అచ్చంపేటలో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రం 20 ఎకరాల్లో నిర్మాణం
మాకు సేవ చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చారు
చదువుతోనే ధనవంతులు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తాము పాలకులం కాదు సేవకులమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమకు సేవ చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. పాలకుడిగా తాను ఎప్పుడూ ప్రవర్తించలేదని, సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. గెలుపు ఓటమి అన్నింటికీ తానే బాధ్యత తీసుకుం టానని చెప్పానన్నారు. వివిధ వర్గాలను పరిపాలనలో భాగస్వాములను చేయాలనే ఆలోచన తనదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీలు 17 శాతం ఉంటే తమ ప్రభుత్వంలో 30 శాతం ఉన్నారన్నారు. దళితులకు మూడు మంత్రి పదవులు, స్పీకర్ ఇచ్చామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి వారికి మేలు చేశామన్నారు. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
అచ్చంపేట అడవుల్లో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అచ్చంపేటలో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రం నిర్మిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పుణ్యక్షేత్రాన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో నిర్వహించిన సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. పుణ్యక్షేత్రం నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ముఖ్యమంత్రి రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.
తన ప్రజా జీవితంలో జెడ్పీటీసీగా విజయం సాధించడం మొదలు ముఖ్యమంత్రిగా తాను కొనసాగుతున్న క్రమంలో 20 ఏండ్లలో లంబాడాలు తనకు అండగా నిలిచారని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయంలో ల్యాండ్ సీలింగ్‌ను తెచ్చి భూములను పంచారనీ, అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం పంచేందుకు ప్రభుత్వం వద్ద భూములు లేవనీ, దేశాన్ని ఏలేందుకు ఏ చదువులు ఎంత చదువుకున్నా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సోషల్, ఎకనామిక్, క్యాస్ట్ సర్వేను ఆయన ప్రస్తావిస్తూ, గతంలో మాదిరిగా భూములుంటేనే ధనవంతులనే పరిస్థితి లేదని తెలిపారు. చదువుకుంటేనే ధనవంతులుగా మారుతున్నారని ఆ సర్వేలో గమనించినట్టు చెప్పారు. భూములు, తాత్కాలిక సంక్షేమం మరిచి బంజారాలు చదువుకోవాలని సీఎం సూచించారు. చదువే వారి భవిష్యత్తును మారుస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, పునర్నిర్మాణంలో లంబాడాల పాత్ర తీసివేయలేనిదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సురేష్ నాయక్, కవితా నాయక్ తదితరుల ఆత్మ బలిదానాలు చేశారని ఆయన ఉదహరించారు. వారికి సంక్షేమంలో, అభివృద్ధిలో, ప్రభుత్వ పాలనలో సముచిత భాగస్వామ్యం, గౌరవం దక్కాల్సి ఉందన్నారు. ప్రతి తండాకు బీటీ రోడ్లను వేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమశాఖ మంత్రినీ, ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతి తండాలో పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. అటవీ నిబంధనలు అడ్డుగా ఉన్న తండాల్లో విద్యుత్ సరఫరాకు సోలార్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అచ్చంపేటలో ప్రయోగాత్మకంగా 40 వేల పంప్ సెట్లకు సోలార్ విద్యుత్ ఇచ్చేందుకు ఎంపిక చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
గత ప్రభుత్వం 10 ఏండ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామనీ, దీంతో మార్కెట్‌లో గతంలో రూ.60 కేజీ ఉన్న సన్నబియ్యం ధర రూ.40కి పడిపోయిందని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, స్వయం సహాయక సంఘాలను వెయ్యి బస్సులకు యజమానులను చేశామనీ, వెయ్యి మెగావాట్ల సోలర్ ప్రాజెక్టును అప్పగించామనీ, హైటెక్ సిటీలో విలువైన భూమిని మహిళా సంఘాల ఉత్పత్తుల కోసం కేటాయించామనీ, హాస్టల్ బాలికలకు కాస్మొటిక్స్ ఛార్జెస్‌ను 200 శాతం పెంచినట్టు తెలిపారు. గ్రూప్స్‌తో పాటు ప్రభుత్వం చేపట్టిన 70 వేల నియామకాల్లో 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉద్యోగాలు సాధించారని తెలిపారు.
మున్సిపల్ ఫలితాలు నా పనితనానికి గీటురాయి
నేనే రాజు …. నేనే మంత్రి అంటే కొంత మంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములకు తనదే బాధ్యత అని చెప్పినట్టు ముఖ్యమంత్రి వివరించారు. ఎన్నికలకు ముందు 12 ఏండ్లు కేంద్రంలో ఉన్న పార్టీ, పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, రెండేండ్లుగా తమ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని తాను కోరినట్టు ఆయన గుర్తుచేశారు. తాము పాలకులం కాదనీ, సేవలకులమని గతంలోనే తాను చెప్పిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుర్తుచేశారు. సేవకునిగానే బాధ్యతలు నిర్వహిస్తున్నాననీ, ఏ వర్గాలైతే తనకు అవకాశమిచ్చారో ఆ వర్గాలకు సేవ చేయాలన్నదే తన ప్రయత్నమని స్పష్టం చేశారు. జఠిలంగా మారిన ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాననీ, బుడగ జంగాలకు చెందిన పిల్లలకు ఎంబీబీఎస్‌లోనూ సీట్లు వచ్చాయని తెలిపారు. తాను చేసిన పని ఫలితాలను ఇస్తోందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే, అది జీర్ణించుకోలేక, అర్థం కాక, అర్థమైనా స్వీకరించే మనసు వారికి లేదని ఆయన విమర్శించారు.దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన వారిని ఆ దళితున్నే అధ్యక్షా అని మైక్ అడిగే పరిస్థితిని తెచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీలకు ప్రభుత్వంలో 30 శాతం అవకాశం కల్పించినట్టు తెలిపారు. ప్రజలు ఆశీర్వదించినంత కాలం ఉంటాననీ, పరిణామ క్రమంలో ఇతరులు రావాల్సిందేనన్నారు. అప్పటి వరకు ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. ప్రజా తీర్పును తప్పుపట్టొద్దని ఆయన సూచించారు. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం తనకు అలవాటు లేవన్నారు. 20 ఏండ్లలో ఎన్నో హోదాలు చూసిన తాను ఏనాడు ప్రజలకు దూరం కాలేదనీ, మరో 20 ఏండ్లు పేదల కోసమే పని చేస్తానని చెప్పారు. సంత్ సేవాలాల్ లంబాడాల కోసం చేసిన కృషిని ముఖ్యమంత్రి కొనియాడారు.
సేవాలాల్ మార్గాన్ని అనుసరిస్తాం -మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సేవాలాల్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ విద్య, ఉపాధి, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వమే లక్ష్యంగా గిరిజన సమాజాన్ని అభివద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గిరిజన సమాజంలో పెను మార్పులకు దోహదపడ్డ గొప్ప సంస్కర్త సేవాలాల్ బోధించిన సమానత్వం, సత్యం, శ్రమ, సామాజిక ఔన్నత్యం వంటి విలువలు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని మంత్రి సూచించారు. సేవాలాల్ జయంతికి ఇస్తున్న నిధులను రూ.10 కోట్లకు పెంచాలని అభ్యర్థించారు. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీయే బంజారాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచందర్ నాయక్, ట్రైకార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సబ్యసాచి ఘోష్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



