నవతెలంగాణ – హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచ కప్-2025లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌కు ముందు తాను జాతీయ జట్టులోకి తిరిగి రావడం తన కెరీర్‌లో అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటని భారత ఓపెనర్ షఫాలీ వర్మ అభివర్ణించింది. ఒక సంవత్సరం పాటు తాను జట్టుకు ఆడలేకపోయానని, దీంతో తన కష్టాన్ని దేవుడు గుర్తించినట్లుగా అనిపించిందని పేర్కొంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌కు ముందు గాయపడిన ప్రతీక రావల్ స్థానంలో వచ్చిన షఫాలీ వర్మ, ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విన్నింగ్ ప్రదర్శనతో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.
స్మృతి మంధనతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె 78 బంతుల్లో 87 పరుగులు చేసింది. అనంతరం బంతితోనూ ఆకట్టుకుంది. 36 పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లను పడగొట్టింది. “ఒక సంవత్సరం పాటు జట్టుకు దూరంగా ఉన్న తర్వాత సెమీ-ఫైనల్‌కు ఎంపిక కావడం నాకు అత్యంత సంతోషకరమైన క్షణం. ఆ సమయం చాలా కఠినమైనది. ప్రతీక రావల్ గాయపడి నన్ను జట్టులోకి తీసుకున్నప్పుడు, దేవుడు నా కష్టాన్ని గుర్తించినట్లుగా నాకు అనిపించింది. సహచరులకు గాయమైతే జట్టులోకి రావాలని ఎవరూ కోరుకోరు. అయితే నాకు అవకాశం లభించినందుకు కృతజ్ఞురాలిని” అని షఫాలీ తెలిపింది.



