Monday, February 16, 2026
E-PAPER
Homeజాతీయంఉద్యోగం ఉంది..జీతం చాలట్లే!

ఉద్యోగం ఉంది..జీతం చాలట్లే!

- Advertisement -

ఐటీ రంగంలో ఫ్రెషర్ల పరిస్థితి
వచ్చే శాలరీ కనీస అవసరాలకే ఖర్చవుతోందని ఆందోళన
దశాబ్ద కాలంగా పెరుగుదల లేని వేతనాలు
నగరాల్లో ఐటీ ఉద్యోగుల దయనీయ బతుకులు

న్యూఢిల్లీ : దేశంలోని యువతకు ఐటీ జాబ్‌ అంటే ఒక క్రేజ్‌. అది కొందరికి డ్రీమ్‌ జాబ్‌. లక్షల రూపాయల్లో వేతనాలు, విలాసవంతమైన జీవితం, వారాంతపు సెలవులు, టీం డిన్నర్‌లు, తోటి ఉద్యోగులతో సరదా టూర్‌లు, ఎంజాయ్ మెంట్‌ అని అంతా చెప్తుంటారు. అయితే ఎంట్రీ లెవల్‌ ఉద్యోగుల విషయంలో మాత్రం ఇవేమీ నిజం కావనే చెప్పాలి. డిగ్రీలు పూర్తి చేసుకొని, ఎన్నో ఆశలతో కొత్తగా ఐటీ రంగంలో ఉద్యోగంతో అడుగు పెడుతున్న వారికి చేదు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ డ్రీమ్‌ జాబ్‌ వారి కనీస అవసరాలను కూడా పూర్తిగా తీర్చలేకపోతున్నది.

వచ్చిన జీతం మొత్తం కనీస అవసరాలకే ఖర్చవుతున్నది. ఎంట్రీ లెవల్‌ వేతనాలు తక్కువగా ఉండటం, దశాబ్ద కాలంగా వాటిలో ఎలాంటి పెరుగుదల లేకపోవడంతో నగరాల్లో జీవన వ్యయం పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు. భారత్‌లో ఐటీ ఉద్యోగం ఒకప్పుడు ఆర్థిక భద్రతకు ప్రతీక. అది మధ్యతరగతి కుటుంబాల కల. పదేండ్ల క్రితం ఐటీ జాబ్‌లో ప్రవేశిస్తే చాలు.. వచ్చే జీతంతో హాయిగా జీవించొచ్చు. అప్పటితో ఉన్న ద్రవ్యోల్బణంతో ఖర్చులు కూడా తక్కువగా ఉండేవి. దీంతో ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులు ఖర్చులో పోనూ పొదుపు కూడా చేసేవారు. కానీ పదేండ్ల తర్వాత పరిస్థితులు చాలా మారాయి. కానీ ఇప్పుడు అదే జీతంతో నగరాల్లో జీవించడం కష్టమైపోతోంది.

ప్యాకేజీ పెరగలే… ఖర్చులు పెరిగాయి
ఐటీ రంగంలో పెద్ద కంపెనీలుగా చెప్పుకునే సంస్థల్లోనూ కొత్తగా చేరే ఫ్రెషర్లకు ఇస్తున్న జీతాలు పదేండ్ల నుంచి పెద్దగా పెరిగిందేం లేదు. కానీ జీవన వ్యయం మాత్రం గణనీయంగా పెరిగింది. ఒక ఫ్రెషర్‌ వార్షిక వేతనం రూ.3.8 లక్షలుగా అనుకుందాం. అంటే నెలకు వచ్చే మొత్తం వేతనం రూ.31 వేలు. ఇందులో ఇతర కటింగ్‌లు తీసివేస్తే సదరు ఫ్రెషర్‌ ఉద్యోగికి దక్కేది రూ. 27 వేల నుంచి రూ. 29 వేలు మాత్రమే. అయితే బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, పూణే, ఢిల్లీ, నోయిడా, చెన్నై వంటి నగరాల్లో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న ఫ్రెషర్లు.. తమకు వచ్చే ఈ వేతనంతో ఆర్థికంగా సతమతమవుతున్నారు.

ఎందుకంటే.. నగరంలో పెరుగుతోన్న జీవన వ్యయం. ఇలాంటి నగరాల్లో ఇంటి అద్దె సగటును రూ. 8వేల నుంచి 12 వేలుగా ఉంటోంది. ఇక భోజనం, కిరాణా ఖర్చులు రూ.5 వేల నుంచి రూ.7 వేలుగా, ప్రయాణ ఖర్చులు రూ.2వేల నుంచి రూ.4వేలుగా ఉండొచ్చు. ఇక ఎలక్ట్రిసిటీ బిల్లు, వైఫై బిల్లు కలుపుకొని రూ.2 వేలుగా ఉంటుంది. దీంతో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులకు తమకు వచ్చే వేతనం కంటే ఖర్చుల మొత్తమే ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో వారికి సేవింగ్స్‌ కూడా ఉండటం లేవు. కేవలం ఉద్యోగం చేస్తున్నామా, ఉంటున్నామా అన్న విధంగా వారి జీవితం సాగిపోతోంది. అయితే ఫ్రెషర్లకు ఇలాంటి పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉన్నాయంటూ పలువురు ఐటీ, ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పదేండ్లుగా స్థిరమైన వేతనాలు
2013లో ఫ్రెషర్లకు ఇచ్చిన ప్యాకేజీలు రూ.3-3.5 లక్షలు. 2026లో కూడా వారి వార్షిక వేతనంలో పెద్దగా మార్పు లేదు. దాదాపు 2013నాటి స్థాయిలోనే ప్యాకేజీలు అందుతున్నాయి. కానీ దశాబ్ద కాలానికి పైగా దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అద్దె, ఆహారం, ప్రయాణ ఖర్చులు మూడు రెట్లు పెరిగాయి. నగరాల్లో జీవన వ్యయం తీవ్రమైంది. ఇక ఐటీ రంగంలో బహుళజాతి కంపెనీలుగా చెప్పుకునే సంస్థలు సైతం ఫ్రెషర్లపై కనికరం చూపెట్టటం లేవు. ఈ సంస్థలు కూడా తక్కువ మొత్తంలోనే ఫ్రెషర్లకు ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తుండటం గమనార్హం.

పెరిగిన కంపెనీల లాభాలు
ఉద్యోగుల జీతాల్లో పెద్దగా మార్పులేవీ కనిపించనప్పటికీ… ఐటీ కంపెనీల ఆదాయా లు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఎగ్జిక్యూటివ్‌ జీతాలు కూడా ఎగబాకాయి. ఇలాంటి పరిస్థితులు యువ ఉద్యోగుల్లో తీవ్ర అంసతృప్తిని పెంచుతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

బ్రాండ్‌ విలువ కోసం రాజీ
దేశంలోని యువతలో చాలా మంది పెద్ద కంపెనీలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నారు. ఇందుకు తక్కువ ప్యాకేజీని సైతం వారు అంగీకరిస్తున్నారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు. దీంతో ఎంత కష్టమైనా.. ఐటీ రంగంలో తక్కువ వేతనంతో సైతం నగరాల్లో యువత తమ జీవనాన్ని సాగిస్తున్నారు.

భవిష్యత్తుకు హామీనివ్వని ఉద్యోగం
చాలా మంది యువత ఈ పరిస్థితిని నిరుద్యోగం కంటే కాస్త బెటర్‌ అని భావిస్తున్నారు. అలా అని ఇది సౌకర్యవంతమైన జీవితం కూడా కాదని చెప్తున్నారు. ఒకవైపు స్థిరమైన జీతం ఉన్న ఉద్యోగం ఉందనే నమ్మకం, మరోవైపు ఆ జీతంతో భవిష్యత్తు నిర్మించలేని అసహాయం వారిలో కనిపిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు ఆలోచించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. దశాబ్ద కాలంలో వేతనాల్లో ఆశించినంతస్థాయిలో మార్పు రాకపోవడాన్ని మేధావులు తప్పుబడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -