Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసినిమా టికెట్‌ రేట్ల పెంపుతో నాకు సంబంధం లేదు

సినిమా టికెట్‌ రేట్ల పెంపుతో నాకు సంబంధం లేదు

- Advertisement -

సంక్రాంతి రద్దీకి తగ్గట్టుగా ట్రాఫిక్‌ నియంత్రణ
మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం దురదృష్టకరం : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సినిమా టికెట్‌ రేట్ల పెంపుతో తనకు సంబంధం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ వ్యవహారాలకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. ‘పుష్ప-2’ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందనీ, ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చి తప్పు చేశానా అని అప్పట్లో మదనపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే బాబు వైద్య ఖర్చులు కూడా తానే భరించానని, ఆ సంఘటన తన మనసుపై చెరగని ముద్ర వేసిందని గుర్తు చేశారు. ఆ విషాద ఘటన తర్వాతే తాను కఠిన నిర్ణయం తీసుకున్నాననీ, ఇకపై టికెట్‌ రేట్ల పెంపు కోసం ఎవరూ తన వద్దకు రావద్దని సినీ పెద్దలకు తేల్చి చెప్పినట్టు మంత్రి స్పష్టం చేశారు. ఆ హెచ్చరిక వల్లే ప్రస్తుతం పరిశ్రమ నుంచి ఎవరూ తనను కలవడం లేదనీ, ఇప్పుడు సినిమాలకు పెరిగిన టికెట్‌ ధరలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు.

సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే వారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. హైదరాబాద్‌, విజయవాడ జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణం జరుగుతున్న చోట యంత్రాలు తొలగించామన్నారు. రోడ్లపై వాహనాలు ఆగితే వెంటనే వాటిని తొలగించేందుకు క్రేన్లు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. నేషనల్‌ హైవే డైరెక్టర్‌తో మాట్లాడినట్టు మంత్రి తెలిపారు. గత సంవత్సరం 9లక్షల వాహనాలు వెళ్లగా, ఈ సారి 12 లక్షలు వాహనాలు ఊర్లకు వెళ్తాయని బావిస్తున్నామని చెప్పారు. టోల్‌ గేట్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయితే వాహనాలను వదిలేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ”డీజీపీతో చెప్పి భద్రత ఏర్పాటు చేశాం. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. టోల్‌ ఫ్రీ నెంబర్‌ కూడా ఏర్పాటు చేశాం” అని మంత్రి వివరించారు. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధం అయ్యిందనీ, ఫ్యూచర్‌ సిటీ నుండి బందర్‌ వరకు టెండర్లను పిలిస్తున్నామని అన్నారు.

మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం సరికాదు
రాష్ట్రానికి చెందిన ఓ మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం చేయడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రేటింగ్‌లు, వ్యూస్‌ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను బలి చేయొద్దు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా రాతలు రాయొద్దు. కలెక్టర్ల బదిలీలు సీఎం స్థాయిలో జరుగుతాయి. నల్లగొండ జిల్లాలోనే కాదు చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగింది. నేను మంత్రిని అయ్యాక నా జిల్లాల్లో నలుగురు కలెక్టర్లు మారారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుంది’ అని కొమటిరెడ్డి వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై విచారణ జరపాలని ఆయన సీఎంను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -