మూడెకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్
నవతెలంగాణ – సిటీబ్యూరో/జూబ్లీహిల్స్
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఖైరతాబాద్ మండలం వెంగళరావునగర్‌లో మూడెకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. 1975 కంటే ముందే సంబంధిత వ్యక్తులకు పరిహారం ఇచ్చి 45 ఎకరాల భూమని హౌసింగ్ బోర్డు సేకరించింది. మొత్తం 660 ప్లాట్లతో లేఔట్ వేసింది. ఇందులో పార్కుల కోసం కొన్ని స్థలాలను కేటాయించింది. వెంగళరావునగర్ ప్రధాన రహదారికి ఆనుకుని ప్రజావసరాల కోసం 5 ఎకరాల స్థలాన్ని ఖాళీగా ఉంచింది. ఇందులో ఇప్పటికే 2 ఎకరాల వరకూ ఆక్రమణలు జరిగి శాశ్వత కట్టడాలు వచ్చాయి. వాటి జోలికి వెళ్లకుండా మిగిలిన మూడెకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. హౌసింగ్ బోర్డు నుంచి గతంలో పరిహారం తీసుకున్నవారితో పాటు మరో 3 గ్రూపులు ఈ భూమి వారిదిగా చెబుతూ ఆక్రమణలకు పాల్పడ్డాయి. వారితో హైడ్రా సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరి వద్దా సరైన పత్రాలు లేవని నిర్ధారించింది. ఇదే సమయంలో ఆ స్థలం తమదిగా చెబుతున్న వారు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే కొనసాగుతున్నప్పుడు అక్కడ ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించరాదనే నిబంధనలు పట్టించుకోకుండా అందులో కొత్తగా షెడ్డులు వేయడం, గుడిసెలు నిర్మించడం, వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించడంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా బుధవారం ఆక్రమణలను తొలగించింది. 3 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.
రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



