Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంఇంకా నా భర్తతో మాట్లాడలేదు

ఇంకా నా భర్తతో మాట్లాడలేదు

- Advertisement -

వాంగ్‌చుక్‌ సతీమణి అంగ్మో

న్యూఢిల్లీ : మూడు రోజుల క్రితం జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌తో తాను ఇంకా మాట్లాడలేదని ఆయన భార్య గీతాంజలి జె. అంగ్మో చెప్పారు. ‘ఆయన్ని తీసుకొని వెళ్లి మూడు రోజులు గడిచాయి. ఆ సమయంలో నేను హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్స్‌ లడఖ్‌లో ఉన్నాను. ఆయన్ని జోధ్‌పూర్‌ తీసికెళ్లారని నాకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. జోధ్‌పూర్‌ చేరగానే నాతో మాట్లాడిస్తానని ఇన్‌స్పెక్టర్‌ హామీ ఇచ్చారు. కానీ నాకు ఇంకా ఫోన్‌ కాల్‌ రాలేదు’ అని ఆమె తెలిపారు. కాగా జోధ్‌పూర్‌ జైలులోని ఒంటరి సెల్‌లో వాంగ్‌చుక్‌ను ఉంచారని, ఆయన నిరంతరం సీసీటీవీల పర్యవేక్షణలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

జైలులో వాంగ్‌చుక్‌ ఏ స్థితిలో ఉన్నారో తెలియడం లేదని అంగ్మో వాపోయారు. సత్యాగ్రహం చేసినా, పాదయాత్ర చేసినా ఆయన శాంతియుతంగానే ఆందోళనలు నిర్వహించారని తెలిపారు. వాంగ్‌చుక్‌ను ఎక్కడో జోధ్‌పూర్‌ జైలులో ఉంచే బదులు ఢిల్లీలోనే ఉంచవచ్చునని అన్నారు. ఆయన్ని దేశ వ్యతిరేకిగా చిత్రీకరించి, ఎన్‌ఎస్‌ఏ ప్రయోగించారని ఆరోపించారు. వచ్చే నెలలో లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరగాల్సి ఉన్నదని, అందుకే వాంగ్‌చుక్‌ను అరెస్ట్‌ చేసి ఉండవచ్చునని చెప్పారు. తామిద్దరం విద్యా సంబంధమైన పనులపై గతంలో జోధ్‌పూర్‌కు రెండు సార్లు వెళ్లామని గుర్తు చేస్తూ ప్రజల గొంతుకగా నిలిచినందుకు భారత్‌ వ్యతిరేకిగా ముద్ర వేసి అక్కడ నిర్బంధిస్తారని వాంగ్‌చుక్‌ ఊహించి ఉండరని అంగ్మో అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -