నవతెలంగాణ-సిటీబ్యూరో
ఏడాదికాలంగా ఆక్రమణదారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే హైడ్రా పోలీస్‌స్టేషన్ అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు తాజాగా టోల్ ఫ్రీ నెంబర్‌తోపాటు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించారు. ఇకపై హైడ్రాకు సంబంధించి (టోల్ ఫ్రీ) 1070 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయొచ్చు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాకు గురైతే టోల్‌ఫ్రీ ద్వారా సమాచారాన్ని అందించొచ్చు. మరీ ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, చెట్లు పడిపోయినా, వరద ముంచెత్తినా, అగ్ని ప్రమాదాలు జరిగినా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు హైడ్రాకు సంబంధించిన సేవలన్నిటి కోసం టోల్ ఫ్రీ నెంబరు 1070 ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. దాంతో వెంటనే అధికారులు స్పందించి అన్ని చర్యలు తీసుకునే అవకాశముంది.
వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ఓఆర్‌ఆర్ పరిధిలో ప్రభుత్వ, ప్రజా ఆస్తుల పరిరక్షణకు 8712406899 నెంబర్‌కు సమాచారం ఇవ్వడంతోపాటు, వాట్సాప్ ద్వారా ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంపించొచ్చు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, భారీ వర్షాలు పడి కాలనీలు, రహదారులు నీట మునిగినా, అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే 8712406901, 9000113667 నెంబర్లకు ఫోన్ చేసే సౌకర్యాన్ని సైతం కల్పించారు. 1070 టోల్ ఫ్రీ నంబరుతో పాటు మూడు సెల్ నంబర్లను ప్రజలు వినియోగించుకోవచ్చు.
సేవలను సద్వినియోగించుకోవాలి: హైడ్రా కమిషనర్
ఒక మంచి లక్ష్యంతో హైడ్రాను సీఏం ప్రారంభించారని, దాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని హైడ్రా కమిషనర్ ఐజీ రంగనాథ్ తెలిపారు. రాబోవు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం, అభివృద్ధి ఫలాలను అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అయితే టోల్‌ఫ్రీ, ఇతర నెంబర్లలోనూ ఫిర్యాదులు చేసి అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు.
హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ 1070
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES