చీఫ్ జస్టిస్ గవాయ్ వివరణ
న్యూఢిల్లీ : అన్ని మతాల పట్ల తనకు నమ్మకముందని, అన్ని ఆరాధనా స్థలాలను సందర్శిస్తానని, నిజమైన లౌకికవాదంలో తనకు ప్రగాఢమైన విశ్వాసముందని సుప్రీం చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టం చేశారు. ధ్వంసమైన విష్ణుమూర్తి విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసనలు, ఖండనలు వెల్లువెత్తుతున్న తరుణంలో 48గంటల తర్వాత గవాయ్ గురువారం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ”నేను చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో ఎలాచిత్రీకరించబడుతున్నాయో ఒకరు నాతో చెప్పారు. నేను అన్ని మతాలను నమ్ముతాను, అన్నింటినీ గౌరవిస్తాను.” అని చీఫ్ జస్టిస్ గవాయ్ కోర్టు గదిలో చెప్పారు. అక్కడే వున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, చీఫ్ జస్టిస్ తనకు దశాబ్ద కాలం నుంచి తెలుసునని, ఆలయాలతో సహా అన్ని ఆరాధనా స్థలాల్లోనూ పర్యటించడం కూడా తనకు తెలుసునని చెప్పారు. దర్గాలు, గురుద్వారాలు కూడా సందర్శించానని, తనకు నిజమైన లౌకికవాదం పట్ల నమ్మకముందని పునరుద్ఘాటించారు. తాను చేసిన వ్యాఖ్యలు సందర్భానుసారం అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకున్నారని, అందుకే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. అయినా భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) ఆధ్వర్యంలో గల కట్టడాల పరిధిలోని వాటిపై తామెలా ఆదేశాలు జారీ చేయగలమని ఆయన ఎదురు ప్రశ్నించారు. వక్ఫ్‌కేసు ఇంకా తన మనస్సులో మెదులుతున్నసమయంలోనే ఈ పిటిషన్ విచారణకు వచ్చిందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని జావరి ఆలయంలో ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునర్నిర్మించాలని లేదా మార్చాలని లేదా పునరుద్ధరించాలని కోరతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నెల 16న చీఫ్ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో వుంది.