Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుపుస్తెలు కొనలేం

పుస్తెలు కొనలేం

- Advertisement -

తులం బంగారం ఏ1.12 లక్షలు
ఒకే రోజు రూ.5వేలు ప్రియం
పేదోడి ఇంట్లో పెళ్లి పెద్ద పరీక్షే
రూపాయి పతనం ఎఫెక్ట్‌
భౌగోళిక ఆందోళనలతో ఆజ్యం

బంగారం ధరలు రాకెట్‌ కంటే వేగంగా దూసుకుపోతున్నాయి. తులం బంగారం రూ.1.10 దాటి మరింత పైకి పరుగులు పెడుతోంది. దీంతో అనేక పేద, సామాన్య కుటుంబాలు తమ ఆడబిడ్డ పెళ్లికి కనీసం పుస్తెలు కొనలేని దుస్థితి నెలకొంది. వచ్చే అక్టోబర్‌ నుంచి తెలుగు రాష్ట్రాలు సహా దేశంలో పెండ్లిండ్ల సీజన్‌ ప్రారంభం కానుంది. అధిక బంగారం ధరలు ఆడపిల్లల తల్లిదండ్రులను బెంబెలెత్తిస్తున్నాయి. ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ సమాచారం ప్రకారం.. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధర ఒక్క పూటలోనే రూ.5,080 ఎగిసి రూ,1,12,750కి చేరింది. దీనికి అదనంగా 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత గరిష్ట స్థాయి కావడం ఆందోళనకరం. ఇంతక్రితం సోమవారం రూ.1,07,670గా పలికింది. కిలో వెండిపై రూ.2,800 పెరిగి రూ.1,28,800కి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ అమాంతం పడిపోవడం, భౌగోళిక ఆందోళనలు బంగారం ధరకు ప్రధానంగా ఆజ్యం పోస్తున్నాయి.

నవతెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌
అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్క ఔన్స్‌ (28 గ్రాములు) బంగారం ధర ఆల్‌టైం రికార్డ్‌ 3,659.27 డాలర్లకు చేరింది. గత వారం అమెరికాలో బలహీనమైన లేబర్‌ మార్కెట్‌ గణంకాలు బంగారం ధర పెరుగుదలకు కారణమని ట్రేడర్లు పేర్కొంటున్నారు. మరోవైపు డాలర్‌తో భారత రూపాయి మారకం విలువ 88 ఎగువకు పడిపోవడంతో దిగుమతి పసిడి మరింత భారం కావడంతో ఇక్కడ ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్‌ టారిఫ్‌లు మొత్తం ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితిని పెంచాయి. భౌగోళికంగా జరుగుతున్న పలు యుద్ధాలు, తీవ్ర ఆందోళనల నేపథ్యంలో పసిడిని సురిక్షిత పెట్టుబడిగా పరిగణించడం ఈ లోహం ధరలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు..
డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డ్‌ పతనం.
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఆందోళనలు.
ఇజ్రాయిల్‌, పాలస్తీన మధ్య యుద్ధం
సెంట్రల్‌ బ్యాంక్‌లు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం.
డాలర్‌ కంటే బంగారంపై పెట్టుబడులు పెరగడం.
ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు పసిడి డిమాండ్‌ను పెంచుతున్నాయి.
4 ట్రంప్‌ టారిఫ్‌లు ఆర్థిక సంక్షోభాన్ని పెంచడంతో పసిడి ధరకు ఆజ్యం పోశాయి.

మూడేండ్లలో అత్యల్ప అమ్మకాలు..
భారీగా పెరిగిన బంగారం ధరల వల్ల అమ్మకాలు తగ్గాయని అభరణాల వర్తకులు చెబుతున్నారు. రాఖీ పండగ నుంచి ఓణం వరకు బంగారం డిమాండ్‌లో 28 శాతం తగ్గి 50 టన్నులకు పరిమితమయ్యిందని ఇండియా బులియన్‌ అండ్‌ జ్యూయలర్స్‌ అసోసియేషన్‌ (ఐబీజేఏ) వెల్లడించింది. గత మూడేండ్లలో అత్యంత తక్కువ అమ్మకాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. కరోనా తర్వాత ప్రతీ ఏడాది బంగారం ధరల్లో 49 శాతం పెరుగుదల చోటు చేసుకుందని పేర్కొంది. ఈ ధరల పెరుగుదల వినియోగదారుల కొనుగోలు ఆశలను దెబ్బతీసిందని ఆ వర్గాలు తెలిపాయి. చాలా మంది ఆభరణాల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారని.. కొనుగోలు చేసిన వారు కూడా తక్కువ స్వచ్ఛత లేదా క్యారెట్‌, తేలికైన బరువు గల వస్తువులను ఎంచుకుంటున్నారని అభరణాల వర్తకులు పేర్కొన్నారు.

పరిశ్రమకు నష్టమే..!
భారతీయ కుటుంబ వివాహాల్లో బంగారం అత్యంత కీలకం. కానీ అధిక ధరల వల్ల కొనుగోలు భారం పెరగడంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అధిక ధరలు అభరణాల పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగిం చనున్నాయి. డిమాండ్‌ తగ్గడం వల్ల జ్యూయలర్స్‌ అమ్మకాలు పడిపోతాయి. చిన్న జ్యూయలరీ దుకాణాలు, హస్తకళాకారులు తక్కువ అమ్మకాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ద్వారా అధిక విలువకు దిగుమతి చేసుకోవడంతో దేశ వాణిజ్య లోటు పెరగనుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రమాదం.

ఏడాదిలోనే 70 శాతం ప్రియం..
దేశంలో 2000-2010 వరకు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో 15-20 శాతం మాత్రమే పెరిగాయి. 2011లో ఒక్క సారిగా 43 శాతం ఎగిసింది.2013-2015లో మళ్లీ తాత్కాలికంగా తగ్గుదల చోటు చేసుకుంది. తిరిగి 2020 కోవిడ్‌ సమయంలో 38.2 శాతం పెరిగింది. గడిచిన ఒక్క ఏడాదిలోనే 70 శాతం మేర పెరగడం తీవ్ర ఆందోళకరం. 2024-2025లో చోటు చేసుకున్న అంతర్జాతీయ అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరగడం, రూపాయి విలువ అమాంతం పడిపోవడం బంగారం ధరలను రాకెట్‌లా దూసుకుపోయేలా చేశాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad