- Advertisement -
నేనో మనిషిని
భారతీయుడిని
బతికే ఉన్నాను
పన్నులు కడుతున్నాను
నా తాత ముత్తాతలు
ఎవరైందీ కొంతే తెలుసు
ఎవరు ఎక్కడ్నించి
ఎప్పుడు ఎలా వచ్చారో
పూర్తిగా తెలియదు
నీకూ తెలియదు
మా తెలిస్తే నాలుగైదు తరాలు..
బతుకుతెరువు పోరాటంలో
పని వెనుకే మనిషి ప్రయాణం
నా ప్రాంతం భాషే నా భాష
నా పనికి అవసరమయ్యే భాష
తోటి మనిషితో కలసి
పనిచేయడమే
నా ఉనికి నా బతుకు
పని చేయందే నాకు
బతుకు ఉండదుగా
తీరికలేకో తెలియకో..
చిత్రం జీ హుజూర్!అని
నా ఉనికి నీకు చూపకపోతే
నా ఓటు తీసేస్తావా?
తీయడానికి నీవెవరివి?
నీవూ నాలాంటోనివేకదా.
నేను ఓటేస్తే కదా నీకా పదవి
నేనిచ్చిన పదవితోనే
నా గొంతు కోస్తావా?
గుర్తుంచుకో
నేను బానిసను కాను
నేనో మనిషిని.
– కె శాంతారావు
- Advertisement -