నిన్ను కలవడం ముఖ్యం కాదు
నీవు దొరకడం నాకు అత్యవసరం
మనసును చిందర వందర చేసి వెళ్లావు
కాలమా, ఏ రూపంలో, ఎక్కడ దాక్కున్నావు
దెబ్బ తగిలి నపుడు బాధని పించదు
దెబ్బ కొట్టినవాళ్లు జ్ఞాపకానికొస్తే, నొప్పిలేస్తుంది
ఎవరూ చూసుకోని, పాత నిలువుటద్దం
ఓదార్చని దుఃఖంలా వుంటుంది
ఎవరైనా దారి చూపిస్తారేమోనని,
మైలురాయి వద్ద నిలుచున్నాను
ఎందుకో అందరూ నన్నే దారి అడిగి వెళుతున్నారు
ఎవరికి నేను, అస్సలు ఇష్టంలేనో
నేను వాళ్లనే ప్రేమిస్తాను
బాధ పెట్టినవాళ్ల దగ్గరే
ఓదార్చే గుణముంటుందని నమ్ముతాను
ఎవరికైతే ఎక్కువ సమస్యలుంటాయో
వాళ్లు వొంటరి వాళ్లు కాదు
వాళ్లకు చుట్టూ ఇబ్బందులే తోడుంటాయి
సమస్యలకు గమ్యముండదు
మనిషికి సంఘర్షణ ఆగదు
వర్షం అకస్మాత్తుగా వస్తుంది
గొడుగు లేని కాలంలో
చూరు దొరకని వీధిలో
జీవితం పూర్తిగా తడిసి పోతుంది
ఎక్కడో భూకంపం వచ్చినట్టుంది
రాత్రంతా, కూలిపోతున్న ఇంట్లో గడిపాను
తుఫానుకు గుండె, కిటికీల్లా కొట్టుకుంటున్నా,
మనిషి దర్శనంకోసం, నా అన్వేషణ ఆపలేదు
శత్రువులందరినీ మరిచిపోవాలని వుంది
కానీ, ఎవరెవరిని మరిచిపోవాలో,
ముందుగా వాళ్లను, జ్ఞాపకం తెచ్చుకొంటున్నాను
వాళ్ల జ్ఞాపకాలు, చెట్లకు వేళాడే
పక్షుల ఖాళీ గూళ్లలా వున్నాయి
అందరు రండీ, ఒకరినొకరం క్షమించు కొందాం
అక్కడక్కడా మిగిలిన ప్రేమను రక్షించు కుందాం
లోకులారా, నన్ను సోదా చేయాలనుకుంటే,
ఎప్పుడైనా చేయండి
నా హృదయంలో, జీవితంలో
మనుషులమీది ప్రేమతప్ప, మరేమిలేదు
- ఆశారాజు, 9392302245



