రాజ్యాంగాన్ని నమ్మి పని చేస్తా : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”రాజకీయాల్లో అయినా.. వ్యక్తిత్వంలో అయినా… నేనే రాజు… నేనే మంత్రి. నేనెవరితో పోల్చుకోను” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాను మోడీ, కేసీఆర్‌లాగా వ్యవహరించననీ, రాజ్యాంగాన్ని నమ్మి పని చేస్తానని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం గురువారం తన అధికారిక నివాసం తుగ్లక్‌రోడ్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్రమంత్రుల్ని కలిసి విజ్ఞప్తులు చేసినట్టు చెప్పారు. అలాగే తాజా మున్సిపల్ ఎన్నికల తీరు, ఇతర అంశాలపై పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లకు రిపోర్ట్ అందజేసినట్టు చెప్పారు.
పది సార్లు కేంద్ర మంత్రుల్ని కలవడం వల్ల…. కనీసం ఒక్క అంశం అయినా పరిష్కారం అవుతుందన్నారు. త్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి నెంబర్, రాష్ట్రానికి మూడు బుల్లెట్ ట్రైన్లు వచ్చాయని తెలిపారు. అలాగే మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు అనుమతులు దక్కాయని చెప్పారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ భూసేకరణ పూర్తి అయిందని, ఆదిలాబాద్ భూసేకరణ త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ జూన్ 2కు ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌ల పనులు ప్రారంభించి,రెండేండ్లలో ఎయిర్‌పోర్ట్‌లు సేవలోకి వచ్చేలా టార్గెట్‌తో పని చేయనున్నట్టు తెలిపారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి…
”కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని సీబీఐ డెరెక్టర్‌కు లేఖ రాశాం. అదే కాపీని హోం సెక్రెటరీకి జత చేశాం. అయితే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తామని కిషన్‌రెడ్డి అఫిషియల్‌గా చెప్పారు. ఇంతకాలమైనా ఎందుకు కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం లేదో ఆయన చెప్పాలి. రాష్ట్ర లేఖపై సీబీఐ, డీఓపీటీకి రెఫర్ చేస్తుంది. డీఓపీటీ పీఎంఓకు సూచిస్తుంది. అయితే… మరి ఫైల్ పీఎంఓలో ఆగిందో, ఎక్కడ ఆగిందో క్యాబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ సమాధానం చెప్పాలి” అని సీఎం అన్నారు. అలాగే ఈ-ఫార్ములా రేసులో ఐఏఎస్ అధికారిని విచారించేందుకు డీఓపీటీ అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఏ1 గా ఉన్న ఎస్‌ఐబీ మాజీ అధికారి ప్రభాకర్ రావును భారత్‌కు తీసుకువచ్చేందుకు కేంద్రం సహకరించలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో 20 నెలలు కోట్లాడి… ప్రభాకర్ రావును తీసుకువచ్చి విచారణ కొనసాగిస్తుందన్నారు. ఒక కౌన్సిలర్ కోసం, మనిషిని చంపే ఆలోచన కాంగ్రెస్ పార్టీది కాదన్నారు. కేవలం సింపతి, సెంటిమెంట్ కోసం బీజేపీ ఈ ఆత్మహత్యను వాడుకుందని చెప్పారు. కిషన్ రెడ్డికి లోకల్ పోలీసులపై నమ్మకం లేకపోతే… విద్యుత్ కమిషన్‌తో పాటు ఫోన్ ట్యాపింగ్, కొడంగల్‌లో బీజేపి కౌన్సిల్ అభ్యర్థి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
కాళేశ్వరం కూల్చి నా ఖాతాలో వేయాలనుకుంటున్నారు…
కాళేశ్వరం విషయంలో తాను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేఆర్ సురేశ్ రెడ్డి మాదిరిగా తాను మేధావిని కాదని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే ఈ ప్రాజెక్ట్ మూడు నెలలకే కుప్పకూలిందన్నారు. ”నేను సామాన్యుడిని. అందుకే నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం. నేషనల్ డ్యాం సేఫ్టి అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) సూచించిన విధంగా కాళేశ్వరం డ్యామేజీ విశ్లేషణకు నేషనల్ ఏజెన్సీకి అప్పగించాను. ఈ విషయంలో సాంకేతిక నిపుణులు ఒకటి చెప్తే… బీఆర్‌ఎస్ నేతలు మరోటి అంటున్నారు.
వాళ్లు ఆరోపించినట్టు బాంబులు పెడితే విస్ఫోటనం జరగాలి కానీ… పిల్లర్లు కుంగుతాయా? కుంగిన మేడిగడ్డ కాళేశ్వరానికి గుండెకాయ. ఆ కుంగిన ఈ బ్యారేజీలో నీళ్లు నింపేలా ఒత్తిడి చేసి… ఆ కూలిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నా ఖాతాలో వేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ కాళేశ్వరం కూల్చిందని చెప్పాలనుకుంటున్నరు. వాళ్ల శాపనార్థాలు, కోరికల ప్రకారం నేను నడుచుకోను” అని అన్నారు. కవిత కొత్త పార్టీ గురించి చెప్పేందుకు ఏమీ లేదని తెలిపారు. ప్రజలు ఏమైనా ఆలోచించినప్పుడు చెప్తానన్నారు. వాస్తవానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు ఒక్కటే అని వ్యాఖ్యానించారు.
వాళ్లను జైలుకు పంపేందుకే అధికారులను నియమించాం
కాళేశ్వరం, ఈ-ఫార్ములా, ఇతర కేసులలో కేంద్రం.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం లేదని విమర్శించారు. తాను మోడీ , కేసీఆర్‌ను కాదని… సిస్టం ఫాలో అవుతానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు చేసిన వాళ్లను(కేసీఆర్, కేటీఆర్, ఇతరులు) జైలుకు పంపేందుకే సిట్ పేరుతో అధికారులను నియమించినట్టు చెప్పారు. ఎస్‌ఐబీ ఆఫీసులో మిస్సింగ్ అయిన వస్తువులతో పంజాగుట్టలో దాఖలైన మిస్సింగ్ కేసు… ఫైనల్ గా ఫోన్ ట్యాపింగ్‌గా మారిందన్నారు. సైజ్ ఆఫ్ క్రైంను బట్టి అధికారులను నియమిస్తారని చెప్పారు. ఈ కేసు ఫైల్ అయిన ఏరియాకు సజ్జనార్ కమిషనర్ కాబట్టి… సిట్‌కు అధికారిగా ఉన్నారన్నారు. ”ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా పర్యవేక్షిస్తోంది. సిట్ వేయాలన్నారు. ప్రభుత్వం వేసింది. పోలీసులు డేటా ఆధారంగా విచారణ చేస్తున్నరు.
ఈ కేసు విచారణ నాకేం తెలీదు. నేను తెలుసుకోవాలనుకోవడం లేదు. అందుకే నాకు అధికారులు బ్రీఫ్ చేయడం లేదు. వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చా. సేకరించిన డేటాను అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు” అని సీఎం చెప్పారు. ”బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా నేనే జోక్యం చేసుకుంటే… ఎవరూ బయట ఉండరు” అని హెచ్చరించారు. అయితే సీఎం కాబట్టి ఏది జరిగినా తన ఖాతాలోకే వస్తుందన్నారు. కానీ తాను ”దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ” చేస్తున్నట్టు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్స్ వింటే మానసిక క్షోభ కలుగుతుందనీ, మన:శ్శాంతి ఉండదన్నారు. కేసీఆర్‌ను ఎవరూ హౌజ్ అరెస్ట్ చేయలేదనీ, ఆయనే స్వీయ నిర్భందంలోకి వెళ్లారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.



