Saturday, January 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఐ డోంట్‌ కేర్‌

ఐ డోంట్‌ కేర్‌

- Advertisement -

నాకు అంతర్జాతీయ చట్టాలతో పని లేదు : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌
యూఎస్‌ ప్రకటనలు చాలా ప్రమాదకరం : నిపుణులు

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అంతర్జాతీయ చట్టాన్ని పట్టించుకోనని చెప్పారు. తన స్వంత నైతికతే ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న తన దూకుడు చర్యలకు నియంత్రణగా ఉంటుందని తెలిపారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అమెరికా సైన్యం అపహరించిన తర్వాత ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. మరోపక్క వెని జులాపై అమెరికా సైనికదాడి జరగడం ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధమని నిపుణులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పై విధంగా స్పందించడం గమనార్హం. ”నాకు అంతర్జాతీయ చట్టం అవసరం లేదు. నేను ప్రజలను బాధపెట్టాలని చూడటం లేదు” అని ట్రంప్‌ అన్నారు. తాను అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండాలన్న విషయం అంతర్జాతీయ చట్టం నిర్వచనంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

తన విదేశాంగ విధాన లక్ష్యాలను సాధించడానికి యూఎస్‌ సైన్యం ఎంతకైనా వెళ్తుందన్న సుముఖతను ఆయన వ్యక్తం చేశారు. వెనిజులాను అమెరికా ‘నడిపిస్తుందని’, అక్కడి విస్తృత చమురు వన రులను వినియోగించుకుంటామని కూడా ట్రంప్‌ అన్నారు. వెనిజులా ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌కు తన యంత్రాంగం సహకరిస్తుందని చెప్పినప్పటికీ ట్రంప్‌ పై విధంగా స్పందించటం గమనార్హం. అంతేకాదు.. తాత్కాలిక ప్రభుత్వానికి విధానాలను నిర్దేశిస్తామని కూడా ట్రంప్‌ యంత్రాంగం చెప్తున్నది. అమెరికా డిమాండ్లను ధిక్కరిస్తే సైనిక చర్యల రెండో దశ ఉంటుందని పదేపదే బెదిరించటం గమనార్హం. ”ఒకవేళ ఆమె ఏది సరైందో దానిని చేయకపోతే, ఆమె భారీ మూల్యం చెల్లిస్తుంది. బహుశా అది మదురోను మించి ఉంటుంది” అని ఓ ఇంటర్వ్యూలో తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్‌ గురించి మాట్లాడుతూ ట్రంప్‌ అన్నారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న ట్రంప్‌ గతవారం కొన్ని వ్యాఖ్యలు చేశారు.

కొలంబియా లెఫ్ట్‌-వింగ్‌ అధ్యక్షులు గుస్తావో పెట్రోపై అమెరికా సైనిక దాడి చేయవచ్చని చెప్పారు. అలాగే డెన్మార్క్‌ భూభాగమైన గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే తన ప్రయత్నాన్ని కూడా ట్రంప్‌ తీవ్రతరం చేశాడు. గతేడాది జూన్‌లో ట్రంప్‌.. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధంలో చేరి, ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై బాంబుదాడికి ఆదేశించిన విషయం విదితమే. ట్రంప్‌ అంతరంగికుడు స్టీఫెన్‌ మిల్లర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం తన సైనిక శక్తిని ఎలాంటి సంకోచం లేకుండా ఉపయోగిస్తుందని అన్నారు. ట్రంప్‌ ఆధ్వర్యంలో తాము ఒక సూపర్‌ పవర్‌గా వ్యవహరించబోతున్నామని మిల్లర్‌ తెలిపారు. అయితే అమెరికా చర్యలపై అంతర్జాతీయ నిపుణులు హెచ్చరి స్తున్నారు. అంతర్జాతీయ చట్టాన్ని విస్మరించడం వల్ల అమెరికాతో సహా మొత్తం ప్రపంచ సమాజానికి విపత్కర పరిణామాలు ఉండవచ్చని అంటున్నారు. అంతర్జాతీయ చట్టాన్ని తోసిపుచ్చే యూఎస్‌ ప్రకటనలు చాలా ప్రమాదకరమైనవని యూఎన్‌ ప్రత్యేక ప్రతినిధి మార్గరెట్‌ సాటర్త్‌వైట్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -