దాదా సాహెబ్ ఫాల్కే గ్రహీత మోహన్‌లాల్
‘ఇది మలయాళ సినిమాకు వచ్చిన అవార్డు. నిజాయితీగా పని చేయడంతోపాటు భగవంతుడి ఆశీస్సుల వల్లే ఈ పురస్కారం దక్కిందను కుంటున్నా. నన్ను అభిమా నించే వారందరికీ ఈ అవార్డు చెందు తుంది. నాకు సినిమా తప్ప పెద్ద డ్రీమ్స్ ఏమీ లేవు’ అని ప్రముఖ నటుడు మోహన్‌లాల్ అన్నారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడిగా చిత్ర పరిశ్రమకు మోహన్‌లాల్ చేసిన సేవలకుగాను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 సంవత్సరానికిగానూ ఆయనకి ఈ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,’ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే నమ్మలేకపోయా. కలలో ఉన్నానేమో అనుకుని ఆ విషయాన్ని మరోసారి చెప్పమన్నాను. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ప్రయాణించిన దారిలోనే నేనూ నడిచా. నేనేం సాధించినా దానికి కారణం వారే. 48 ఏండ్ల నా ప్రయాణంలో నేను కలసి పని చేసిన కొందరు ఇప్పుడు లేరు. కానీ ఆ జ్ఞాపకా లెప్పుడూ నాతోనే ఉంటాయి. ఫలానా పాత్రలో నటించాలని ఎప్పుడూ అనుకోను.
కథ, కాంబినేషన్స్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తా. ప్రేమ్ నజీర్, అమితాబ్ బచ్చన్, శివాజీ గణేశన్ వంటి వారితో కలసి నటించటం గొప్ప అనుభూతి’ అని చెప్పారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే 71వ జాతీయ చలన చిత్ర పురస్కార ప్రదానోత్సవ వేడుకలో మోహన్‌లాల్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. నేటి నుంచి ‘దృశ్యం 3’ చిత్రీకరణ షురూ.. సోమవారం నుంచి ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని మోహన్‌లాల్ చెప్పారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ‘దృశ్యం’ అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించింది. మోహన్ లాల్, మీనా కాంబోలో జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ ప్రాంఛైజీలో ‘దశ్యం 2’ కూడా వచ్చింది. రెండు పార్టులు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ‘దశ్యం 3’ గురించి నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనుంది.
మై డియర్ లాలెట్టన్ హదయపూర్వక శుభాకాంక్షలు. మీ అద్భుతమైన ప్రయాణం, ఐకానిక్ పెర్ఫార్మెన్స్, భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీకు తగిన అసలైన గుర్తింపు.
చిరంజీవి
లెజెండరీ మోహన్‌లాల్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇండియన్ సినిమా ఐకాన్‌కు తగిన గుర్తింపు ఇది.
ఎన్టీఆర్