– కోహ్లి, రోహిత్ భవితవ్యంపై గౌతీ
– అభిమానుల ప్రేమ టైటిల్ కంటే మిన్న
– భారత చీఫ్ కోచ్ గౌతం గంభీర్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మంచిగా రాణించినంత వరకు జట్టులో కొనసాగాలని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. రానున్న ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉంటారా? లేదా? అనేది చెప్పడానికి నేను సెలక్టర్‌ను కాదని గంభీర్ చురకలు వేశాడు. ఏబీపీ న్యూస్ ‘ఇండియా ఎట్ 2047’ సమ్మిట్‌లో పాల్గొన్న గౌతం గంభీర్ సరిహద్దు ఉద్రిక్తలు, భారత క్రికెట్ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
రాణిస్తే జట్టులో ఉండాలి!
విరాట్ కోహ్లి (36), రోహిత్ శర్మ (38) కెరీర్‌పై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మను తప్పిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆసీస్ పర్యటనలో రోహిత్, కోహ్లి వైఫల్యంతో విమర్శకులు జట్టులో ఆ ఇద్దరి స్థానాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ ఈ అంశంపై స్పందించాడు. ‘మంచిగా ఆడుతున్నంత వరకు విరాట్, రోహిత్ భారత జట్టులో కొనసాగాలి. ఆ ఇద్దరి భవితవ్యంపై నా ప్రభావం ఉండదు. జట్టును ఎంపిక చేసే బాధ్యత సెలక్షన్ కమిటీది. కోచ్‌గా తుది జట్టు ఎంపికలోనే నా పాత్ర ఉంటుంది. నా ముందున్న కోచ్‌లు సెలక్టర్లుగా వ్యవహరించలేదు, నేను కూడా సెలక్టర్‌ను కాదు. ఎప్పుడు మొదలెట్టాలి, ఎప్పుడు ముగించాలనేది వ్యక్తిగత నిర్ణయం. కోచ్, సెలక్టర్, బీసీసీఐ సహా మరొకరు ఈ విషయంలో జోక్యం చేసుకోరు. బాగా ఆడితే 40 ఏండ్లలో ఎందుకు నిష్క్రమించాలి, 45 ఏండ్ల వరకు జట్టులో కొనసాగవచ్చు. ఫామ్‌లో ఉన్న క్రికెటర్‌ను ఆపేదెవరు?. 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేది కోహ్లి, రోహిత్‌పైనే ఆధారపడి ఉంది. వ్యక్తిగత ప్రదర్శనే జట్టులో ఎంపికకు కొలమానం. ఆ ఇద్దరి ప్రదర్శనపై నేను చెప్పడానికి ఏముంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ప్రపంచమే చూసింది’ అని గౌతం గంభీర్ అన్నాడు.
వీడ్కోలు ఎవరు కోరుకుంటారు?
స్టార్ క్రికెటర్ల వీడ్కోలు ప్రణాళిలకను గౌతం గంభీర్ కొట్టిపారేశాడు. ఏ క్రికెటర్ సైతం వీడ్కోలును ప్రణాళికబద్దంగా చేసుకోడని, అసలు వీడ్కోలు ఎవరు కోరుకుంటారని ప్రశ్నించాడు. ‘ ఏ క్రికెటర్ వీడ్కోలు గురించి ఆలోచిస్తూ క్రికెట్ ఆడడు. వీడ్కోలు గురించి ఆలోచించకుండా.. ఆ ఆటగాడు దేశానికి ఎన్ని మ్యాచుల్లో విజయాలు అందించాడనే అంశంపై దృష్టి నిలపాలి. వీడ్కోలు ఉంటుందా? లేదా అనేది ముఖ్యం కాదు. జాతీయ జట్టు విజయానికి కృషి చేస్తే అంతకుమించిన వీడ్కోలు ఉంటుందా? దేశ ప్రజల ప్రేమాభిమానాలను మించిన ట్రోఫీలు ఉంటాయా? క్రికెటర్లకు వీడ్కోలు ముఖ్యం కాదు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
పాక్‌తో క్రికెట్ వద్దు!
సరిహద్దు ఉద్రిక్తలు మరోసారి తారాస్థాయికి చేరుకోవటంతో పొరుగు దేశం పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను చర్చనీయాంశం అయ్యాయి. సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాకిస్థాన్‌తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకూడదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘పాక్‌తో క్రికెట్ సంబంధాలపై నా వ్యక్తిగత అభిప్రాయం ‘వద్దు’. సీమాంతర ఉగ్రవాదం పూర్తి రూపుమాపే వరకు భారత్, పాక్ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకూడదు. ప్రభుత్వం, బీసీసీఐ అంతిమంగా దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాయి. క్రికెట్, బాలీవుడ్, ఇంకా ఏదేని అంశం.. భారత సైనికులు, ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ కాదు. మ్యాచులు జరుగుతూనే ఉంటాయి. సినిమాలు తీస్తూనే ఉంటారు. గాయకులు పాడుతూనే ఉంటారు. కానీ కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయిన బాధను ఏదీ తీర్చలేదు. ఇప్పటివరకు మల్టీ టీమ్ ఈవెంట్‌లోనే పాకిస్థాన్‌తో భారత్ ఆడుతుంది. ఇక నుంచి అటువంటి టోర్నమెంట్లలోనూ పాకిస్థాన్‌తో మన జట్టు ఆడకూడదు. అంతిమంగా బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంటుంది. అది ఏ నిర్ణయమైనా రాజకీయ కోణంలో చూడకూడదు’ అని గౌతం గంభీర్ తెలిపాడు.
నేను సెలక్టర్‌ను కాదు!
- Advertisement -
- Advertisement -