నచ్చినవన్నీ నాలోనే సమాధి చేస్తూ….!
నా మనసే ఓ స్మశానంలా మారిందేమో.
అయినా కరిగిపోయే కాలంతో
ఈ కన్నీటి యుద్దాలు ఎందుకో…?
రాలిపోయే దేహానికి
ఈ ఆశల ఆరాటం ఎందుకో??
ఆ జీవన్మరణాలు మనిషికే కాదు
మనసుకి కూడా ఉంటాయని
అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది…
నిజమే… మనసు ఓ పిచ్చిది.
దాన్ని ఎన్ని ముక్కలు చేసిన
ప్రతి ముక్కలో ఓ పాఠం కనిపిస్తుందని
పిచ్చి బ్రమలో బ్రతికేస్తున్నా…
అయినా ఒక మనిషి
ఎన్ని మాటలు చెప్పినా కానీ…!
వారి ప్రవర్తన మాత్రం
నిజమే చెబుతుంది అంటారు.
దాన్ని అర్థం చేసుకోలేక పోవడం
అంగీకరించ లేక పోవడం
కేవలం నా బలహీనతే కానీ…
దానికి ఎవరూ బాధ్యులు కాదు కదా..!
అందుకే ప్రతి నిత్యం
నీ ఆలోచనలతో అస్తమించే నేను
నీవు మిగిల్చిన భాధ్యతలకు
భరోసాగా నిలుస్తూ మళ్ళీ మళ్ళీ
ఉదయిస్తూనే ఉన్నాను.
”నాలో నేను నాకు నేనుగా”
ఈ భాధ్యతల బందిఖానాలో
ఏ తీరం చేరని అలనై అలుపెరుగని
నిత్య పోరాటం చేస్తూనే ఉన్నాను…
- ధాత్రి