Wednesday, August 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునాకు తెలిసింది ప్రజాసేవే...

నాకు తెలిసింది ప్రజాసేవే…

- Advertisement -

ఓర్వలేకే ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం దేవాదాయ శాఖ భూములను రక్షించడం నా కర్తవ్యం
అర్హులకు పోడు పట్టాల విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం
ప్రజల విజ్ఞప్తి మేరకు జీవో 49ని తాత్కాలికంగా పక్కనబెట్టాం
దాన్ని గతంలో అంగీకరించిన వాళ్లే.. ఇప్పుడు జనాన్ని ఎగదోస్తున్నారు
‘నవతెలంగాణ’తో అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

‘రాష్ట్ర రాజకీయాల్లో 30 ఏండ్ల నుంచి ఉన్న. మొదటి నుంచీ ప్రజలకు సేవ చేయడమే తెలుసు. రేవంతన్న నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని ఓర్వలేకే యూట్యూబ్‌ చానళ్ల ద్వారా, సోషల్‌మీడియా వేదికగా కొందరు విష ప్రచారం చేయిస్తున్నారు. వాటన్నింటినీ మేం పెద్దగా పట్టించుకోం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు సేవ చేసుకుంటూ పోతాం. ప్రజలే గుర్తిస్తారు. మమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవాదాయశాఖ పరిధిలోని భూములను రక్షించే బృహత్కర కార్యాన్ని మొదలుపెట్టాం. ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పోతున్నాం. రాష్ట్రంలోని 17శాతం అటవీ శాతాన్ని 23 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తోసిన మొక్కలు నాటడం కాకుండా…భవిష్యత్తు తరాలకు అక్కరకొచ్చే మొక్కలను వనమహోత్సవం ద్వారా నాటిస్తున్నాం. అర్హులకు పోడు పట్టాలిచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం. కవ్వాల్‌ రిజర్వు కన్జర్వేషన్‌కు ఓకే చెప్పిన వాళ్లే నేడు ప్రజల్ని ఎగదోస్తున్నారు. ఆదివాసీ, గిరిజనుల విజ్ఞప్తి మేరకు జీవో 49ని తాత్కాలికంగా పక్కన బెట్టాం’ అని రాష్ట్ర అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. నవతెలంగాణ దినపత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా పత్రిక ప్రతినిధి ‘అచ్చిన ప్రశాంత్‌’కు ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు…

ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు- ఇప్పుడు పనిచేస్తున్నారు…అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి?
ముందుగా ‘నవతెలంగాణ’కు పదో వార్షి కోత్సవ శుభాకాంక్షలు. నేను రాజకీయాల్లోకి వచ్చి 30 ఏండ్లు గడిచింది. ఎంపీటీసీగా ప్రారంభ మైన ప్రస్థానం..ఎంపీపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవి వరకు చేరింది. బీసీ మహిళల్లో రాష్ట్రంలో ఈ స్థాయికి వచ్చిన అతి కొద్దిమందిలో నేనుంటాను. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. రేవంతన్న నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రియాశీలకంగా పని చేస్తున్నది. ప్రతి ఒక్కరినీ సీఎం కలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంను కలవాలంటే అదో పెద్ద తతంగం. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలు హుందాగా ఉండేవి. విమర్శ ల్లోనూ హుందాతనం కనిపించేది. ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించేది. ఇప్పుడు ప్రతిపక్ష నేత అసెంబ్లీకే రావడం లేదు. ఈ పరిణామాలను బట్టే పరిస్థితే ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరో పదేండ్లూ మాదే అధికారం. కాంగ్రెస్‌ 3.0, 4.0 ప్రభుత్వాలను కూడా చూస్తారు.

దేవాదాయ భూముల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలేంటి? ఇప్పటిదాకా ఎన్నింటిని కాపాడారు?
దేవాదాయ శాఖ మంత్రిగా ఆలయాల భూములను కాపాడటం నా ప్రధాన కర్తవ్యం. కబ్జా చేస్తే పీడీ యాక్టు పెడతాం. ఇటీవలి కాలంలో 1,817.01 ఎకరాలను వివిధ థార్మిక సంస్థల ఆధీనంలోకి తీసుకున్నం. వాటి రక్షణ కోసం హౌర్డింగ్‌లు/సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశాం. మరో 560.23 ఎకరాల విషయంలోనూ కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చాయి. వాటికి సరిహద్దులు నిర్ణయించి ఫెన్సింగ్‌ వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌(టీజీఆర్‌ఏసీ) సహకారంతో దేవాదాయ భూముల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించాం. ఇప్పటి వరకు 34,092 ఎకరాల దేవాదాయ భూములకు జియో-ట్యాగ్‌ పూర్తయింది. ఇంకా 91,827.35 ఎకరాల మేర గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. వ్యవసాయానికి ఉపయోగపడని దేవాలయాల భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

గతంలో దేవాదాయ, అటవీ శాఖలు అప్రాధాన్యం…ఇప్పుడు కీ రోల్‌ ఎందుకవుతున్నాయి?
గతంలో దేవాదాయ శాఖ, అటవీ శాఖ అప్రాధాన్యం ఉండేదని మీరు అంటున్నారు అంటే…ఆ శాఖలు బీఆర్‌ఎస్‌ పాలనా కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అర్థమే కదా. దేవుడికి సేవ చేయడం చాలా ఇష్టం. ప్రకృతినీ దేవుడిగా భావించే మనసత్వం నాది. అందుకే సోనియమ్మ, రాహుల్‌ గాంధీ, ఖర్గే, రేవంతన్న ఈ శాఖలు ఇచ్చారని భావిస్తున్న. 2023 చివరి నాటికి దేవాలయాల ద్వారా రూ. 373.55 కోట్ల ఆదాయం వస్తే… మేము వచ్చాక చేపట్టిన కార్యక్రమాల ద్వారా 2024లో రూ. 544.61 కోట్లకు చేరిందని గణాం కాలే చెబుతున్నాయి. వేములవాడ అభివృద్ధికి రూ.400 కోట్లు ఖర్చు చేస్తామన్న బీఆర్‌ఎస్‌ సర్కారు హామీ ఆచరణకు నోచుకోలేదు. భద్రాద్రికి రూ.100 కోట్లు ప్రకటించి రూ.100 కూడా ఇవ్వని పరిస్థితి. మా ప్రజా ప్రభుత్వం వేములవాడ అభివృద్ధికి రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. తాజాగా రూ. 384 కోట్లు పెట్టి జోగులాంబ ఆలయానికి మాస్టర్‌ ప్లాన్‌ ప్రణాళికలు రూపొందించాం. మిగతా ప్రముఖ దేవాలయాలనూ అభి వృద్ధి చేస్తున్నాం. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. గోదావరి పుష్కరాల కోసం ఏపీకి రూ.2 వేల కోట్ల మేర ఇస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ లోనూ ఆ నది పారు తుంది కదా? తెలంగా ణకు ఎందుకు అంత మేర నిధులివ్వడం లేదు? రాష్ట్రం తరఫున ఉన్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి.

జీవో 49 వివాదం సమసిపోయినట్టేనా?
2016లోనే మొదటి వైల్డ్‌ లైఫ్‌ బోర్డు వైస్‌ చైర్మెన్‌ హోదాలో అప్పటి అటవీ శాఖ మంత్రి జోగురామన్న, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాపురావు రాథోడ్‌లు కన్జర్వేషన్‌ రిజర్వు ప్రతిపాదనకు సంఘీభావం తెలిపారు. ఆ తర్వాతి సమావేశంలో మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా సమ్మతి తెలిపారు. మనుషుల భద్రత, వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 2019లోనే గైడ్‌లైన్స్‌ పంపింది. రాష్ట్రంలో కన్జర్వేషన్‌ రిజర్వు ప్రకటించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు వన్యప్రాణులతో తమ నియోజక వర్గాల్లోని ఆదివాసీ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన నియోజకవర్గంలో పులుల దాడిలో ముగ్గురు చనిపోయారనీ, ఏడుగురికి తీవ్ర గాయాల య్యాయనీ, 450 పశువులు చనిపోయా యని అటవీ అధికారుల నివేదికలు వెల్లడించాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జీవో 49 ద్వారా కొమ్రంభీమ్‌ జిల్లాలో కొంత భాగాన్ని కన్జర్వేషన్‌ రిజర్వుగా ప్రకటించాం. ఆనాడు సమ్మతి తెలిపిన నాయకులే ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వందవైఖరికి, కపటనీతికి నిలువెత్తు నిదర్శనం. స్థానిక ప్రజలు, ఆదివాసీల నుంచి జీవో 49 మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ జీవోను అబెయెన్స్‌లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రజల అనుమానాలను నివృత్తి చేసిన తర్వాత, వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటాం.

చేసిన పనుల గురించి చెప్పుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుకబడ్డదనే చర్చ జరుగుతున్నది. దీనిపై మీరేమంటారు?
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయంగానే ఉంది. ప్రతిపక్ష నేత ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. ప్రజల కోసం వాళ్ళు చేసిందేమీ లేదు. సోషల్‌మీడియా వేదికగా మా ప్రభుత్వంపై అసత్య ప్రచారాల పర్వానికి తెరలేపారు. అడ్డగోలు రాతలు రాయిస్తున్నారు. రైతులకు రుణమాఫీ ఇంత పెద్ద మొత్తం ఏకకాలంలో ఎప్పుడూ ఇవ్వలేదు. మంచి పనిని ఓర్వలేక విష ప్రచారం చేయడం దుర్మార్గం. మేం ఇవేం పట్టించుకోం. ప్రజలకు సేవ చేయడమే మాకు తెలుసు. వారినే నమ్ముకున్నాం. ప్రజలే ఆశీర్వదిస్తారు.

వివాదాల చుట్టూ సురేఖనా..లేకుంటే సురేఖ చుట్టూ వివాదాలా?
యదార్థవాది లోక విరోధి అనే ఒక మాట ఉన్నది. నిజం మాట్లాడేవాళ్ళ మీద పడి ఏడ్వడం ప్రతి ఒక్కరికీ అలవాటే కదా. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు. మేం ప్రజల కోసం పని చేస్తాం. నాకు ఎవ్వరితోనూ గొడవ లేదు. కాంగ్రెస్‌ పార్టీ కోసం మా కుటుంబం పనిచేస్తోంది. నాయకులందర్నీ కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజా సేవ కోసం పరితపించే కుటుంబం నాది. కొండా సుస్మిత పటేల్‌కు ప్రజా సేవ చేయాలని ఉంది. రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. వద్దనే
అధికారం మాకు లేదు కదా?

వనమహోత్సవ కార్యక్రమం అమలు తీరు ఎలా ఉంది?
అడవుల్లోనే కాకుండా వాటి బయట కూడా వనమహౌత్సవం పేరుతో వనసంపద పెంపు కోసం కృషి చేస్తున్నాం. 24 శాతమున్న అటవీశాతాన్ని 33 శాతానికి పెంచేందుకు మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదివాసీ, గిరిజనులకు పోడు పట్టాలిచ్చిన భూముల్లో వారితో తోటల పెంపకాన్ని చేపట్టేలా ప్రోత్సహిస్తున్నాం. గతేడాది మా ప్రభుత్వం వజ్రోత్సవ వనమహౌత్సవం వేడుకలను కూడా నిర్వహించింది. వనమహోత్సవంలో భాగంగా గతేడాది 19.5 కోట్ల మొక్కలను నాటాం. ఈ సారి 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాన్ని పూర్తిచేస్తాం. ఔషధ, పండ్ల (వేప, నేరేడు, మారేడు, ఉసిరి, కరక, తపసి, గానుగ, తెల్లమద్ది, ఈత, తాటి, వేప, చింత, కుంకుడు) మొక్కలు నాటించేందుకు ప్రణాళికలు రూపొందించాం.

ప్రభుత్వాలు మారినా పోడు భూముల సమస్య ఎందుకు పెండింగ్‌ ఉంటున్నది?
పోడు రైతుల విషయంలో మా ప్రభుత్వం ఎప్పుడూ సహకార ధోరణితోనే ముందుకెళ్తున్నది. పోడు రైతులకు పట్టాలిచ్చుడు షురూ చేసిందే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు. అటవీహక్కుల చట్టాన్ని తెచ్చిందీ యూపీఏ ప్రభుత్వమే. స్థానికంగా నివసించే గిరిజనులకు, ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు గతంలోనే ఇచ్చాం. ఇంకా నిజమైన అర్హులుంటే పోడుపట్టాలిచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -