌లో 7 ఎకరాల మేర ఉన్న పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది. వీటి విలువ రూ. 1400 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌ విలేజ్‌లోని సర్వే నంబరు 78 నుంచి 93లో రాజరాజేశ్వరి నగర్‌ కాలనీ పేరుతో 2059 ప్లాట్లతో 1993లో గ్రామపంచాయతీ లే అవుట్‌ వేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు 5 ఎకరాలు కేటాయించారు. అలాగే పాఠశాలకు దాదాపు ఎకరా స్థలం, పార్కుల కోసం ఎకరాకు పైగా కేటాయించారు. అయితే పాఠశాలకు కేటాయించిన స్థలంలో 1000 గజాల మేర అపార్టుమెంట్‌ను నిర్మించేశారు. కమ్యూనిటీ హాల్‌ కోసం 2181 గజాలను కేటాయించారు. ఇలా కేటాయించిన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వెంటనే కాపాడి రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్న 5 వేల కుటుంబాలకు ఉపయోగపడేలా చూడాలని హైడ్రా ప్రజావాణిలో కాలనీ సంక్షేమ సంఘం కోరింది. ఈ భూముల ఆక్రమణల వెనుక బడాబాబులు ఉన్నారని ఫిర్యాదు చేసింది. పలు షోరూంలతోపాటు కిరాణా, జనరల్‌ స్టోర్‌లు వచ్చాయని.. రహదారులు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూఎల్సీ భూముల్లోని లే అవుట్‌లలో ప్లాట్లు ఎల్‌ఆర్‌ఎస్‌ అయ్యాయి. పార్కులు, ప్రజావసరాల స్థలాలు ఎల్‌ఆర్‌ఎస్‌ అవ్వకుండా ఆక్రమణదారుల సొంతం ఎలా అవుతాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అవి పార్కులుగానూ, ప్రజావసరాల స్థలాలగానే ఉపయోగపడాలని కోరారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. లే అవుట్‌ ప్రకారం పార్కుతోపాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా నిర్ధారించుకుంది. అవి అక్కడి నివాసితులకే చెందాలనే ఉద్దేశంతో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్‌ వేసింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దాంతో రాజరాజేశ్వరి నగర్‌ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య హైడ్రాతో పరిష్కారమైందని సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -