‘కాంతార: చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్
‘దాదాపు మూడేళ్ళ వయసున్నప్పుడు.. మా అమ్మమ్మ కుందాపుర సమీపంలోనే మన ఊరు అని చెప్పేది. దానికి సంబంధించిన కథలు చెప్పేది. అవన్నీ నాకు నచ్చేవి. అయితే ‘ఇలా నిజంగానే జరుగుతుందా?’ అని నాకెన్నో సందేహాలొచ్చేవి. గుళిక, పంజుర్లి గురించి తెలుసుకోవా లనిపించేది. నేను విన్న ఆ కథలతో ఓ దర్శకుడు సినిమా తెరకెక్కిస్తాడని అనుకోలేదు. నా సోదరుడు రిషబ్‌శెట్టి దాన్ని సాధ్యం చేశాడు. నేను బాల్యంలో విన్న కథలను తెరపై చూసి ఆశ్చర్యపోయా.. దాని గురించి మాటల్లో చెప్పలేను. కథ తెలిసి నేను ఇలా అయిపోతే.. కొత్తగా తెలుసుకున్న వారు ఏమయ్యారో అదే ‘కాంతార’ ఫలితం అని ఎన్టీఆర్ అన్నారు. ‘కాంతార’తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ ‘కాంతార: చాప్టర్ 1’తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన, ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఎన్టీఆర్ మాట్లాడుతూ, ‘చాలా అరుదైన దర్శకుడు రిషబ్. 24 క్రాఫ్ట్‌లో అన్ని క్రాఫ్ట్స్‌ని ఆయన డామినేట్ చేయగలరు. రిషబ్ లేకపోతే నిజంగా ఈ సినిమాని ఈ లెవెల్‌లో తీయగలిగేవారా అనిపిస్తుంది. ఉడిపి కష్ణుడు గుడికి తీసుకెళ్లాలని మా అమ్మ కోరిక. రిషబ్ లేకపోతే ఆ దర్శనం అలా అయ్యేది కాదు. ఆ భాగ్యం కలిగేది కాదు. పనులన్నీ మానుకొని కుటుంబ సభ్యులులాగా మాతో వచ్చారు. సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ‘కాంతార చాప్టర్ వన్’ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో చూసే అవకాశం దొరికింది. ఈ సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒక గుడికి తీసుకెళ్లారు. నిజానికి ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు. అలాంటి మార్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. ‘కాంతార’ రిషబ్ శెట్టి డ్రీమ్. ఈ డ్రీమ్‌ని ఫుల్ ఫిల్ చేయడానికి హోంబలే ఫిల్మ్స్ సపోర్ట్ చేసింది. ఇండియన్ ఫిలిమ్స్‌లో ఒక గొప్ప బ్లాక్ బాస్టర్ చిత్రంగా ఈ చిత్రం ప్రస్ఫుటంగా కనబడాలని మనస్పూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘మీ అందరి ప్రేమకు, సపోర్ట్‌కి ధన్యవాదాలు. ఎన్టీఆర్ నాకు ఫ్రెండ్, బ్రదర్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక బ్రదర్‌తో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ వేడుకను హైదరాబాద్‌లో జరుపుకోవడం, దీనికి ఎన్టీఆర్ రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఆడియన్స్‌కి హదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాకి మీరందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అక్టోబర్ 2న ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూసి ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను’ అని హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి చెప్పారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ,’ ‘కాంతార’ ఎక్స్ట్రార్డినరీ. రిషబ్ లుక్ మైండ్ బ్లోయింగ్. ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడే సినిమా చూడాలనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూసిన ఒకరిద్దరూ అద్భుతమైన సినిమా అని చెప్పారు. వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా నిజమవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో చాలా పెద్ద నెంబర్స్ కలెక్ట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. ఎన్టీఆర్‌తో మేము చేస్తున్న సినిమాలో కూడా రుక్మిణి హీరోయిన్. ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా వేరే లెవల్’ అని తెలిపారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, హీరోయిన్ రుక్మిణి వసంత్, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రగతి శెట్టి, హోంబలే ఫిల్మ్స్ కో ఫౌండర్ చలువే గౌడ, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల తదితరులు ఈ వేడుకలో పాల్గొని, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.