విశాఖకు నిధుల చెల్లింపులపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్‌నాథ్
మంత్రి సంస్థకు వకాల్తా పుచ్చుకున్న హెచ్‌సీఏ ఆఫీస్‌బేరర్లు
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధులను విశాఖ ఇండిస్టీస్ సంస్థకు చెల్లించిన వ్యవహారం ఇప్పుడు క్రికెట్ వర్గాలతో పాటు రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. గ్రామీణ క్రికెట్ అభివృద్ది, అకాడమీల నిర్మాణం కోసం స్థలాల కొనుగోలు నిమిత్తం బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సొమ్మును.. విశాఖ సంస్థకు చెల్లించటంపై క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకతకు దారితీసింది. విశాఖ ఇండిస్టీస్ సంస్థ యజమాని రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు కావటంతో ‘గోల్‌మాల్’ వ్యవహారం అంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో హెచ్‌సీఏ ఆఫీస్‌బేరర్లు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్‌నాథ్ ‘నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నా ప్రమేయం లేదు’ అంటూ ముగించాడు. ‘హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఫిబ్రవరి 2న బాధ్యతలు చేపట్టాను. అంతకుముందే, కోర్టు ఆదేశాలతో బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. సొమ్ము చెల్లింపుల ప్రక్రియ షురూ అయ్యింది. ఇందులో ఎవరూ హెచ్‌సీఏ తరఫున సంతకం చేయలేదు. చెల్లింపుల ప్రక్రియతో నాకు సంబంధం లేదు, నాకు ఏమీ తెలియదు’ అని అమర్‌నాథ్ తెలిపాడు.
విరుద్ద ప్రయోజనాలు?
విశాఖకు హెచ్‌సీఏ నిధుల చెల్లింపుల వ్యవహారంలో కొత్త కోణం బయటపడింది. విశాఖ సంస్థ యజమాని, హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు విరుద్ద ప్రయోజనాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో మంత్రి వివేక్ మద్దతుతో దల్జీత్ సింగ్, బసవరాజులు పోటీ చేసి గెలుపొందారు. దల్జీత్ సింగ్ ఉపాధ్యక్షుడిగా, బసవరాజు సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో నెగ్గిన అధ్యక్షుడు జగన్‌పై సస్పెన్షన్ వేటు పడగా.. కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి శ్రీనివాసరావు పదవీకాలం ముగిసింది. దీంతో ఆఫీస్‌బేరర్లలో దల్జీత్ సింగ్, బసవరాజు మాత్రమే పదవిలో కొనసాగుతున్నారు. ఈ సమయంలో ఎన్నికల్లో తమకు మద్దతు పలికిన మంత్రి సంస్థకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చెల్లింపుల ప్రక్రియ సాగేలా చూశారని తెలుస్తోంది. విశాఖ సంస్థతో మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నం చేస్తామని జగన్‌మోహన్ రావు అధ్యక్షుడిగా ఉండగా సుప్రీంకోర్టులో హెచ్‌సీఏ వాదించింది. కానీ ఆ తర్వాతి పరిణామాలతో జగన్ పదవి కోల్పోవటంతో.. మధ్యవర్తిత్వం అటకెక్కించి, హెచ్‌సీఏ ఖాతాలోని రూ.68.73 కోట్లు ఏకమొత్తంలో చెల్లింపులు చేశారు.
సొమ్ము వెనక్కి రప్పిస్తాం! : శివలాల్ యాదవ్
హెచ్‌సీఏ నుంచి విశాఖ సంస్థకు కోర్టు ఆదేశాల ప్రకారమే చెల్లింపులు జరిగాయని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ అన్నారు. హెచ్‌సీఏ ఆఫీస్‌బేరర్లు అమర్‌నాథ్, బసవరాజుతో కలిసి మంగళవారం మీడియా సమావేశానికి వచ్చిన శివలాల్ యాదవ్ విశాఖకు నిధుల చెల్లింపులపై మధ్యవర్తిత్వం చేస్తామని తెలిపారు. ‘ ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. విశాఖ సంస్థతో హెచ్‌సీఏ పెద్దలు కూర్చోని మాట్లాడుకోవాలి. రూ.68.73 కోట్లు కాకుండా, ఎంతోకొంత తీసుకుని.. మిగిలిన మొత్తం హెచ్‌సీఏకు తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. అందుకోసం హెచ్‌సీఏ త్వరలోనే ఓ మధ్యవర్తిత్వ కమిటీ వేస్తుందని అనుకుంటున్నాను’ అని శివలాల్ యాదవ్ అన్నారు.



