Tuesday, July 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంక్షమాపణ చెప్పేదేలే!

క్షమాపణ చెప్పేదేలే!

- Advertisement -

– పాలస్తీనా ఉద్యమనేత అబ్దుల్లా గుండెనిబ్బరం
– 40 ఏండ్ల తర్వాత జైలు నుంచి విడుదల
– ప్రజా ఉద్యమాలకు తలొంచిన అమెరికా, ఇజ్రాయిల్‌, ఫ్రాన్స్‌ దేశాలు
బీరుట్‌:
”మీకు క్షమాపణ చెప్పి రాజకీయ ఆత్మహత్యాసదృశ్యమైన విడుదల కోసం ఎన్నటికీ అంగీకరించే ప్రసక్తే లేదు. అలాచేసి నా పాలస్తీనా జాతికి కళంకం తేలేను. క్షమాపణలతో విడుదల అయ్యే కంటే, శేష జీవితాన్ని జైల్లో గడపడాన్నే పాలస్తీనా జాతి ఆత్మ గౌరవ పరిరక్షణగా భావిస్తాను” అని రొమ్ము విరుచుకొని ధైర్యంగా నిలబడిన పాలస్తీనా ఉద్యమ విప్లవ నేత జార్జెస్‌ ఇబ్రహీం అబ్దుల్లా 40 ఏండ్ల తర్వాత బేషరతుగా జైలు నుంచి విడదల అయ్యారు.
ఆయన్ని కారాగారంలోనే బంధించాలని అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఎన్ని కుట్రలు పన్నినా, ఫ్రాన్స్‌పై ఎన్ని వత్తిళ్లు తెచ్చినా, అవన్నీ ప్రజాందోళనల ముందు నిలువలేకపోయాయి. ఆయన విడుదల అంతర్జాతీయంగా పాలస్తీనా సంఘీభావ ఉద్యమ చరిత్రలో ఓ ప్రేరణాత్మక సంఘటనగా నిలిచింది.
ఇదీ నేపథ్యం
జార్జెస్‌ ఇబ్రహీం అబ్దుల్లా … లెబనాన్‌లో పాఠశాల టీచర్‌గా ఉద్యోగం చేస్తూ 1970లో కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రభావితుడై పాలస్తీనా జాతీయ విమోచనా పోరాటంలో భాగస్వామి అయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేశారు. పాలస్తీనాలో అమెరికా అండతో ఇజ్రాయిల్‌ చేస్తున్న మారణకాండను సాయుధపోరాటం ద్వారా ఎదిరించారు. దీనితో అరబ్‌ సమాజంలో గొప్ప ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. 1982లో అమెరికా, ఇజ్రాయిల్‌ దౌత్యవేత్తల హత్యలు జరిగాయి. ఈ కేసులో 1984లో అరెస్టు అయ్యారు. 1987లో ఫ్రాన్స్‌ కోర్టు జైలుశిక్ష విధించింది.
ఫ్రాన్స్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ ఒత్తిళ్లు
ఫ్రాన్స్‌ న్యాయసూత్రాల ప్రకారం పాతికేండ్లు జైలు జీవితం గడిపాక, విడుదల కోసం పిటిషన్‌ దాఖలు చేసే అర్హత లభిస్తుంది. ఇలాంటి పిటీషన్లు 11 సార్లు దాఖలయ్యాయి. అబ్దుల్లాను విడుదల చేయొద్దని ఫ్రాన్స్‌ సర్కార్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ ఒత్తిళ్ళు తెచ్చాయి.
మిన్నంటిన నిరసనలు
ఫ్రాన్స్‌లో అబ్దుల్లా విముక్తి కోసం ప్రజాందోళనలు మిన్నంటాయి. అరబ్‌ దేశాల్లోను నిరసనలు హోరెత్తాయి. లెబనాన్‌లో ఆందోళనలు పతాకస్థాయికి చేరాయి. దీనితో ఫ్రాన్స్‌ పునరాలోచనలో పడక తప్పలేదు. ఈ సమయంలో కూడా అబ్దుల్లా క్షమాపణలు చెప్తే, జైలు నుంచి విడుదల చేస్తామని ప్రకటించాలని అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఫ్రాన్స్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాయి. అయితే క్షమాపణలు చెప్పేందుకు అబ్దుల్లా నిరాకరించారు. చనిపోయేదాకా జైల్లోనే ఉంటాను తప్ప, తలొంచేది లేదని తెగేసి చెప్పారు. దీనితో చట్టానికి వ్యతిరేకంగా అబ్దుల్లాను ఇంకా జైలులోనే నిర్భందిస్తే, పరిస్థితులు చేయిదాటతాయని భావించిన ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌ కోర్టు ఎట్టకేలకు అబ్దుల్లాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయన లెబనాన్‌కే వెళ్లాలనీ, జీవితకాలంలో తిరిగి ఫ్రాన్స్‌కు రావద్దనే షరతును కోర్టు విధించింది.
ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ ప్రతిఘటన తర్వాత మారిన పరిస్థితులు
అబ్దుల్లా విడుదల కోసం ఫ్రాన్స్‌లో ఆయన్ని బంధించిన జైలు ఎదుట భారీ ఆందోళనలు జరిగాయి. గాజా విధ్వంసం తర్వాత ఈ ఆందోళనలు మరింత ముమ్మరం అయ్యాయి. ఇప్పటివరకు తిరుగులేని సైనిక రాజ్యంగా చెప్పుకొనే ఇజ్రాయిల్‌కు ఇరాన్‌ యుద్ధం ద్వారా గట్టిగా బుద్ధి చెప్పడంతో వెస్ట్‌ ఆసియా రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అరబ్‌ ప్రపంచంలో కొత్త ఉత్సాహం వెల్లువెత్తింది. అది అబ్దుల్లా విడుదల కోసం జరిగే ఆందోళనలకి మరింత బలాన్ని ఇచ్చింది. యుద్ధోన్మాద దేశాలకు గుబులు పుట్టించింది.
అబ్దుల్లాకు ఘనస్వాగతం
అబ్దుల్లా ఈ నెల 25న జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో పాలస్తీనా సంఘీభావ బృందాలు ఆయనకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశాయి. 40 ఏండ్ల తర్వాత అబ్దుల్లా తిరిగి తన మాతృదేశంలోకి అడుగుపెట్టారు. యువకుడిగా ఉన్నప్పుడు జైలుకు వెళ్లిన అబ్దుల్లా వయసు ఇప్పుడు 74 ఏండ్లు. ఇప్పటికీ ఆయన అదే ఉక్కు సంకల్పంతో ఉన్నారు. ఆయన ఇప్పుడు పాలస్తీనాకు వెలుగుచుక్కగా కనిపిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఇజ్రాయిల్‌ మెల్లగా గాజా నుంచి తన సైన్యాన్ని ఉప సంహరించుకుంటోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -