Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశంషాబాద్‌లో రూ.500 కోట్ల విలువైన భూమి హైడ్రా స్వాధీనం

శంషాబాద్‌లో రూ.500 కోట్ల విలువైన భూమి హైడ్రా స్వాధీనం

- Advertisement -

ప్రహరీతో పాటు లోపల వేసిన షెడ్డుల తొలగింపు
12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్‌
ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు


నవతెలంగాణ-శంషాబాద్‌
‘పైగా భూములు’ అంటూ ప్రభుత్వ భూములను కొంతమంది ప్రయివేటు వ్యక్తులు ఆక్రమించి, నిర్మాణాలు చేపడితే శనివారం హైడ్రా అధికారులు ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని సాతంరాయి గ్రామం సర్వే నెంబర్‌ 17లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని 2011లో అప్పటి ప్రభుత్వం.. ఇంటర్మీడియట్‌ బోర్డుకి శిక్షణా కేంద్రాల ఏర్పాటు కోసం అప్పగించింది. అయితే ఆ భూమి పైగా భూమి అని పేర్కొంటూ కొంతమంది కబ్జా చేసి, అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూమిని విడిపించాలని బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించింది. అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇనుప స్తంభాలు పాతి ఫెన్సింగ్‌ ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా హైడ్రా ఇన్స్‌స్పెక్టర్‌ సీహెచ్‌ తిరుమలేష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పని చేస్తోందని తెలిపారు. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రభుత్వ భూములను జల్లెడ పడుతూ ఇప్పటికే వందలాది ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుందని చెప్పారు.

సాతంరాయిలోని ఆ భూమిని ప్రభుత్వం 2011లో ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ బోర్డుకు కేటాయించిందన్నారు. అయితే ఈ భూమి తమదంటూ స్థానికంగా నాయకులుగా చెలామణి అవుతున్న ఒక నాయకుడితో పాటు అనీష్‌ కన్స్ట్రక్షన్స్‌ అనే సంస్థ క్లెయిమ్‌ చేస్తూ బోర్టులు పెట్టిందని తెలిపారు. కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నించడంతో స్థానికులు హైడ్రాకు ఫోటోలు పంపించారని చెప్పారు. రాళ్ళు రప్పలతో వ్యవసాయ వినియోగానికి అవకాశం లేని ఈ ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తున్నామంటూ అసఫ్‌ జాహీ పైగా కుటుంబ వారసుల నుంచి కొన్నామంటూ కబ్జాదారులు చెబుతున్నారని తెలిపారు. కాగా, శంషాబాద్‌ పరిధిలో పైగా కుటుంబాలకు చెందిన భూములు లేవని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. వేరే చోట ఉన్న ఆ భూముల రికార్డులను ఇక్కడ చూపించి కబ్జాలకు పాల్పడినట్టు తెలిపారు. అనీష్‌ కన్స్ట్రక్షన్స్‌ సంస్థకు చెందిన శ్రీపాద దేశ్‌పాండే పలు భూముల వివాదాల్లో ఉన్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిందని తెలిపారు. భూ వివాదంపై అనీష్‌ కన్స్ట్రక్షన్‌ సంస్థ యజమాని శ్రీపాద దేశ్‌పాండే మాట్లాడుతూ.. కోర్టులో కేసు ఉండగానే హైడ్రా అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కూల్చివేయడం అన్యాయమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -