Thursday, December 11, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మాట ఇచ్చా…వెయ్యి కోట్లతో వచ్చా

మాట ఇచ్చా…వెయ్యి కోట్లతో వచ్చా

- Advertisement -

ఓయూని ప్రపంచస్థాయిలో నిలపడమే లక్ష్యం
విద్యతోనే ఆత్మగౌరవం…ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లతో కులం గోడల్ని బద్దలు కొడతాం
అధ్యాపక పోస్టుల భర్తీకి సెర్చ్‌ కమిటీ నియమించుకోండి
రాజకీయ జోక్యం లేకుండా చూస్తా : ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌/ ఉస్మానియా యూనివర్సిటీ
నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే ఆత్మగౌరవం దక్కుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచస్థాయి వర్సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్నదని ప్రకటించారు. నెలరోజుల క్రితం తాను ఇచ్చిన మాట ప్రకారం యూనివర్సిటీకి రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తూ జీవో కాపీతో ఇక్కడకు వచ్చానని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో వెయ్యి అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసుకునేందుకు సెర్చ్‌ కమిటీ ఏర్పాటు చేసుకోవాలనీ, దానిలో రాజకీయ జోక్యం లేకుండా తాను చూస్తానని హామీనిచ్చారు. కులం అడ్డుగోడల్ని ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లతో బద్దలు కొడతామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

అంతకుముందు ఉస్మానియా యూనివర్సి టీకి సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌, డిజైన్స్‌పై విద్యార్థుల అభిప్రాయాలు, సూచనల కోసం ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ను ఆయన విడుదల చేశారు. వాటి ఆధారంగానే తుది నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తాను ఓయూకి వెళ్తానంటే విద్యార్థులు అడ్డుకుంటారనీ, వెళ్లొద్దని చాలా మంది సూచించారని తెలిపారు. తాను మాత్రం ధైర్యం కాదు అభిమానం ఉంటే చాలనీ, వర్సిటీలోని యువమిత్రుల అభిమానంతో ఓయూ భవిష్యత్తు ప్రణాళికలు రచించేందుకు ఇక్కడకు వచ్చానని స్పష్టం చేశారు. తెలంగాణ మట్టికి చైతన్యం ఎక్కువ అని చెబుతూ.. జల్‌, జమీన్‌, జంగిల్‌ కోసం కొమ్రం భీమ్‌ చేసిన పోరాటాన్నీ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం దొరల గడీలను బద్దలు కొట్టిన సాయుధ పోరాట చరిత్రలను ప్రస్తావించారు. ఆరుదశాబ్దాలైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడం తోనే మలిదశ ఉద్యమం ఓయూ, కేయూల నుంచి ప్రారంభమైందని గుర్తుచేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, జార్జిరెడ్డి, ప్రజాయుద్ధనౌక గద్దర్‌ లాంటి మేధా వులను ఓయూనే అందించిందని గుర్తుచేశారు.

చీడపీడల్ని ఎలా వదిలించాలో తెలుసు
తాను గుంటూరులో చదువుకోలేదనీ, సర్కారుబడిలో చదువుకున్నాను కాబట్టే గూడుపుఠాణీలు తెల్వదని సీఎం చెప్పారు. ఇంగ్లీష్‌ భాషనే మాట్లాడని చైనా, జర్మనీ, జపాన్‌ దేశాలు నేడు ప్రపంచాన్ని ఏలుతున్నాయని ప్రస్తావిం చారు. చైనా తన అప్పులు తీర్చాలని అమెరికా మీద ఒత్తిడి తెస్తే ఆ దేశాన్ని రాసిచ్చినా ఆ అప్పు తీరదని అన్నారు. ఇంగ్లీష్‌ రావట్లేదనే బెంగ పెట్టుకోవద్దనీ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నాలెడ్జి వేరు, కమ్యూనికేషన్‌ వేరనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని సూచించారు. గుంటూరులో చదువుకున్నవాళ్లు పేదరికాన్ని బెంజి కార్లలో వెళ్లి చూసిరావొచ్చ న్నారు. తనకు ఇంగ్లీషు భాష రాకపోవచ్చుగానీ, పేదల మనస్సు చదవడం, వారికి సంక్షేమం అందేలా పరిపాలించడం వచ్చునని తెలిపారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రెండేండ్లలో చేసింది ఇదే..
ఆసుకవి అందెశ్రీ రచించిన జయ జయమే తెలంగాణ గీతాన్ని గత పాలకులు తొక్కిపెడితే తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర గీతంగా గుర్తించామని రేవంత్‌రెడ్డి చెప్పారు. బహుజన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సామాజిక న్యాయం చేశామన్నారు. వందేండ్లుగా బయటకు తీయని బీసీ లెక్కలను తేల్చేందుకు కులగణన చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించడంలో విజయం సాధించామన్నారు. వందల ఎకరాల్లో ఫామ్‌ హౌజ్‌లు కట్టుకున్నోళ్లు పదేండ్లలో దళితులకు మూడెకరాల భూమిని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము భూమి ఇవ్వకపోవచ్చుగానీ అందరికీ నాణ్యమైన విద్య అందించడం, తెలంగాణ ఆత్మగౌరం పెంచడం, పేదలకు సంక్షేమం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లు అవుతున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేరిట వేర్వేరు హాస్టళ్లు పెట్టి ఆ పిల్లలను అక్కడే చదివిస్తే వారి ఆలోచనలు ఎలా మారుతాయి? వివక్ష ఎలా పోతుంది? అని ప్రశ్నించారు. మనుషుల మధ్య వివక్ష పోవాలని ఆకాంక్షించారు. కులం అడ్డుగోడల్ని బద్దలు కొట్టేందుకు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఆ పాఠశాలల ద్వారా ఆయా సామాజిక తరగతులకు చెందిన దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు ఒకే చోట చదువుకునే అవకాశం ఏర్పడుతుందనీ, వివక్షను రూపుమాపేందుకు ఇది ఒక మార్గమని చెప్పారు. రెండేండ్లలో ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నవారికి ఇవి కనిపించడం లేదా? అని అడిగారు.

విద్యార్థుల్లో అవసరమైన నాలెడ్జిని, స్కిల్స్‌ను అందించేందుకు స్కిల్‌ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేశామనీ, అందులో ఒక డైరెక్టర్లుగా ఉన్న ఆనంద్‌ మహీంద్రా, దేవయ్యలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్‌ చదివిన పిల్లలకు దరఖాస్తులు నింపలేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సరైన స్కిల్స్‌ లేకపోవడం వల్లే మన పిల్లలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారని చెప్పారు. దానికోసమే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. 2036 నాటికి ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి క్రీడాకారులు గోల్డ్‌మెడల్స్‌ సాధించాలనే లక్ష్యంతో యంగ్‌ ఇండియా స్పోర్స్ట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. స్టార్టప్‌లు ఏర్పాటు చేసేవారికి, పరిశోధనలు చేసేవారికి సహాయం చేసేందుకు రూ.వెయ్యి కోట్ల కార్పస్‌ ఫండ్‌ను కేటాయించామని తెలిపారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినోడిననీ, తెలంగాణకు పట్టిన చీడపీడల్ని ఏ విధంగా పారదోలాలో తనకు తెలుసన్నారు.

రెండేండ్లలో ఓయూ సమస్యల్ని పరిష్కరిస్తాం
కొందరు పదేండ్లుగా ఓయూని నిర్వీర్యం చేయాలని చూశారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తాను మాత్రం రెండేండ్లలో ఉస్మానియా విశ్వవిద్యాలయం సమస్యల్ని పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఓయూలోని వెయ్యి అధ్యాపక పోస్టుల భర్తీ కోసం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. ఫైరవీకారులు సూచించే టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వకండి. విద్యార్థుల భవిష్యత్తు, జీవితాలతో ఆటలాడుకోకండి అని సూచించారు. ప్రొఫెసర్ల పోస్టుల కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులెవరైనా ఫైరవీలు చేస్తే వారి ఉద్యోగాలు ఊడగొడ్తానని హెచ్చరించారు. పిల్లలను ప్రయోజనకారులుగా తీర్చిదిద్దే వారినే టీచర్లుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీల ఉచ్చుల్లో పడి చదువులను ఆగం చేసుకోవద్దని సూచించారు. అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాలన్నారు.

ఇక్కడ చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మేధావులు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులుగా మారి ప్రపంచాన్ని నడిపించాలని ఆకాంక్షించారు. నిబద్ధతతో ఉండండి..కష్టపడండి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సభలో ఓయూ వీసీ కుమార్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చింతకింది కాశీం మాట్లాడారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చింతకింది కాసీం, ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌, మాజీ ఎంపీలు కేకే, వీహెచ్‌, ప్రొఫెసర్‌ ఆకునూరి మురళి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన, గంటా చక్రపాణి, గణపతిరెడ్డి, సుబ్రమణ్యం, తిరుపతిరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఓయూలో నిరుద్యోగుల నినాదాలు
సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగాన్ని ముగించుకుని వెళ్తున్న సమయంలో కొంతమంది నిరుద్యోగులు ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. అటువైపు వెళుతున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను ఉద్దేశించి ‘మీకు ఉద్యోగాలు వచ్చాయి..మాకు ఉద్యోగాలు ఎక్కడ ? జ్యాబ్‌ క్యాలెండర్‌ ఏమైంది?’ అని ప్రశ్నించారు. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నా నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం ఎంతవరకు సమంజసమని అడిగారు. ఈ సందర్భంగా పలువురు ఓయూ కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని చాలాసార్లు సీఎంను వేడుకున్నా, కనీసం వాటి ప్రస్తావన కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓయూలోని బీఆర్‌ఎస్‌వీ, ఏబీవీపీ, మాలమహానాడు అనుబంధ విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -